TG Ministers Reaction on KCR Elkathurthy Meeting : కేసీఆర్ కామెంట్స్.. మంత్రులు రియాక్షన్
ABN, Publish Date - Apr 27 , 2025 | 09:36 PM
Ponguleti Srinivas Reddy: ఎల్కతుర్తి సభలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడడంపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీకి వందల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసంతా విషం నింపుకుని.. పదేపదే కాంగ్రెస్ పార్టీని విలన్‌లా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తి బహిరంగ సభ వేదిక పై నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్‌తోపాటు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్ అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్‌లో స్పందించారు. తమ ప్రభుత్వం ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే చెప్పొచ్చునన్నారు.
కేసీఆర్ ఏమైనా మంచి సూచనలు ఇస్తారనుకున్నామని తెలిపారు. కానీ కేసీఆర్‌లో ఉక్రోషం తప్ప వేరేమీ కనిపించ లేదన్నారు. కేసీఆర్ వల్లే ధనిక రాష్ట్రం కాస్తా అప్పులపాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులున్నా తమ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణను కొల్లగొట్టి లూటీ చేశారు కాబట్టే కేసీఆర్ ఓడిపోయారు ఆరోపించారు. కేసీఆర్ చేసిన పనులు అసెంబ్లీ సాక్షిగా చెబుదామనుకున్నాం.. కానీ కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఈ సందర్భంగా పొంగులేటి గుర్తు చేశారు.
కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. అభివృద్ధితోపాటు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు చేశారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల పట్ల కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరే అన్నది మీరు కాదా అంటూ కేసీఆర్‌ను ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి సూటిగా ప్రశ్నించారు.
తమ మంచి పాలన చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని వ్యంగ్యంగా అన్నారు. తమ ప్రభుత్వంలో సర్పంచ్‌లు రూపాయి పని కూడా చేయలేదు..ఆ సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వని పాపం బీఆర్‌ఎస్‌దేనని పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి వేలాది కోట్ల రూపాయిల ఆస్తులు ఎలా వచ్చాయంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేతను పొంగులేటి నిలదీశారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కి ఉందా? అన్ని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌తో మొగుడు, పెళ్ళాలు మాట్లాడుకోకుండా చేశారని మండిపడ్డారు. మొగుడు,పెళ్ళాల మధ్య, అన్నదమ్ముల మధ్య మాట్లాడుకున్న విషయాలు సైతం కేసీఆర్ విన్నారని చెప్పారు. జడ్జిల ఫోన్ సంభాషణలు కూడా విన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను తమ ప్రభుత్వం నెరవేరిస్తుందన్నారు. కేసీఆర్ పథకాల్లో ఒక్కటి కూడా మేం ఆప లేదని చెప్పారు. అసెంబ్లీ ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతామన్నారు.అందుకు తేదీలను డిసైడ్ చేయమని కేసీఆర్‌కి సవాలు విసిరారు. అభివృద్ధిపై చర్చించడానికి కేసీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే మాట్లాడుతారని విమర్శించారు. కేసీఆర్ ఏమైనా నిధులు ఉంచితే కదా.. మేం పంచేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 39వేల కోట్లను కొల్లగొట్టారని విమర్శించారు. సన్నబియ్యం పేదలకి ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా కేసీఆర్ మెచ్చుకోవడం లేదన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కుప్పకూలిందని ఆయన గుర్తు చేశారు.
బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాప్: మంత్రి పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాప్ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశఆరు. సభ ఫెయిల్‌ను పక్కదారి పట్టించేందుకు పోలీసులపై నెపం నెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ చెరువుల నీళ్లు తాగినా తెలంగాణ రాక పోయేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ విలన్ అనే మాటల్ని వెనక్కి తీసుకోవాలంటూ కేసీఆర్‌ను ఆయన డిమాండ్ చేశారు. స్పీచ్ మద్యలో మాటిమాటికి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కింది నుండి సీఎం సీఎం అంటున్నారు.. కానీ ఎవర్ని అంటున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీలో గౌరవమే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
అసెంబ్లీని సొల్లు కబుర్లు అంటారా?: మంత్రి సీతక్క
కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించింది. అసెంబ్లీకి రానివాడివి. నువ్వేం నాయకుడివంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. అసెంబ్లీ సొల్లు కబుర్లు అయితే మీ బచ్చగాళ్లని ఎందుకు పంపుతున్నావంటూ నిలదీశారు. రాష్ట్రం ఆగమైందని కేసీఆర్ అంటున్నాడు.. నియంత వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు..చెరువులు,వాగులు,ప్రభుత్వ కాలువలు మూసేసి కేసీఆర్ సభ పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. రూ. 60 వేల కోట్ల కరెంట్ బకాయిలు పెట్టాడంటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ అని అన్నారు. పోలీసులను సైతం కేసీఆర్ బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్ అంత నీచంగా పోలీసులను ఎవరు అవమాన పరచలేదన్నారు. ఫాం హౌజ్ దగ్గర పోలీసులను కాపలా పెట్టిన వ్యక్తి కేసీఆర్.. అధికారం పోయిందనే అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. అధికారం పోయిందనే బాధ తప్పా ప్రజలపై కేసీఆర్‌కి ప్రేమ లేదన్నారు. రజతోత్సవ సభలో పార్టీ విజయాలు మాట్లాడతారా? ప్రభుత్వంపై దుమ్ము పోస్తారా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకి ఉచిత బస్సు ఇస్తే దానిపై విమర్శలా? చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఉచిత బస్సు వాడుకోవడం వల్ల నెలకి ప్రతి మహిళలకు దాదాపు రూ. 4 వేలు మిగులుతున్నాయన్నారు.
పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ: మంత్రి జూపల్లి కృష్ణారావు
సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చిన దేవత అని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. ధనిక రాష్ట్రంలో కేసీఆర్ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ డిమాండ్ చేశారు. నాలుగైదు నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టారని చెప్పారు. కేసీఆర్ పథకాల్లో ఒక్కటైనా ఎత్తేశామా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పది సంవత్సరాల్లో రుణమాఫీ చేయలేదన్నారు. అక్షయపాత్ర లాంటి ఔటర్ రింగు రోడ్డును సైతం కేసీర్ అమ్మేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KCR In Elkathurthy Meeting: తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News
Updated Date - Apr 27 , 2025 | 10:06 PM