GHMC BJP Protest: గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:00 PM
GHMC BJP Protest: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్, జూన్ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం (GHMC Office) వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బల్దియా కార్యాలయం ముందు బీజేపీ (BJP) ఆందోళనకు దిగింది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు కమలం నేతలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వీధిదీపాలు, రోడ్ల సమస్యతో పాటు డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ నిరసనకు దిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిషనర్ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించిన కార్పొరేటర్లు, బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, బీజేపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. రామ్‌నగర్ కార్పోరేటర్లు గోడలు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు , బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్ గేట్ ముందు కూర్చుని బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్‌లో వీధి దీపాలు, రోడ్లు సరిగా లేకపోవడం, నాలాల పూడిక తీయకపోవడం వంటి అనేక సమస్యలు నగర వాసులను వెంటాడుతున్నాయని, తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను చెప్పేందుకు వస్తే గేట్లు మూసేసి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. విశ్వనగరంగా చెబుతున్న హైదరాబాద్ ఇప్పుడు వీధి దీపాలు లేక అంధకారంలో ఉందన్నారు. వీధిదీపాలు లేని కారణంగా గల్లీల్లో, కాలనీల్లో గంజాయికి అడ్డాలుగా మారాయని తెలిపారు. యువత పక్కదారి పడుతోందని, మద్యం సేవించి మహిళలను ఇబ్బందిపెట్టే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లోనే ఇలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆ పార్టీ నేతలు నిలదీశారు. తప్పకుండా బల్దియా కమిషనర్‌ను కలుస్తామని.. తమను లోపలికి పంపించకపోతే కమిషనర్ బయటకు వచ్చే వరకు ఇక్కడే ఉండి ఆందోళన చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News