ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: 100 మందిని హతమార్చాం

ABN, Publish Date - May 09 , 2025 | 04:24 AM

పాక్‌, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది.ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి తెలిపారు.

  • పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు.. 9 స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేశాం

  • ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతోంది..

  • పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేం

  • అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, మే 8: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన క్షిపణి దాడుల్లో 100 మంది దాకా ముష్కరులు హతమయ్యారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత బలగాలు మెరుపు దాడులతో విరుచుకుపడ్డాయని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట నిర్వహించిన ఈ దాడుల గురించి వివరించేందుకు గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘పాక్‌, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేం. ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ, పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం.. వెనక్కి తగ్గేదే లేదు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుంది’’ అని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ సందేశాన్ని రాజ్‌నాథ్‌ చదివి వినిపించారు. ‘‘భారతీయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు విలేకరులతో మాట్లాడారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణమంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే, ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సాంకేతిక అంశాలను వెల్లడించలేదు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదు’ అని రిజిజు పేర్కొన్నారు. విపక్ష నేతలు పలు విలువైన సలహాలు, సూచనలు కూడా ఇచ్చారని తెలిపారు. దేశ భద్రత, భారతీయులందరినీ సురక్షితంగా ఉంచడం, ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతా ల్లో నెలకొన్న పరిస్థితులపై కొంత ఆందోళన వ్యక్తం చేసినా.. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని చెప్పారు. యావత్‌ దేశం కేంద్రానికి, భద్రతా బలగాలకు అండగా ఉన్నాయన్న సందేశం ఇచ్చారని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతం చేసిన మన బలగాలకు విపక్ష నేతలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


ఐక్యంగా నిలబడతాం: రాహుల్‌

‘‘ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా ఉంటాయి. దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కొనసాగుతోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు’’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తాము కేంద్రానికి అండగా నిలుస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. ఇది సున్నితమైన అంశమైనందున, దేశ భద్రత దృష్ట్యా కొన్ని ప్రశ్నలు అడగరాదని రక్షణ మంత్రి చెప్పారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతున్నందున పూర్తి వివరాలు ఇప్పుడే తెలియజేయలేమని కూడా రాజ్‌నాథ్‌ చెప్పారని ఖర్గే వివరించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లవుతుందని రాహుల్‌ ప్రభుత్వానికి సూచించారని తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ రాకపోవడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నుంచి ఖర్గే, రాహుల్‌ హాజరుకాగా, డీఎంకే, శివసేన, మజ్లిస్‌, ఎన్సీపీ, ఎస్పీ, ఆప్‌, సీపీఎం, జేడీయూ, ఎల్జేపీ నేతలు హాజరవగా.. కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమిత్‌ షా, నిర్మల, జైశంకర్‌, జేపీ నడ్డా పాల్గొన్నారు. మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతం చేసిన భారత బలగాలు, ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అలాగే పహల్గాంలో అమాయకులను పొట్టనపెట్టుకున్న టీఆర్‌ఎ్‌ఫకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఐరాస భద్రతా మండలి టీఆర్‌ఎ్‌ఫను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించాలని కోరారు. పాక్‌ మద్దతిస్తున్న ఉగ్రవాదులు భారత్‌లో జిహాద్‌ పేరిట హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూంచ్‌, ఉరీల్లో పాక్‌ బలగాల కాల్పుల్లో ప్రాణ, ఆస్తినష్టం జరిగిన కుటుంబాలకు పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతం చేసిన భద్రతా బలగాలను అభినందిస్తూ పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పీఏసీ తొలిసమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు అధ్యక్షుడు కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 04:25 AM