Year Ender 2025: విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:38 PM
సామాన్యులకు సైతం విమానయానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని తీసుకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు చిన్న నగరాల్లో సైతం ఎయిర్ పోర్టులు నిర్మించింది.. నిర్మిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే 171 ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 250 మందికిపైగా ప్రయాణికులు మరణించారు. వారిలో విమాన సిబ్బంది సైతం ఉన్నారు. ఈ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. ఆ సమయంలో హాస్టల్‌లో భోజనం చేస్తున్న పలువురు మెడికోలు సైతం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ప్రమాదం నుంచి ఒక్క ప్రయాణికుడే ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులకు రూ. కోటి నష్టపరిహారం అందిస్తామని టాటా గ్రూప్ సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత మరణించిన ప్రయాణికుల ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నాయో తమకు తెలపాలంటూ వారి కుటుంబ సభ్యులకు టాటా సంస్థ స్పష్టం చేసింది. దాంతో మృతుల కుటుంబాలు ఆందోళన వ్యక్తమైంది. రతన్ టాటా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని తీసుకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు చిన్న నగరాల్లో సైతం ఎయిర్ పోర్టులు నిర్మించింది.. నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే విమానాల్లో బాంబులు, ఆర్డీఎక్స్ పెట్టామని.. అవి పేలిపోతాయంటూ దేశంలోని పలు నగరాల్లోని ఎయిర్‌పోర్టులకు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ బెడద అధికమైంది. ఈ ఏడాది జనవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఇదే రీతిగా ఆకతాయిల బెదిరింపుల పర్వం కొనసాగుతోంది.
ఈ తరహా బెదిరింపుల వల్ల గమస్థానానికి బయలుదేరిన విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితోపాటు ఎయిర్ పోర్టు సిబ్బంది తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ లో వచ్చిన బెదిరింపులతో ప్రయాణికులకు కిందకు దించి.. ఎయిర్ పోర్టులో విమానాలను క్షుణ్ణంగా భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. చివరకు విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవంటూ భద్రతా సిబ్బంది ప్రకటనలు చేస్తున్నారు.
ఈ ఏడాది కాలంలో ఈ తరహా ఘటనలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఫోన్ కాల్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా.. బెదిరింపులకు పాల్పడుతున్న ఆకతాయిల పని ఇప్పటి వరకు పట్టకపోవడం విశేషం. ఈ తరహా ఘటనలతో ప్రయాణికులు తీవ్రంగా కలత చెందుతున్న విషయం విదితమే.
ఇదొక్కటే కాదు వాన రాకడ.. ప్రాణం పొకడ ఎవరికి తెలియదన్నట్లుగా ఎయిర్‌పోర్టు నుంచి విమానం ఎప్పుడు బయలుదేరుతుందో.. ఎప్పుడు ల్యాండ్ అవుతుందో చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వివిధ సంస్థలకు చెందిన విమానాల్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో విమాన సర్వీసులను ఆకస్మాత్తుగా రద్దు చేస్తున్నారు.
దాంతో విమానం ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే చిక్కుకు పోతున్నారు. దీంతో పిల్లాపాపలతో ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు అక్కడ నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ ఏడాదిలో చాాలానే ఉన్నాయి. అందుకు ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల వ్యవహారమే ఉదాహరణ. ఏదీ ఏమైనా ప్రస్తుతం విమానం ఎక్కితే.. గమ్యస్థానం చేరుకుంటామో? లేదో? అనే సందేహం మాత్రం సామాన్య మానవుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నది మాత్రం అసలు సిసలు వాస్తవం.