CM Revanth Reddy: బిడ్డ ఓడిపోతే ఆర్నెల్లలోనే ఎమ్మెల్సీని చేశారు
ABN, Publish Date - May 29 , 2025 | 03:31 AM
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, బీసీలు.. బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలన్నట్లుగా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై మాజీ సీఎం నీళ్లు చల్లారన్నారు.
దళితులు, బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా?
బర్రెలు, గొర్రెలు పెంచుకుంటూ బతకాలా?
మాజీ సీఎం అలాంటి పథకాలే పెట్టారు
ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలిచ్చారు
కులం వల్ల గుర్తింపు రాదు..
చదువుతోనే వస్తుంది: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, బీసీలు.. బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలన్నట్లుగా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై మాజీ సీఎం నీళ్లు చల్లారన్నారు. ఆయన ఇంట్లో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. బిడ్డ ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెల్లలోనే ఎమ్మెల్సీని చేశారని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసింది. దళితులు చెప్పులు కుట్టుకోవాలా? యాదవులు గొర్రెలు కాసుకోవాలా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు’ అని బీఆర్‌ఎ్‌సపై రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. బుధవారమిక్కడ ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామన్నారు. కానీ, నోటికాడి కూడును లాగేసినట్లు రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేశాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్న వారిని గట్టిగా నిలదీయాలని రేవంత్ పిలుపునిచ్చారు.
విద్యార్థులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..
విద్యార్థులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కులం వల్ల ఎవరికీ గు ర్తింపు రాలేదు. మంచి చదువుతోనే అందరికీ గుర్తిం పు వచ్చింది. ఉస్మానియా చరిత్రలో తొలిసారి దళితుడిని వీసీగా నియమించిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ కోవలోనే పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల పదవులతోపాటు అసెంబ్లీ స్పీకర్ పదవిని దళితులు చేపట్టారు. వారికి కులం వల్లే అవకాశాలు రాలేదు. బాగా చదువుకుంటేనే వచ్చాయి’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు. కష్టపడి చదివితేనే గొప్ప అవకాశాలు వస్తాయన్నా రు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
6న ఆలేరుకు సీఎం రేవంత్
హైదరాబాద్, తుర్కపల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి జూన్ 6న యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి వెళ్లనున్నారు. రూ.1,500 కోట్ల విలువైన పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వాసాలమర్రిలో రూ.700కోట్లతో చేపట్టే గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి, రూ.183కోట్లతో జిల్లా మెడికల్ కళాశాల, రూ.200 కోట్లతో నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.23 కోట్లతో చేపట్టే వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వాసాలమర్రిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. దీనికి సంబంధించిన స్థలంతోపాటు హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 50వేల మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.
ఎన్టీఆర్.. తెలుగు జాతి కీర్తి శిఖరంః సీఎం రేవంత్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు జాతి కీర్తి శిఖరం.. తెలుగు వారి ఆత్మగౌరవ చిహ్నం. స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’’ అంటూ ఎన్టీఆర్ ఫొటోతో తన ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్ పోస్టు చేశారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..
Updated Date - May 30 , 2025 | 02:54 PM