Ananthapuram News: చావు పక్కనే సంబరాలు.. హార్మోని సిటీలో అమానవీయం
ABN, Publish Date - Jan 01 , 2026 | 10:57 AM
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.
- విద్యుదాఘాతంతో యువకుడి మృతి
- న్యూ ఇయర్ ఈవెంట్‌లో దుర్ఘటన
అనంతపురం: ఒక కాకి చనిపోతే వందల కాకులు వచ్చి గోల గోల చేస్తాయి. తమదైన భాషలో బంధం ప్రకటిస్తాయి. బాధను పంచుకుంటాయి. పక్షులు, జంతువులు.. తమలో ఒకటి ప్రాణం కోల్పోతే ఖచ్చితంగా స్పందిస్తాయి. బంధం తెగిపోయిందని బాధపడతాయి. కానీ కొన్ని సంఘటనలను చూసినప్పుడు మనిషిలో క్రమంగా మానవీయ స్పందన మాయమౌపోతోందేమో అన్న అనుమానం కలుగుతుంది. రాప్తాడు(Raptadu) మండల పరిధిలోని హార్మోని సిటీలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు ఇలాంటి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. పొట్టకూటి కోసం కష్టపడే ఓ యువకుడు విలవిలలాడుతూ ప్రాణాలను కోల్పోతే, మృతదేహాన్ని అలా పక్కకు తప్పించి.. సంబరాలను కొనసాగించారు. ఇంతకంటే దారుణం ఇంకొక్కటి ఉంటుందా..?
డబ్బుకు లోకం దాసోహం
హార్మోని సిటీలో ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ, పలువురు బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల చేత న్యూ ఇయర్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున జనం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కుర్చీకి రూ.1000 సోఫాకు రూ.2,500, రౌండ్ టేబుల్‌కు రూ.2000 చొప్పున (ఒక్కొక్కరికి) టిక్కెట్లను విక్రయించారు. భారీ ఎత్తున స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఈవెంట్‌కు కనీస భద్రతా చర్యలు తీసుకోలేదు. పోలీసు, అగ్నిమాపకశాఖ సహా ఎవరి నుంచీ అనుమతి తీసుకోలేదు. ఈ విషయాన్ని అధికారులు ముందురోజే నిర్ధారించారు. అక్కడ అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏమిటని పలువురు ప్రజా సంఘాల నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. అయినా అధికారులు, నిర్వాహకులు పట్టించుకోలేదు. ఫలితంగా నిండు ప్రాణం బలైంది. ఇంత జరిగినా అందరి మౌనానికి కారణం డబ్బు కాక మరేమిటి..?
శ్రమజీవి బలి
అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ హార్మోని సిటీలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. సింగర్ మంగ్లీ ఈవెంట్‌కు అచ్యుత్ అనే వ్యక్తి అన్ని ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. మైక్, లైటింగ్ సహా అన్ని పరికరాలు అతనే తెప్పించి ఏర్పాట్లు చేయిస్తారని తెలిసింది. కానీ ఆ పనుల్లో సాయం కోసం షౌకత్‌తోపాటు మరికొందరిని పిలిపించారని తెలిసింది. వేదికపై లైటింగ్, మైక్‌కు సంబంధించిన పనులు చేస్తుండగా సాయంత్రం 6 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. జనరేటర్‌కు పవర్ సప్లై కావడంతో షౌకత్ ప్రాణాలను కోల్పోయాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా తమ్ముడు చనిపోయాడు సార్. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈవెంట్‌ను అలాగే కొనసాగిస్తున్నారు..’ అని షౌకత్ సోదరుడు బోరన విలపించాడు. మృతదేహాన్ని వేదికపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు.
సంబరాల వ్యాపారం
2025కు వీడ్కోలు పలికి.. 2026కు స్వాగతం పలికే పేరిట నిర్వాహకులు వ్యాపారానికి తెరలేపారు. అనంతపురం జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో డబ్బులు వసూలు చేశారు. ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ముందురోజే పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈవెంట్ జరిగే ప్రాంతానికి వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. వందలాది కుటుంబాలకు చెందిన పిల్లలు, మహిళలు వేడుకలకు హాజరైనచోట ఎలాంటి భద్రత లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అనుమతి లేదు..
ఈవెంట్‌కు అనుమతి తీసుకోలేదని పోలీసు, అగ్నిమాపకశాఖ అధికారులు ముందురోజే ప్రకటించారు. మద్యం లేకుండా ఈవెంట్ జరుగుతోందని, మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక రోజు ముందు స్పందించారు. షౌకత్ మృతిచెందిన కొన్ని గంటల తరువాత అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, రాప్తాడు, ఇటుకలపల్లి, అనంతపురం రూరల్ సీఐలు అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత ఈవెంట్‌ను కాసేపు ఆపేసి, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. రాత్రి 10 గంటల సమయంలో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి, సంబరాలను కొనసాగించారు. ఈ సంఘటనపై పోలీసులుగాని, ఇతర అధికారులుగాని స్పందించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News
Updated Date - Jan 01 , 2026 | 10:57 AM