Hyderabad Crime Report 2025: యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025 విడుదల.. సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..
ABN, Publish Date - Dec 27 , 2025 | 01:57 PM
యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionerate) పరిధిలో ఈ ఏడాది(2025 నేరాలు తగ్గినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్(CP Sajjanar) తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 15 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని వెల్లడించారు. కానీ, మహిళలు, చిన్నారులపై మాత్రం నేరాలు పెరిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన సీపీ సజ్జనార్.. 2025 యాన్యువల్ క్రైమ్ రిపోర్టును విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గగా.. హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం తగ్గిందని చెప్పుకొచ్చారు. మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని.. 2024 సంవత్సరంతో పోలిస్తే 6 శాతం మేర పెరిగిందని తెలిపారు.
చిన్న పిల్లలపై నేరాల( ఫోక్సో కేసులు) విషయంలోనూ గతేడాదితో పోలిస్తే 27 శాతం పెరిగినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. సైబర్ క్రైమ్ నేరాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయని.. మెుత్తం 2,286 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు సంబంధించి 740 కేసులు, మ్యాట్రిమోని మోసాలు-12, వాట్సాప్ డీపీ మోసాలు-8, జాబ్ పేరుతో మోసాలు-43, ఓటీపీ మోసాలు-458 కేసులు నమోదైనట్లు సజ్జనార్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే రేప్ కేసులు తగ్గాయని.. మెుత్తం 405 కేసులు నమోదైనట్లు తెలిపారు. 2024తో పోలిస్తే హత్య కేసులు తగ్గాయని.. 69 కేసులు రికార్డైనట్లు ఆయన పేర్కొన్నారు. కిడ్నాపింగ్ కేసుల విషయంలోనూ పోయిన సంవత్సరంతో పోలిస్తే తగ్గాయని.. 166 మాత్రమే నమోదు అయ్యాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై 3,190, చీటింగ్ 4,536 కేసులు రికార్డ్ అయ్యాయని తెలిపారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి గతేడాదితో పోలిస్తే కేసులు పెరిగాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఈ ఏడాది 368 కేసులు నమోదయ్యాయని.. 2,690 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 26,379 ఫిర్యాదులు అందాయని.. రూ.319కోట్లు నష్టం, రూ.54 కోట్లను అధికారులు హోల్డ్ చేసినట్లు తెలిపారు. క్రైమ్ విషయంలో కమిషనరేట్ పరిధిలో మెుత్తం 19,831 కేసులు నమోదయ్యాయని.. కోర్టులో 4,463మందికి శిక్షలు ఖరారైనట్లు తెలిపారు.
ఇక, ట్రాఫిక్ విషయానికొస్తే.. సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు గతేడాదితో పోలిస్తే పెరిగాయని.. మెుత్తం 1,26,140 కేసులు రికార్డైనట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2024తో పోలిస్తే తగ్గి 49,732 కేసులు నమోదైనట్లు చెప్పారు. మెుత్తం 52,803 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. మైనర్ డ్రైవింగ్స్ కేసులు భారీగా పెరిగాయని.. 7,808 నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల కేసులు 2,679 నమోదు అవ్వగా 294మంది మృతిచెందారని.. 2,950మందికి గాయాలైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు 105మంది మృతిచెందగా.. 788 మందికి గాయపడినట్లు చెప్పారు. భరోసా సెంటర్ ద్వారా 2025లో 85 అవగాహన సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు.
షీటీమ్స్‌కు సంబంధించి 1,114 కేసులు నమోదు అవ్వగా.. 3,817 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ కింద 896 మంది పిల్లలను రెస్క్యూ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో మెుత్తం 1,247 మందిని రక్షించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ పెరిగిందంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్ పైనా సీపీ సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందని.. గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పుకొచ్చారు. ఒక్క సెన్సేషనల్ కేసుతో క్రైమ్ పెరిగినట్లు కాదని ఈ సందర్భంగా సజ్జనార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో పోలిస్తే హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్, క్రైమ్ రేట్ అదుపులోనే ఉందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Year Ender 2025: విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం
Year Ender 2025-Digital Gold: బంగారం కొనుగోళ్లు.. డిజిటల్ గోల్డ్‌కు జైకొట్టిన జెన్ జీ
Updated Date - Dec 27 , 2025 | 02:00 PM