ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NHRC Advisory: గాలివానతో అతలాకుతలం

ABN, Publish Date - May 02 , 2025 | 04:27 AM

తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్‌హెచ్‌ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

  • భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో వర్ష బీభత్సం

  • విరిగిపడిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు.. దెబ్బతిన్న పంటలు

  • మరోవైపు మండుతున్న ఎండలు.. వడదెబ్బతో ఒకరి మృతి

  • వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోండి: ఎన్‌హెచ్‌ఆర్సీ

  • తెలంగాణ, ఏపీ సహా 11 రాష్ట్రాలకు పలు సూచనలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి గాలివాన అతలాకుతలం చేసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భూపాలపల్లి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగిపడి.. కరెంట్‌ సరఫరా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల ఉధృతికి చేతికి అందివచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా.. తోటల్లో మామిడి కాయలు రాలి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరింది. భూపాలపల్లి జిల్లాలో కాటారం, మలహర్‌, రేగొండ, గణపురం మండలాల్లో ఈదురుగాలులు కల్లోలాన్ని సృష్టించాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. చేలల్లో ధాన్యం రాలిపోయుంది. పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడడంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మలహర్‌ మండలం తాడిచర్లలో పలు రేకుల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గంట పాటు ఈదురుగాలులతో వాన కురిసింది. భూపాలపల్లి-హనుమకొండ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి చాలాచోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగిపడి కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ములుగుతో పాటు పలు గ్రామాల ప్రజలు రాత్రంతా అంధకారంలో గడపాల్సి వచ్చింది. గోవిందరావుపేట మండలంలోని చల్లాయిలో సుమారు 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో వైరా, కామేపల్లి, సింగరేణి, సత్తుపల్లి, మధిర, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు ప్రాంతాల్లో గాలివాన పడింది. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. బలమైన గాలులు వీయడంతో కోతకు వచ్చిన మామిడికాయలు నేల రాలడంతో ఉద్యాన రైతులకు నష్టం జరిగింది.


తీవ్రంగానే ఎండలు..

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.8 డిగ్రీలు, అదే జిల్లా గొల్లపల్లిలో 44.7, బుగ్గారంలో 44.6, ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరిలో 42.1, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 42 డిగ్రీల చొప్పున రికార్డయింది. పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీ పరిధిలోని గంగాపురిలో వడదెబ్బ కారణంగా హమాలీ కూలీ పులి మణి (55) మృతి చెందాడు.

వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోండి: ఎన్‌హెచ్‌ఆర్సీ

ఎండల తీవ్రత, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 11 రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సూచించింది. 2018 నుంచి 2022 మధ్య వేడిగాలులు, వడదెబ్బ వల్ల 3,798 మంది మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఎన్‌హెచ్‌ఆర్సీ లేఖలు రాసింది. బలహీన వర్గాలు, కార్మికులు, వృద్ధులు, పిల్లలు, నిరాశ్రయుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. కార్మిక కాలనీల్లో ఫ్యాన్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరఫరా చేయాలని, పని గంటలను సవరించాలని, నీడ ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకునేలా చూడాలని తెలిపింది. వేడిగాలుల నుంచి ప్రజలను రక్షించడానికి తీసుకున్న ముందస్తు చర్యలపై నివేదిక అందించాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.


For Telangana News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:30 AM