CM Revanth Reddy: అభివృద్ధి దైవకార్యం
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:29 AM
నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అభివృద్ధి చేస్తే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అదే తరహాలో కంచగచ్చిబౌలిని అభివృద్ధి చేయాలని తాను ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల్లో పిటిషన్లు వేసి రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలను అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
రాక్షసుల్లా అడ్డుపడ్డా మా యజ్ఞం ఆగదు.. కేసులతో ఆపినా అది తాత్కాలికమే
కంచ గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తాం
నాలెడ్జ్ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో అక్కడ ఐదు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తాం
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సర్కారుది వివక్షే
8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమిచ్చారు?
కిషన్‌జీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి
నాగార్జున హీరోలా 2 ఎకరాలిచ్చారు.. ఎన్ కన్వెన్షన్ తొలగించినా మంచి కార్యక్రమాన్ని గుర్తించారు
నేను చదివే రోజుల్లో పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజీ
ఆయన అడ్డుకోకుంటే హైటెక్ సిటీ తరలిపోయేది
నగరానికి కృష్ణా జలాలు ఆయన పోరాట ఫలితమే పీజేఆర్ వంతెన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అభివృద్ధి చేస్తే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అదే తరహాలో కంచగచ్చిబౌలిని అభివృద్ధి చేయాలని తాను ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల్లో పిటిషన్లు వేసి రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలను అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు రాక్షసులు వచ్చి భగ్నం చేసే ప్రయత్నం చేశారని, అంతమాత్రాన యజ్ఞాలు ఆగలేదని, అలాగే ఎవరు అడ్డుపడ్డా అవాంతరాలను అధిగమించి హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గచ్చిబౌలి చౌరస్తాలో రూ.182 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల పీజేఆర్ వంతెనను శనివారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభ లో రేవంత్ మాట్లాడారు. రాజకీయ అవకాశవాదంతో ప్రభుత్వ కార్యక్రమాలనడ్డుకునే వారిని క్షమించుకుంటు పోదామా? అని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చి తమకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇచ్చారని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పనులు చేయకుండా కోర్టులో లిటిగేషన్ వేసి ప్రతిపక్షాలు నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నాలెడ్జ్ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి కొనసాగింపుగా గచ్చిబౌలి స్టేడి యం పక్కన 400 ఎకరాలు అభివృద్ధి చేస్తే మరో 5 లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని ఆశించామని తెలిపారు. అమెరికా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియాల్లో పర్యటించి దాదాపు రూ.2.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, సంస్థలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే పానకంలో పుడకలా అడ్డుకుంటున్నారని చెప్పారు. తాత్కాలికమైన ఈ అవాంతరాలతో ప్రభు త్వం వెనక్కి తగ్గదని, చట్టసభల్లో, న్యాయస్థానాల్లో కొ ట్లాడి అక్కడే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ప్రారంభించి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.
తమ ప్రభుత్వ ప్రస్తుత ఎజెండా అభివృద్ధేనని, ఎన్నికలప్పుడు తప్ప రాజకీయాలు చేయదలచుకోలేదన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వాళ్లు ఏదో బాగు చేస్తారని నమ్మి ఆ పార్టీ నుంచి సగం మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి మోదీ మొండి చేయి ఇచ్చారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ఏం తెచ్చారో గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ‘‘విపక్షాల పాలనలోని బెంగళూరు, చెన్నైలకు మెట్రో ప్రాజెక్టులిచ్చారు. ఏపీకి మెట్రో.. గుజారాత్ బుల్లెట్ రైలుకు 2లక్షల కోట్లు ఇచ్చారు. అహ్మదాబాద్‌కు సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్, యుపీకిగంగా రివర్ ఫ్రంట్ ఇచ్చారు. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే ఇవ్వలేదు. మెట్రో రైల్ ఇవ్వలేదు. రీజనల్ రింగ్ రోడ్డు అటకెక్కింది. ఎందుకీ వివ క్ష?’’ అని కిషన్‌రెడ్డిని నిలదీశారు. ‘‘భేషజాలు లేకుండా నగరాభివృద్ధి కోసం బీజేపీ నేతల వెంట వస్తానని చెప్పా. 35 సార్లు ఢిల్లీకి వచ్చా. మోదీని, అమిత్‌షాను కలిశా. నేను కలవని కేంద్ర మంత్రి లేడు. చేయని విజ్ఞాపన లేదు. రేపు వస్తున్న అమిత్ షాకు ఎయిర్ పోర్టులో స్వాగ తం పలికి మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్డు అడుగుతాం’’ అన్నారు. ‘‘ఈ 3 ఇస్తే హైదరాబాద్ ప్రపంచం తో పోటీ పడుతుం ది. న్యూయార్క్‌లోని వా ళ్లూ హైదరాబాద్‌కొ చ్చి నివసిస్తాం, ఫ్యూచర్ సిటీ లో వ్యాపారం చేసుకుంటామంటామనేలా హైదరాబాద్ తయారవుతుం ది. హాలీవుడ్, బాలీవుడ్‌ను తీసుకువస్తాం. మీ వంతు సహకరించండి. మా వైపు లోపముంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. నివేదికల్లో లోపముందా? మేం కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలా? చెప్పాలి’’ అని కేంద్రాన్ని కోరారు.
కిషన్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలిశా
హైదరాబాద్ 20 ఏళ్ల కిందట మెట్రోకి, 25 ఏళ్ల కింద ఔటర్ రింగ్ రోడ్డుకు, అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాదులు వేసుకొని, వందేళ్ల క్రితమే మూసీ రివర్ ఫ్రంట్ కట్టుకుందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మెట్రో విషయంలో ఢిల్లీ తరువాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయిందని, చిన్న చిన్న నగరాలు మెట్రో కట్టుకొని హైదరాబాద్‌ను దాటిపోతుంటే కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కిషన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సహకరిస్తే నాలుగేళ్లు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామని విజ్ఞప్తి చేశానన్నారు. ఎవరివి రాజకీయాలు? ఎవరివి కుట్రలు? అని ప్రశ్నించారు. కోర్ అర్బన్, సెమీ అర్బన్ రీజియన్లు, రూరల్ తెలంగాణలో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి కోసం డిసెంబరు 9 లోపు విజన్ డాక్యుమెంట్ విడుదలతో, 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దేశ రాజధాని ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చిందంటే ఢిల్లీలో సరైన ప్రణాళికలు లేక పోవడమే కారణమన్నారు. ‘‘వర్షాలు వస్తే చెన్నై అతలాకుతలం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఎయిర్ పో ర్టుకు వెళ్లాలంటే బెంగళూరులో 6 గంటల ముందు బ యల్దేరాలి. ఇతర నగరాల నుంచిగుణపాఠాలు నేర్చుకోవాలి. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడాలి’’ అన్నారు. కేంద్రంతో మాట్లాడి ఏడాదిలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి అందిస్తామన్నారు.
నాయకులకు స్ఫూర్తి పీజేఆర్
జంట నగరాలలో 20-25 యేళ్లు పీజేఆర్ శకం నడిచిందని, ఉపాధి కోసం ఎవరు నగరానికి వచ్చినా వారికి అండగా నిలబడి నిజమైన ప్రజానేతగా పని చేశారని సీఎం కొనియాడారు. ఆయన పోరాటం వల్లే నగర దాహార్తిని తీర్చేందుకు కృష్ణా, మంజీరా, సింగూరు జలాలు వచ్చాయన్నారు. హైటెక్ సిటీని మహారాష్ట్రకు తరలించే కుట్రలు జరిగినపుడు స్థానిక ఎమ్మెల్యేగా పీజేఆర్ అడ్డుకున్నారని చెప్పారు. ఏవీ కళాశాలలో తాను చదువుకొనే రోజుల్లో పక్కనే పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజీలాగా పని చేస్తూ ఉండేదని గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ వంతెనకు సమీపంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు స్థలం చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆనాడు నవ్వారు
విమానాశ్రయం అవతల లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నందునే 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేశామని సీఎం చె ప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి మెట్రోరైల్‌తో పా టు పెద్ద హైవే కారిడార్లు నిర్మిస్తామన్నారు. 20 వేల ఎకరాలు ఓపెన్ ఏరియా, 15 వేల ఎకరాలు పార్కులతో కాలుష్యం లేని నగరం నిర్మిస్తామన్నారు. 15 వేల ఎకరాల్లో రోడ్లు, భవనాలుంటాయన్నారు. చంద్రబాబు, వైఎ్‌స హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుల అభివృద్ధికి పూనుకున్నపుడు అంతా నవ్వారని, ఈ రోజు అభివృద్ధిని మనం కళ్లారా చూస్తున్నామని అన్నారు.
హీరోలా నాగార్జున రెండెకరాలు ఇచ్చారు
‘‘నాలాల అడ్డంకులు తొలగించి చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం, రోడ్లు వెడల్పు చేస్తున్నాం. వంతెనలు, అండర్‌పాస్‌లు కడుతు న్నాం. అన్యాయంగా ఆక్రమించుకొని చెరువుల్లో కట్టిన నిర్మాణాలను హైడ్రాతో తొలగిస్తున్నాం’’ అని సీఎం రాజధానిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌నూ తొలగించినా, తర్వాత ప్రభుత్వ మంచి కార్యక్రమాన్ని గుర్తించి ఆయనే స్వయంగా తనను కలిసి రెండెకరాలను చెరువు అభివృదికి అప్పగించారన్నారు. నగరాభివృద్ధిలో ఒక హీరోగా ముందుంటానని నాగార్జున చెప్పారని, సీఎం గుర్తు చేశారు. బతుకమ్మ కుంట కోసం వీహెచ్ పోరాడుతున్నారని, బీఆర్‌ఎస్ నేతలు ఆక్రమించుకుంటే హైకోర్టులో కొట్లాడి ఆరెకరాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2029 నియోజకవర్గాల పునర్విభజనలో శేరిలింగంపల్లి నాలుగైదు అసెంబ్లీ సెగ్మెంట్లుగా మారుతుందని సీఎం అన్నారు. నలుగురైదుగురు కొత్త ఎమ్మెల్యేలను తయారు చేసే బాధ్యతను ఎమ్మెల్యే గాంధీ తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు(అంకాలజిస్టు) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేశారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు చికిత్స, మెరుగైన వైద్యసేవల అంశాల్లో ఆయన సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నియమాకం చేపట్టింది. డాక్టర్ దత్తాత్రేయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల స్వయంగా కలిసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్
Updated Date - Jun 29 , 2025 | 05:30 AM