NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ
ABN, Publish Date - May 06 , 2025 | 05:27 AM
నీట్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో.. పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు ప్రైవేటు సంస్థల ‘కీ’తో కుస్తీ పడుతున్నారు.
‘నీట్’పై అనవసర ఆందోళన వద్దు: నిపుణులు
ప్రైవేటు సంస్థల కీతో కుస్తీ పడుతున్న విద్యార్థులు
తమకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): నీట్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో.. పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు ప్రైవేటు సంస్థల ‘కీ’తో కుస్తీ పడుతున్నారు. తమకు కచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం ఉన్న ఉత్తమ విద్యార్థులు సైతం.. ‘కీ’ చూసిన తర్వాత ఢీలా పడిపోతున్నారు. పరీక్షకు ముందున్న ఆత్మవిశ్వాసం.. ఇప్పుడు చాలామందిలో కనిపించట్లేదు. తమకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందో రాదోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అయితే.. మార్కుల విషయంలో అనవసరంగా ఆందోళన చెందవద్దని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది మార్కులతో పొల్చితే ఈసారి కనీసం 100-150 మార్కులు తగ్గుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు.. 720కి 700 మార్కులు కచ్చితంగా వస్తాయని భావిస్తున్న మెరికల్లాంటి విద్యార్థులకు సైతం 550 మార్కులే వచ్చే పరిస్థితి కనిపిస్తోందని పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో బోధించే నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఈసారి మార్కులు తగ్గినప్పటికీ సీటు గ్యారంటీగా వస్తుందని భరోసా ఇస్తున్నారు. సగటు విద్యార్థి కంటే మెరిట్ విద్యార్థే ఈసారి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. నీట్ పరీక్షలో 180 ప్రశ్నలుంటే, సరైన జవాబుకు ఒక్కొదానికి 4 మార్కులిస్తారు. తప్పు సమాధానమిస్తే ఒక మార్కు మైనస్ అవుతుంది. సగటు విద్యార్థులంతా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో మొత్తం 520 మార్కులకుగాను సగటున 400-450 వరకు స్కోర్ చేస్తారని.. ఫిజిక్స్ కఠినంగా రావడంతో వారిలో చాలామంది కేవలం 15-20 ప్రశ్నలకే జవాబు రాసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అవి కూడా కలుపుకొంటే మొత్తంగా సగటు విద్యార్థులు 460-530 మఽధ్యలో స్కోర్ చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే మెరిట్ స్టూడెంట్స్ మాత్రం ఫిజిక్స్‌లో అన్ని ప్రశ్నలనూ అటెంప్ట్ చేసి, నెగిటివ్ మార్కులు తెచ్చుకునే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే యావరేజ్ స్టూడెంట్స్ కంటే మెరిట్ వారికే ఈసారి నష్టం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
600 దాటితే ఎయిమ్స్‌లో సీటు
గత ఏడాది నీట్‌లో కనీసం 680 మార్కులు సాధించిన వారికే.. దేశవ్యాప్తంగా ఉన్న ఆలిండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలో ఎంబీబీఎస్ సీటు దక్కింది. ఈ ఏడాది పేపరు కఠినంగా రావడంతో 600 పైచిలుకు వస్తే జనరల్ కేటగిరీలో సీటు దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలంగాణలో నిరుడు జనరల్ కేటగిరీలో 660 మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి రౌండ్‌లో ఆలిండియా కోటాలో సీటు దక్కింది. ఈడబ్ల్యూఎ్‌సలో 654, ఓబీసీలో 659, ఎస్సీలో 575, ఎస్టీలో 547 మార్కులు సాధించిన వారికి సీటు దక్కింది. ఈ ఏడాది తెలంగాణలో 400 మార్కులకు పైగా వస్తే జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు తక్కువ పోటీ ఎక్కువగా ఉండటంతో అక్కడ కనీసం 470 మార్కులు పైచిలుకు సాధిస్తే జనరల్ కేటగిరీలో సీటు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు.
నీట్ సరిగా రాయలేదని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఘటనలు
జగిత్యాలరూరల్/ ఉట్నూర్, మే 5 (ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపం చెంది జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామానికి చెందిన జంగ పూజ (19) రెండేళ్ల క్రితం ఇంటర్ పూర్తి చేసింది. పూజ గతంలో రెండుసార్లు నీట్ పరీక్ష రాసినా సీటు సాధించలేదు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని ఓ కళాశాలలో నీట్ రాసింది. సోమవారం నీట్ ‘కీ’ని పరిశీలించగా అందులో తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన రాయి మనోజ్ (18) ఆదివారం హైదరాబాద్‌లో నీట్ పరీక్ష రాసి, సోమవారం ఇంటికి వచ్చాడు. పరీక్షలో కఠినమైన ప్రశ్నలు వచ్చాయని, సరిగ్గా రాయలేదని తల్లిదండ్రులకు తెలిపిన మనోజ్, నిద్రపోతానని చెప్పి తన గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News
Updated Date - May 06 , 2025 | 05:27 AM