Uttam Kumar Reddy: ఆ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం.. మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jan 24 , 2025 | 09:30 PM
Uttam Kumar Reddy:బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీటిలో మోసం, దగా జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డి పాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకెళ్లారని.. ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీష్ రావు అసమర్థత కారణంగా తెలంగాణ తీవ్రంగా నష్ట పోయిందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో నష్టం జరిగిందని అన్నారు. కాళేశ్వరం కూలితే కనీసం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పలేదన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... ఐఏఎస్ అధికారుల గురించి చిల్లరగా మాట్లాడవద్దని చెప్పారు. హరీష్‌రావు చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. వాళ్ల హయాంలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా కేటాయింపులు చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బనకచర్లపై సీ ఆర్. పాటిల్‌కు లేఖ రాశాం
‘‘లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే ఏమైంది.. వాళ్ల టైంలో కట్టింది.. వాళ్ల హయాంలోనే కూలింది. గోదావరి - బనకచర్ల కట్టినట్లు ఏపీ నీళ్లు తీసుకెళ్లినట్లు హరీష్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. బనకచర్ల విషయంలో మేము చాలా అలెర్ట్‌గా ఉన్నాం. కేంద్ర మంత్రి సీ ఆర్. పాటిల్‌కు లేఖ రాశాం. ఆ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం అని స్పష్టం చేశాం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు సరైంది కాదని స్పష్టం చేశాం. మేము నిర్మలా సీతారామన్‌కు కూడా లేఖ రాశాం. కృష్ణా ట్రిబ్యునల్‌కు స్వయంగా మంత్రిగా నేను హాజరై.. నీటి లెక్కలను సరి చేసే ప్రయత్నం చేశా. తెలంగాణకు 70 శాతం అడగాల్సి ఉంటే.. కేవలం 33 శాతానికి ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీటిలో మోసం, దగా జరిగింది. జీవో 203 ద్వారా పోతిరెడ్డి పాడు ద్వారా 790 అడుగుల నుంచే నీటిని తీసుకెళ్తుంటే.. ప్రగతి భవన్‌లో జగన్‌తో విందులు చేసుకున్నారు. తెలంగాణ రాక ముందు..కంటే.. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డి పాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకెళ్లారు. ఇది వారి వైఫల్యం కాదా..? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను.. రాయలసీమ లిఫ్ట్ టెండర్ల కోసం వాయిదా వేసిన ఘనత కేసీఆర్‌ది’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో కీలక నిర్ణయం
Dil Raju IT Raids: దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 24 , 2025 | 09:34 PM