Warangal: మెడికల్ సీట్లలో అక్రమాలు!
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:19 AM
వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ గత వైస్‌చాన్స్‌లర్‌తోపాటు రిజిస్ర్టార్ తీరు మూలంగా 400 మంది వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ..
అర్హులకు దక్కని 400 ఎంబీబీఎస్ సీట్లు
2 కాలేజీలను డీమ్డ్ వర్సిటీలుగా మార్చడంలో చీకటి కోణం.. లోకాయుక్తలో ఫిర్యాదు
హనుమకొండ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ గత వైస్‌చాన్స్‌లర్‌తోపాటు రిజిస్ర్టార్ తీరు మూలంగా 400 మంది వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ వినియోగదారుల మండలి జాతీయ ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచెర్ల సుదర్శన్ లోకాయుక్తలో గురువారం ఫిర్యాదు చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అని, అయితే అవేమీలేకున్నా 400ఎంబీబీఎస్ సీట్లు గల రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలకు ఇచ్చిన డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వీసీ, రిజిస్ర్టార్‌లు డీమ్డ్ యూనివర్సిటీ సమాచారాన్ని ఏడు నెలల పాటు గోప్యంగా ఉంచడం, అర్హులైన మెడికల్ విద్యార్ధులు సీట్లు కోల్పోవడానికి కారణాలపై విచారణ జరపాలని లోకాయుక్తను కోరారు.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, కన్వీనర్, మేనేజ్‌మెంట్ సీట్ల సమాచారాన్ని వెబ్ ఆప్షన్స్ తేదీకి కావలసినంత ముందుగా విద్యార్థులకు తెలపాల్సి ఉండగా.. గోప్యత పాటించారని ఆరోపించారు. మెరిట్ విద్యార్థులు ప్రవేశాల దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత 52 రోజులకు గతేడాది సెప్టెంబరు 27న వెబ్‌ఆప్షన్ ప్రారంభానికి ఒక రోజు ముందు సీట్ల వివరాలను సైట్‌లో ఉంచారని, దీని వెనుక అతిపెద్ద మోసం దాగి ఉందన్నారు. అలాగే గత వీసీతో పాటు రిజిస్ట్రార్ వెబ్‌ఆప్షన్‌లో మూడు కాలేజీలైన మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ (200 సీట్లు), మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్ (200 సీట్లు), నీలిమా మెడికల్ కాలేజీ, మేడ్చల్ (150 సీట్లు) మొత్తం 550సీట్లు తగ్గిస్తూ వెబ్‌ఆప్షన్‌లో సమాచారాన్ని పొందుపరిచారన్నారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారడానికి వాటి యాజమాన్యాలు 2023 నవంబరు23న కాళోజీ హెల్త్ వర్సిటీకి దరఖాస్తు చేసుకోగా ఆ విషయాన్ని గత వీసీ 2024 మే 9న ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందిస్తూ డీమ్డ్ యూనివర్సిటీలుగా మార్చడంపై అభ్యంతరాలు కోరినట్టు తెలిపారు. అనంతరం గతేడాది మే18న యూజీసీ సమావేశమైందని, మల్లారెడ్డి రెండు కాలేజీల(400సీట్లు)ను డీమ్డ్ వర్సిటీలుగా సెప్టెంబరు 6న ప్రకటించినట్టు తమఫిర్యాదులో వివరించారు. దీంతో 400 సీట్లు ప్రభుత్వ అజమాయిషీ నుంచి వెళ్లిపోయాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్
Updated Date - Jun 29 , 2025 | 04:19 AM