Tollywood Industry: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..
ABN , Publish Date - Aug 03 , 2025 | 07:33 PM
తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిపి వేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్, ఆగస్ట్ 03: తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే.. సోమవారం నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిపి వేయాలని నిర్ణయించింది. 30 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా టాలీవుడ్ కార్మిక సంఘాల ఫెడరేషన్‌కు తెలుగు ఫిలిం చాంబర్‌కు మధ్య జీతాల విషయంలో చర్చలు నడుస్తున్నాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి తమ జీతాలు పెంచాలని కార్మిక సంఘాల ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే మూడేళ్ల దాటినా జీతాలు పెంచకపోవడం పట్ల కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆ క్రమంలో ఇటీవల తెలుగు ఫిలిం చాంబర్ తో ఆయా సంఘాల ఫెడరేషన్ ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు సైతం జరిపారు. తాము 30 శాతం పెంచలేమని.. కేవలం 7 నుంచి 8 శాతం వరకు మాత్రమే పెంచగలమని వారికి ఫిలిం చాంబర్ ప్రతినిధులు క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. ఫిలిం చాంబర్ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలను కార్మిక సంఘాల ఫెడరేషన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆగస్ట్ 01వ తేదీ నుంచి తమకు వేతనాలు పెంచి ఇవ్వకుంటే షూటింగ్స్ కు హాజరుకాకూడదని నిర్ణయించారు. మరోవైపు సమాఖ్యలోని కార్మికులు ఎవరూ.. సోమవారం నుంచి సినిమాల షూటింగులు, వెబ్ సిరిస్ తదితర షూటింగ్‌లకు హాజరు కాకూడదంటూ అల్టీమేటం జారీ చేసింది. ఇది తెలుగు భాషా చిత్రాలకే కాకుండా.. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఇతర భాషా చిత్రాలకు సైతం వర్తిస్తుందని కార్మికులకు చెందిన సమాఖ్య ప్రకటించింది. మరోవైపు ఫిలిం చాంబర్, కార్మిక సంఘాల ఫెడరేషన్‌కు మధ్య చర్చ కోసం మధ్యవర్తుల కమిటీని ఏర్పాటు చేశారు. అయితే తాజా నిర్ణయంపై తెలుగు ఫిలిం చాంబర్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
తొలి రోజు జైలులో ప్రజ్వల్ రేవణ్ణ..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News