Year Ender 2025-Digital Gold: బంగారం కొనుగోళ్లు.. డిజిటల్ గోల్డ్‌కు జైకొట్టిన జెన్ జీ
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:31 AM
ఈ ఏడాది డిజిటల్ గోల్డ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 16 వేల కోట్ల పైచిలుకు డిజిటల్ గోల్డ్‌ను భారతీయులు ఈ ఏడాది కొనుగోలు చేశారు. ఈ అంశంలో జెన్ జీ, మిలీయల్స్ తరానికి చెందిన యువత ముందంజలో ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. అయితే, జనాలను ఈ సంవత్సరం షాక్‌కు గురి చేసిన ముఖ్యమైన అంశం బంగారం, వెండి ధరలేనని చెప్పకతప్పదు. ఈ ఏడాది రెండు లోహాలూ ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇక భారత్‌లో డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ పెరగడం మరో ఆసక్తికర పరిణామం. ముఖ్యంగా ఈ ట్రెండ్ వేళ్లూనుకోవడంలో జెన్ జీ, మిలీనియల్స్ కీలక పాత్ర పోషించారు. డిజిటల్ గోల్డ్‌పై ఈ ఏడాది పెట్టుబడి పెట్టిన వారిలో 50 శాతం మంది జెన్ జీ, మిలీనియల్స్ తరాల వారే కావడం గమనార్హం (Digital Gold Trend in India)
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జనవరి-నవంబర్ మధ్యలో భారతీయ యువత ఏకంగా 12 టన్నుల మేర డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేశారు. కొనుగోలుదార్ల వద్ద ఉన్న ప్రస్తుతమున్న డిజిటల్ గోల్డ్ విలువ రూ.16,670 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈసారి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు దాదాపు రెట్టింపయ్యాయి.
డిజిటల్ గోల్డ్ విక్రయాలు ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. నగలు, లేదా కాయిన్స్‌ను వ్యక్తిగతంగా డెలివరీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ గోల్డ్‌పై కనీస పెట్టుబడి మొత్తం కేవలం రూ.1 కావడంతో జనాలు తమ శక్తి మేరకు పెట్టుబడి పెడుతూ ఎంతో కొంత లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణి యువతలో ఎక్కువగా ఉంది. వివిధ ఫిన్ టెక్ వేదికలు, యాప్స్ ద్వారా యువత డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేస్తోంది.
డిజిటల్ గోల్డ్ మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణ ఉండదని సెబీ ఇటీవల స్పష్టం చేయడంతో డిజిటల్ గోల్డ్ దూకుడు కొంత తగ్గింది. ఏ నియంత్రిత కమోడిటీ మార్కెట్ పరిధిలోకి డిజిటల్ గోల్డ్ రాదని సెబీ స్పష్టం చేసింది. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌పై పెట్టుబడులకు ఉన్న రక్షణలు ఉండవని వివరించింది. కాబట్టి, పెట్టుబడులపై రిస్క్ ఎంత అనేది పూర్తిగా తెలుసుకోవాలని అలర్ట్ చేసింది.
అయితే, డిజిటల్ గోల్డ్.. పారదర్శకమైన, సమర్థవంతమైన పెట్టుబడి విధానమని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్న మొత్తాల్లో బంగారం సొంతం చేసుకునేందుకు డిజిటల్ గోల్డ్ ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. బంగారం నిల్వ, స్వచ్ఛతకు సంబంధించిన ఆందోళన ఉండదని కూడా అంటున్నారు. భారతీయుల అవసరాలకు అనుగుణంగా బంగారాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ గోల్డ్ సహకరిస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఇవీ చదవండి
Most Searched Words 2025: ఈ ఏడాది జనాలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు
Year Ender 2025: విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం