ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Project: కాళేశ్వరం అవకతవకలు.. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..

ABN, Publish Date - Aug 04 , 2025 | 03:41 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం.. అసెంబ్లీలో చర్చ

  • మూడు రోజుల పాటు సభ.. సభ్యులందరికీ కమిషన్‌ నివేదిక.. సిట్‌ వేయడమా.. చర్యలకు ఉపక్రమించడమా?

  • నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం.. అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించే యోచన

  • అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ.. సచివాలయంలో భేటీ అయిన అధికారుల కమిటీ

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు వరంగా గత సర్కారు అభివర్ణించిన కాళేశ్వరం.. ప్రజాధనం వృథా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్‌ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై.. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, కీలక నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే క్యాబినెట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే.. ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైనా చర్చించనున్నారు. దాంతోపాటు.. శాసనసభ సమావేశాలు నిర్వహించి, సభ్యులందరికీ విచారణ కమిషన్‌ నివేదికను అందించి.. దానిపై చర్చ జరపాలనే యోచనలోనూ సర్కారు ఉన్నట్టు సమాచారం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అసలేం జరిగిందనేది ప్రజలకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. కాగా కాళేశ్వరంపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్‌ కమిషన్‌ అందించిన నివేదికపై అధ్యయనానికి.. సాధారణ పరిపాలన, న్యాయ, సాగునీటి పారుదల శాఖల ముఖ్యకార్యదర్శులతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

ఆ కమిటీ ఆదివారం సాయంత్రం సచివాలయంలో భేటీ అయి చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల ఖర్చు వ్యవహారంపై.. పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికలో పలు సిఫారసులు కూడా చేసింది. ఆ సిఫారసుల మేరకు నేరుగా చర్యలకు ఉపక్రమించాలా? లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా? అనే అంశంపై క్యాబినెట్‌ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీ్‌షరావు, ఈటల పాత్రల గురించి వివరించిన కమిషన్‌.. అధికారుల ప్రమేయం, వారు నిర్వర్తించిన పాత్రల గురించి కూడా వివరించింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ ప్రస్తావించిన అఽధికారులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనేదానిపైనా కీలకంగా చర్చించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అప్పటి ఈఎన్‌సీ మురళీధర్‌, హరిరామ్‌.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు. అలాగే అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీ, సీఎంవో అదనపు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సభర్వాల్‌తో పాటు మరికొంత మంది అధికారులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదే మొదటిసారి..

కాళేశ్వరం ఒక్క అంశంపైనే రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇలా ఒకే అంశం ఎజెండాగా క్యాబినెట్‌ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారాన్ని సర్కారు ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలోనూ ఒకే ఎజెండాపై క్యాబినెట్‌ భేటీ జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. అలాగే ఇదే అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయిస్తే.. అలా ఒకే అంశంపై అసెంబ్లీ నిర్వహించడం కూడా తొలిసారి అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  • కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చించే అవకాశం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తారు. మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో సమావేశమై క్యాబినెట్‌ నోట్‌ తయారీపై చర్చించారు. నివేదికపై అధ్యయనం చేేసందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారుల కమిటీ సూచనలపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చిస్తారు. బాధ్యులపై ఏసీబీతో అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపించాలా లేక సిట్‌ ఏర్పాటు చేయాలా అనే అంశాలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 06:36 AM