KTR: మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి?
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:59 AM
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల చెల్లింపులు ఎందుకు చేశారు? రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకొన్న ఏస్ నెక్ట్స్‌జెన్ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లు ఎందుకు చెల్లించింది..
ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు?
ఏస్‌నెక్ట్స్‌జెన్ మీ పార్టీకి రూ.49 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఎందుకిచ్చింది?
విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది?
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ ప్రశ్నలు
2వ సారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ 7 గంటలకుపైగా విచారణ.. 60 దాకా ప్రశ్నలు
వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి!
రేపటిలోగా ఫోన్లు అప్పగించాలన్న ఏసీబీ
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల చెల్లింపులు ఎందుకు చేశారు? రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకొన్న ఏస్ నెక్ట్స్‌జెన్ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లు ఎందుకు చెల్లించింది? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మీరు అధికారులకు నేరుగా (మౌఖిక) ఆదేశాలు ఎలా ఇచ్చారు? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘించారు?’’ ..అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు ఏడుగంటలకుపైగా సాగిన విచారణలో వారు ఆయన్ను 60 దాకా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ దర్యాప్తు అధికారుల ఎదుట రెండోసారి విచారణకు హాజరయ్యారు. గతంలో విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు.. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు, ఈ కేసులో ఎఫ్‌ఈవో కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన పత్రాలు, సమాచారం ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి, మరింత లోతుగా విచారించి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
ఎందుకు? ఏమిటి? ఎలా?
ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. తన న్యాయవాది రాంచందర్‌రావుతో కలిసి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సీఐయూ డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందం అప్పట్నుంచీ నుంచి సాయంత్రం ఐదున్నర దాకా.. 7 గంటలకుపైగా ఆయన్ను ప్రశ్నించింది. ‘‘ఎలాంటి లాభాపేక్షా లేకపోతే ఎఫ్‌ఈవో కంపెనీకి నిధుల చెల్లింపుల్లో నిబంధనలు అతిక్రమించాల్సిన అవసరం ఏమిటి? అసలు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు చెల్లించారు? నిధుల చెల్లింపుల్లో క్విడ్ ప్రోకో జరిగిందా? రేసు నిర్వహణలో త్రైపాక్షిక ఒప్పందం ఏమిటి? అసలు అగ్రిమెంట్‌కు నాలుగు నెలల ముందు ఏర్పాటు చేసిన కంపెనీకి బాధ్యతలు ఎలా ఇచ్చారు? కేవలం రూ.2 లక్షలు క్యాపిటల్‌తో ఉన్న కంపెనీకి బాధ్యతలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?’’ అంటూ దర్యాప్తు అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని.. కొన్నింటికి మాత్రం మౌనంగా ఉన్నారని.. కొన్ని ప్రశ్నలకు ‘తెలియదు’ అనే సమాధానం ఇచ్చారని సమాచారం. కాగా.. ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాలు మొదలైనప్పటి నుంచి రేసు ముగిసేంత వరకు.. అంటే 2021 నుంచి 2024 వరకు ఉపయోగించిన సెల్ ఫోన్లను అప్పగించాల్సిందిగా కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. సోమవారం విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ ఫోన్ సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. తాను ఫోన్ తీసుకురాలేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో.. 2021-2024 మధ్యకాలంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లను 18వ తేదీలోగా అప్పగించాలని అధికారులు ఆదేశించారు.
ఎదురు ప్రశ్నలు..
విచారణ సందర్భంగా.. దర్యాప్తు అధికారులు అడిగిన కొన్నిప్రశ్నలకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తాన్నీ అధికారులే చూసుకున్నారని.. హెచ్‌ఎండీఏ నిధులు ఎఫ్‌ఈవోకు పంపించానని, తన సొంత ఖాతాకు కాదని.. ఏసీబీ ఆరోపిస్తున్న ప్రకారం ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో స్పష్టం చేయాలని అధికారుల్ని కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గడంతో ఎఫ్‌ఈవో ఒత్తిడి మేరకు మరో స్పాన్సర్‌ను వెతకలేక పోయామని, అందుకే హెచ్‌ఎండీఏ నిధుల నుంచి ఫీజు చెల్లించామని కేటీఆర్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలిసింది.
ఏసీబీ క్యాంటీన్‌లోనే భోజనం
విచారణకు హాజరైన కేటీఆర్‌కు దర్యాప్తు అధికారులు బయటి నుంచి భోజనం తెచ్చుకోవడానికి అనుమతించలేదు. దీంతో ఆయన ఏసీబీ కార్యాలయంలోని క్యాంటీన్‌లోనే మధ్యాహ్న భోజనం చేశారు. పచ్చిపులుసు, టమాట పప్పు, మిక్స్‌డ్ కర్రీ, అన్నం, రెండు చపాతీలు తిన్నారు. టీ బ్రేక్‌లో రెండుసార్లు చాయ్ తాగారు. గతంలో విచారణకు హాజరైన సమయంలోనూ కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:59 AM