ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati Victory: అజరామరం

ABN, Publish Date - May 02 , 2025 | 07:29 AM

1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది

ఫలించిన 1,631 రోజుల అన్నదాతల పోరాటం

మరావతి.. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని. గత టీడీపీ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న రాజధానికి.. వైసీపీ సర్కారు ‘మూడు రాజధానుల’ పేరిట సమాధి కట్టేందుకు కుట్ర చేసింది. విద్వేష రాజకీయాలతో నయవంచన చేసింది. రాజధాని రైతుల ఐదేళ్ల సుదీర్ఘ పోరాటంతో అమరావతికే అంతిమ విజయం దక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మళ్లీ పట్టాలెక్కుతోంది. గత ప్రభుత్వం చేసిన గాయాలను మాన్పుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్మాణ పునఃప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ విజయం అమరావతికి అంత ఆషామాషీగా దక్కలేదు. నాడు రాజధాని లేని రాష్ట్రం కోసం తమ ప్రాణ సమానమైన 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు.. ఆ రాజధానికి కష్టమొచ్చినప్పుడు రక్షణ కవచంగా నిలిచారు. మరోమారు త్యాగాలతో కూడిన పోరాటం చేసి కాపాడుకున్నారు. మట్టి మనుషుల త్యాగాలతో మొదలైన రాజధాని ప్రస్థానం.. ఇప్పుడు మహానగర నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. 2015లో ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతి.. మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా శుక్రవారం పునఃప్రతిష్ఠ చేసుకోనుంది. ఈ సందర్భంగా రాజధాని రైతుల పోరాటంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..


జగన్‌ నయవంచన

2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం అవసరమైంది. రాజధాని రాష్ట్రం నడిబొడ్డున ఉండాలన్నది అప్పటి ప్రభుత్వం ఆలోచన. దానికి అనుగుణంగా గుంటూరు-కృష్ణా మధ్యన రాజధాని వస్తుందని ప్రకటించింది. ప్రభుత్వంపై భారం పడకుండా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భూసమీకరణ చేపట్టారు. ఆయన పిలుపు మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూసమీకరణ కింద ఇచ్చారు. భూములను త్యాగం చేసినవారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ మద్దతు పలికారు. అయితే ఒక్క చాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆ తర్వాత మాట మార్చారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అక్కడంతా ఒక సామాజికవర్గం వారే ఉన్నారని ఆరోపణలు చేశారు. అత్యంత విఫల నమూనా అయిన దక్షిణాఫిక్రా మూడు రాజధానుల విధానాన్ని ముందుకుతెచ్చి వితండవాదం చేశారు. 2019 డిసెంబరు 17న జగన్‌ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రకటన చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని వస్తాయని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి పేరిట అమరావతిని అటకెక్కించారు. నమ్మిన నాయకుడు నయవంచన చేయడంతో విధిలేని పరిస్థితిలో ఆ మరుసటి రోజే అన్నదాతల ఉద్యమం మొదలైంది.


నాలుగున్నరేళ్ల మొక్కవోని దీక్ష

రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రైతులు, మహిళలు, ప్రజలు 2019 డిసెంబరు 18న అమరావతి పరిరక్షణ మహోద్యమం ప్రారంభించారు. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం క్రమంగా రాజధాని గ్రామాలకు విస్తరించింది. ఆ ఏడాది డిసెంబరు 19వ తేదీన రైతులు బంద్‌ నిర్వహించారు. రైతుల ఉద్యమానికి ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత బహుజనులు, మైనారిటీలు ఏకమై ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. అన్నదాతల మహోద్యమం 1631 రోజుల పాటు సాగింది. దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం పాటు క్రియాశీలంగా సాగిన ఉద్యమం మరొకటి లేదు. 2020 మార్చి 20న కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలోనూ లాక్‌డౌన్‌ నియమాలను పాటిస్తూ ఇళ్లలోనే నిరసన దీక్షలు కొనసాగించారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనే అమరావతి ఉద్యమం వందోరోజు పూర్తి చేసుకుంది.

ఎన్‌ఆర్‌ఐల కొవ్వొత్తుల ప్రదర్శన

2020 జూలై 4న ఉద్యమం 200వ రోజు సందర్బంగా 175 అసెంబ్లీ స్థానాల్లో రైతులకు సంఘీభావంగా ప్రజలు దీక్షలు చేపట్టారు. 200 నగరాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 2020 ఆగస్టు 26న విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్టోబరు 12న 300వ రోజు సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 92 మంది రైతులకు నివాళిగా తుళ్లూరులో ‘ఆత్మబలిదాన యాత్ర’ నిర్వహించారు.


మోదీకి లేఖలు

2021 ఏప్రిల్‌ 31న ఉద్యమం 500వ రోజు సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, ఐకాస నేతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు. 2021 ఆగస్టు 8న 600వ రోజు సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకూ ర్యాలీకి పిలుపునిచ్చారు. అప్పటికి మరణించిన రైతులు, కూలీల సంఖ్య 170కి చేరింది. 2021 నవంబరు 1 చేపట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పాదయాత్ర ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. నవంబరు 1న హైకోర్టు వద్ద మొదలై, డిసెంబరు 17న తిరుమల తిరుపతి దేవస్థానం చేరేవరకూ 57 రోజులపాటు రైతులు పాదయాత్ర చేశారు. నవంబరు 16న ఉద్యమం 700వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు.

రాజధాని సంకల్ప ర్యాలీ

2021 జనవరి 20న ఉద్యమం 400వ రోజు సందర్భంగా రైతులు చేపట్టిన ‘రాజధాని సంకల్ప ర్యాలీ’ విజయవంతమైంది. తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం మీదుగా మందడం వరకూ సాగింది. ఇన్‌సైడర్‌ పేరుతో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇది ఉద్యమకారుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచింది.


మహాపాదయాత్ర 2.0

2022 సెప్టెంబరు 12 నాటికి అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా అమరావతి టూ అరసవెల్లి పేరిట 630 కిలో మీటర్ల మహా పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. దారి పొడవునా రైతులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోలీసుల నిర్బంధాలు, వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో రైతులు పాదయాత్ర కొనసాగించారు. అమరావతి-కోనసీమ వరకూ సాగిన ఈ పాదయాత్రకు ప్రాంతాలకతీతంగా ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమైంది. దీంతో ఆందోళన చెందిన ప్రభుత్వం ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. విధిలేని పరిస్థితిలో అక్టోబరు 22న పాదయాత్రను రైతులు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ముఖ్యనేతలు మిగిలిన పాదయాత్రను పూర్తిచేసి 2024ఫిబ్రవరి అరసవెల్లి స్వామివారిని దర్శించుకుని రైతుల మొక్కులు చెల్లించుకున్నారు.

అమరావతి ప్రజాదీక్ష

2022 ఫిబ్రవరి 24న ఉద్యమం 800 రోజు సందర్భంగా యువకులు పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. రైతులు అమరావతి ప్రజాదీక్ష చేపట్టారు. 24గంటల దీక్షలో 800 మంది, 12 గంటల దీక్షలో 2000 మంది పాల్గొన్నారు.


భూసమీకరణ అంటే..

భూసమీకరణ ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వం భూములు తీసుకుంటుంది. భూములిచ్చిన రైతులకు డబ్బులకు బదులు రాజధానిలో రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్లాట్లు కేటాయిస్తుంది. ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించి, వాటిని అభివృద్ధి చేసి ఇస్తుంది. తద్వారా వాటికి విలువ పెరుగుతుంది. దీంతో పాటు పట్టా, అసైన్డ్‌ భూములకు ఏడాదికి రూ.50 వేలు, 30 వేలు చొప్పున పదేళ్ల పాటు ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. ఈ మేరకు గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు అతి తక్కువ సమయంలో 34 వేల ఎకరాలను అప్పగించారు.

దిగ్బంధాలు దాటి..

‘మాట తప్పను.. మడమ తిప్పను’.. మాజీ సీఎం జగన్‌ తన గురించి గొప్పగా చెప్పే మాట ఇది. రాజధాని అమరావతి విషయంలో మాట తప్పి, మడమ తిప్పడమే కాదు నయవంచన చేశారు. 2019 ఎన్నికల ముందు రాజధాని అమరావతికి మద్దతు పలికిన జగన్‌... అధికారంలోకి వచ్చాక ‘మూడు రాజధానులు’ అంటూ మోసం చేశారు. అమరావతి కోసం ఉద్యమించిన అన్నదాతలపై పోలీసులను ఉసిగొల్పి చిత్రహింసలు పెట్టారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు దాడి చేశారు. బీసీ, దళిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. అయినా సహనంతో భరించి 1631 రోజులపాటు ఉద్యమాన్ని సాగించారు.

పోలీసుల గుప్పిట్లో..

జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేసిన మరుసటి రోజే 2019 డిసెంబరు 18న రాజధాని ఉద్యమం మొదలైంది. ఆ తర్వాతి రోజు అమరావతిలో రైతులు బంద్‌ నిర్వహించారు. అనూహ్య స్పందన రావడంతో జగన్‌ ప్రభుత్వం వెంటనే 30 యాక్ట్‌, 144 సెక్షన్లతో రాజధాని గ్రామాలను గుప్పిట్లో బంధించింది. అయినా ఉద్యమం ఆగలేదు. డిసెంబరు 31న తమకు కారుణ్య మరణాలకు అనుమతించాలని రాజధాని రైతులు సామూహికంగా రాష్ట్రపతికి లేఖలు రాసి తమ ఆవేదనను తెలిపారు.


అసెంబ్లీ ముట్టడి

2020 జనవరి 20న అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ముట్టడిని భగ్నం చేయడానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేయని ప్రయత్నం లేదు. ముందస్తుగా అరెస్టులు చేశారు. అయినా రైతులు, మహిళలు, రైతుకూలీలు, దళిత బహుజనులు ఎవరికి వారుగా చెట్లు, పొదలు, తుప్పల మాటున దాక్కొంటూ అసెంబ్లీ చేరుకున్నారు. పోలీసుల రక్షణ వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీ గేటు వరకూ ఉద్యమకారులు దూసుకెళ్లారు. సంక్రాంతి పండగను కూడా ఉద్యమ వేదికగా చేసుకుని ‘సంక్రాంతి సెగలు’ పేరిట నిరసన తెలిపారు. బోస్టన్‌ కమిటీ నివేదిక ప్రతులు బోగిమంటల్లో వేశారు.

రైతులకు సంకెళ్లు

రైతులు ‘అమరావతి రైతుల చూపు మోదీ వైపు’పేరిట గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల శిబిరానికి వెళుతున్న ఆటోలను అడ్డుకున్నారంటూ దళిత, బీసీ రైతులు 11 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి చేతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేశారు.


మహాపాదయాత్రకు అడ్డంకులు

2022 సెప్టెంబరు 12 నాటికి ఉద్యమం మొదలై వెయ్యి రోజులు. ఈ సందర్భంగా అమరావతి టూ అరసవెల్లి పేరిట మహాపాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. కోనసీమ జిల్లా వరకూ సాగిన యాత్రకు ప్రజల నుంచి భారీ మద్దతు రావడంతో ప్రభుత్వం ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. నిర్బంధాన్ని పెంచింది. దీంతో అక్టోబరు 22న పాదయాత్రను రైతులు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

మహిళలపై దౌర్జన్యం

2020 జనవరి 10న దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకునేందుకు వెళుతున్న మహిళలపై పోలీసులు దాడి చేశారు. అప్పటి గుంటూరు ఎస్పీ విజయరావు లాఠీలతో మహిళలపై విరుచుకుపడ్డారు. ఇటుక రాళ్లతో దాడి చేయడం, మహిళల జుట్టు పట్టుకుని లాగడం వంటి పోలీసుల అనైతిక చర్యలు ప్రపంచాన్ని కదిలించాయి. దీనిపై హైకోర్టు ఆ ఏడాది జనవరి 13న సూమోటోగా కేసు నమోదు చేసింది.


హైకోర్టు చరిత్రాత్మక తీర్పు

2022 మార్చి 4వ తేదీన హైకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసి అందజేయాలని, ఆరు నెలల్లోగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జూన్‌ 4న ఉద్యమం 900 రోజు సందర్భంగా రైతులు న్యాయదేవతకు క్షీరాభిషేకం చేశారు. విజయవాడలో ‘హైకోర్టు తీర్పు- సర్కారు తీరు’ పేరిట సదస్సు నిర్వహించారు.

-(గుంటూరు/అమరావతి-ఆంధ్రజ్యోతి)

Updated Date - May 02 , 2025 | 07:29 AM