Richest Women Cricketers: భారత మహిళ క్రికెట్ జట్టులో ధనవంతులు వీరే..!
ABN, Publish Date - Nov 04 , 2025 | 06:50 AM
నవంబర్ 2న భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. వారి విజయం మహిళా క్రీడాకారిణులకు వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, మొత్తం దేశానికి గర్వకారణం. ఈ సందర్భంగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విజేత క్రీడాకారిణులకు రూ. 51 కోట్ల బహుమతిని ప్రకటించారు. దీనిని భారత మహిళా క్రికెట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే అద్భుతమైన విజయమని అభివర్ణించారు.
మిథాలీ రాజ్ ఆస్తి విలువ దాదాపు 40–45 కోట్ల రూపాయల ఉటుందని అంచనా. మిథాలీ రాజ్ తరచుగా అత్యంత సంపన్న భారతీయ మహిళా క్రికెటర్‌గా చోటు దక్కించుకుంటుంది. నిజమైన లెజెండ్ అయిన మిథాలి దేశానికి అనేక చారిత్రాత్మక విజయాలకు అందించింది. ఒక తరం యువ క్రీడాకారిణికి స్ఫూర్తినిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, మెంటర్‌షిప్, క్రికెట్ సంబంధిత ప్రాజెక్టుల ద్వారా తన జీవతాన్ని కొనసాగిస్తోంది.
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారిణులలో ఒకరు. ఆమె నికర ఆస్తి విలువ దాదాపు 32–34 కోట్లు ఉంటుందని అంచనా. ఇది ప్రధానంగా ఆమె మ్యాచ్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారా సంపాదించింది.
భారత జట్టును అన్ని ఫార్మాట్లలో నడిపించే హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తి విలువ ₹24–26 కోట్లు అని అంచనా. ఆమె సంపాదన బహుళ వనరుల నుంచి వస్తుంది. ఆమెకు రూ.50 లక్షల విలువైన BCCI గ్రేడ్ A వార్షిక ఒప్పందం ఉంది. అలాగే.. ముంబై ఇండియన్స్‌తో రూ.1.8 కోట్ల WPL ఒప్పందం, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఉన్నాయి.
మాజీ పేస్ లెజెండ్ ఝులన్ గోస్వామి నికర విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె తన అద్భుతమైన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ద్వారా సంపాదించింది. పదవీ విరమణ తర్వాత కూడా, ఆమె లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనడం, ఎయిర్ ఇండియాతో కలిసి పనిచేయడం ద్వారా క్రీడతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది.
షఫాలీ వర్మ భారత మహిళా క్రికెట్ జట్టులో అత్యంత పిన్న వయస్కురాలు. అత్యంత డైనమిక్ క్రీడాకారిణులలో ఒకరు. ఆమె నికర విలువ సుమారు రూ.8–11 కోట్లు ఉంటుందని అంచనా వేయబడింది. ఆమె WPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనికి ఆమెకు రూ. 2 కోట్ల ఒప్పందం ఉంది.
దీప్తి శర్మ నికర విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఆల్ రౌండర్‌ను WPLలో UP వారియర్జ్ 2.6 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. నివేదికల ప్రకారం, ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తుంది.
Updated Date - Nov 04 , 2025 | 06:51 AM