AP Government: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ప్రభుత్వం అనుమతులు
ABN, Publish Date - Jun 27 , 2025 | 10:11 PM
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు రేమండ్ గ్రూప్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాప్తాడు, గుడిపల్లి, టేకులోడు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు, రాయితీపై భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు రేమండ్ గ్రూప్‌కు (Raymond Group) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అనుమతి ఇచ్చింది. రాప్తాడు, గుడిపల్లి, టేకులోడు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు, రాయితీపై భూమి కేటాయింపునకు ఆదేశాలు జారీ చేసింది.టెక్స్‌టైల్స్ , ఆటోకాంపోనెంట్, ఏరోస్పేస్ తయారీ పరిశ్రమలను రేమండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. రూ.1,201.95 కోట్ల పెట్టుబడితో 3 గ్రామాల పరిధిలో రేమండ్ గ్రూప్ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పనుంది. పరిశ్రమల ఏర్పాటుతో 6,571 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది.
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో రూ.330 కోట్లతో వస్త్రాల తయారీ పరిశ్రమను రేమండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. వస్త్ర పరిశ్రమ కోసం ఎకరం రూ.20 లక్షల చొప్పున 26.87 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద రూ.256 కోట్లతో ఏరోస్పేస్ కాంపొనెంట్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం ఎకరం రూ. 37.72 లక్షల చొప్పున 29.51 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతపురం జిల్లాలోని సోమందేపల్లె మండలం గుడిపల్లి వద్ద రూ.430 కోట్లతో ఆటో కాంపొనెంట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. పరిశ్రమ ఏర్పాటు కోసం ఎకరం రూ.45.95 లక్షల చొప్పున 24.39 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థలకు ప్రభుత్వ పాలసీల ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని వర్తింపజేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 27 , 2025 | 10:18 PM