CM Revanth Reddy: విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
ABN, Publish Date - May 27 , 2025 | 08:35 PM
కలెక్టర్లు విధుల్లో యాక్టివ్‌గా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలని అన్నారు. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలుతోనేనని దుష్ప్రచారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(మంగళవారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు.
90 శాతం ధాన్యం సేకరణ పూర్తి...
ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందించారు. రుతుపవనాలు ముందుగా రాష్ట్రానికి రావడంతో మిగతా ధాన్యం సేకరించడం కొంత ఇబ్బందిగా మారిందని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించామని ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని ప్రకటించారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
అలా దుష్ప్రచారం చేశారు..
‘కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలుతోనేనని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు విధుల్లో యాక్టివ్‌గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిమిషం వృథా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. వానాకాలం సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
‘కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించుకోండి. భూ భారతి పేద రైతులకు చుట్టం. భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. భూ భారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయండి. జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడోదశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం. క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉంది. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి. మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలి. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించండి. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి. ఈనెల 29, 30 తేదీల్లో జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలి. జూన్ 1వ తేదీ నాటికి పూర్తి నివేదిక అందించాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 27 , 2025 | 09:03 PM