Vikram Chip: ఇండియా ఫస్ట్ సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్.. విక్రమ్-32 ప్రత్యేకతలు తెలుసా?
ABN, Publish Date - Sep 02 , 2025 | 05:07 PM
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
ఢిల్లీ: సెమీకండక్టర్ రంగంలో భారత్ కొత్త మైలురాయిని చేరింది. ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో విక్రమ్-32 బిట్ మైక్రోప్రాసెసర్ చిప్‌ను ప్రదర్శించారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఈ చిప్‌ను ఆవిష్కరించారు. దేశీయంగా తయారైన మొదటి సెమీకండక్టర్ చిప్ విక్రమ్-32 సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం.భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల కోసం కీలకమైన అడుగుగా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఇస్రో, చండీగఢ్‌లోని సెమీకండక్టర్ లేబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.దీనిని రాకెట్ ప్రయోగాలకు ఉపయోగిస్తారు.
ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తారు. ఈ సందర్భంగా తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ విక్రమ్-32 బిట్ మైక్రోప్రాసెసర్ ను ఆవిష్కరించారు. దీనిని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహూకరించారు. అలాగే, నాలుగు ఆమోదించబడిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధానికి అందజేశారు.నేటి అధునాతన సాంకేతికతకు సెమీకండక్టర్లే ఆధారం. ఆరోగ్య సంరక్షణ నుండి రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష పరిశోధన వరకు అనేక రంగాలలో వీటిని ఉపయోగిస్తున్నారు. డిజిటలైజేషన్, ఆటోమేషన్ పెరుగుదలతో ప్రతి దేశానికి ఆర్థిక, వ్యూహాత్మక స్వాతంత్య్రానికి సెమీకండక్టర్లు అతి ముఖ్యమైనవిగా మారాయి.అందుకే ప్రపంచంలోని పెద్ద దేశాలు.. ముఖ్యంగా అమెరికా, చైనా లు ఈ టెక్నాలజీలో తమను తాము బలోపేతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.
విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ అంటే ఏమిటి?
విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ అనేది భారతదేశపు మొట్టమొదటి దేశీయ 32-బిట్ మైక్రోప్రాసెసర్. ఈ చిప్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైనది. విక్రమ్-32ను అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ పనిచేయగలిగేలా రూపొందించారు. ఇది -55 డిగ్రీల సెల్సియస్ నుండి +125 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలకు తట్టుకోగలదు. అయితే, ఇది సాధారణ ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే చిప్ లాంటిది కాదు. దీన్ని పూర్తిగా అంతరిక్ష పరిశోధనల కోసం రూపకల్పన చేశారు. రాకెట్‌లు, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్ వంటి అత్యంత సున్నితమైన పరికరాల్లో దీనిని వినియోగించనున్నారు.2009లో విడుదలైన విక్రమ్-1601కి దీన్ని అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు.
32 బిట్ ప్రాసెసర్ స్పెషాలిటీస్ ఇవే..
విక్రమ్-32 చిప్ లాంచ్ వెహికల్స్‌లో నేవిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్‌మెంట్ వంటి కీలక పనులు చేస్తుంది. రాకెట్ సరైన మార్గంలో ప్రయాణించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతరిక్ష వాతావరణం సున్నితమైనది కావడంతో ఈ చిప్‌ను మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో తయారుచేశారు. దీన్ని అధిక వేడి, చలి, గరిష్ఠ రేడియేషన్ పరిస్థితుల్లోనూ టెస్ట్ చేశారు. విక్రమ్-32ను పీఎస్‌ఎల్‌వీ-సీ60 మిషన్‌లో ఉపయోగించి అంతరిక్షంలో పరీక్షించారు.ఆర్బిటల్ ఎక్స్‌పర్‌మెంట్ మాడ్యూల్‌లో మిషన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌గా దీనిని అమలు చేసిన తర్వాత ఇస్రోకు మంచి ఫలితాలు లభించాయి. దాదాపు 64 బిట్ చిప్ కు ఉన్న సామర్థ్యాలే దీనికి ఉన్నాయి. 2009లో తయారైన 16-బిట్ విక్రమ్ చిప్‌లకు అప్‌గ్రేడ్ వర్షన్ అని చెప్పవచ్చు. 2025 మార్చి 5న ఇస్రో ఛైర్మన్ నారాయణన్ విక్రమ్-32 చిప్స్ ఉత్పత్తి చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శికి స్ కృష్ణన్‌కు అందజేశారు.
అంతరిక్ష ప్రయోగాల్లో వాడే చిప్స్ సాధారణంగా మార్కెట్లో లభించవు.ఇప్పటి వరకు భారత్ ఈ తరహా చిప్స్ కోసం విదేశాల మీద ఆధారపడేది. విక్రమ్-32తో భారత్ పూర్తి స్వయం సమృద్ధి సాధించినట్లయింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలకు మరింత ఊతం ఇస్తుందనే చెప్పాలి. విక్రమ్-32 చిప్‌తో పాటు భారతదేశం అడా కంపైలర్లు, అసెంబ్లర్లు, లింకర్లు, సిమ్యులేటర్లు వంటి కీలక సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల అంతరిక్ష పరిశోధన పరికరాలు, హార్డ్‌వేర్, ముఖ్య అప్లికేషన్ల కోసం విదేశాలపై ఆధారపడే అవసరం తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి:
మీ ఫోన్‌లో డాటా సేఫ్‌గా ఉండాలంటే.. ఈ ఫీచర్స్‌ను వాడటం తప్పనిసరి
బెడ్‌రూమ్‌లోని వైఫై రౌటర్‌ను రాత్రి వేళ ఆఫ్ చేయాలనుంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..
Read Latest and Technology News
Updated Date - Sep 02 , 2025 | 06:11 PM