ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Droupadi Murmu: రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా?

ABN, Publish Date - May 16 , 2025 | 04:42 AM

రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు.

  • రాజ్యాంగంలోనే అటువంటి నిబంధన లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు?.. అది ఎలా చెల్లుబాటు?

  • 200, 201 అధికరణాల కింద గవర్నర్‌, రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో అధికారాలుంటాయి

  • కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు

  • అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది?

  • 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • ఆర్టికల్‌ 143(1) కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, మే 15: రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు గత నెల 8న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని? అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143(1) అధికరణం ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొన్న రాష్ట్రపతి ముర్ము.. ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరారు. రాజ్యాంగంలోని 200 అధికరణం కింద బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపే ప్రక్రియలో గవర్నర్లకు కొన్ని అధికారాలు ఉంటాయి. అదేసమయంలో ఈ ప్రక్రియకు గడువు కూడా ఏమీ లేదు. అలాగే 201 అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉంటాయి. ఆ అధికరణంలో కూడా గడువు విధించలేదు. ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదానికి గవర్నర్‌, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ముర్ము 14 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నూతన సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


రాష్ట్రపతి సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..

1. గవర్నర్‌ వద్దకు బిల్లులు వచ్చినప్పుడు ఆర్టికల్‌ 200 కింద ఆయనకు ఉండే రాజ్యాంగపరమైన అవకాశాలు ఏంటి?

2. ఆ అవకాశాల విషయంలో మంత్రివర్గం సలహాలకు గవర్నర్‌ కట్టుబడి ఉండాలా?

3. ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయొచ్చా?

4. ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలపై న్యాయ పరిశీలన చేయకుండా ఆర్టికల్‌ 361 ప్రకారం పూర్తిగా నిషేధించవచ్చా?

5. ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్లకు అధికారాలు ఉండగా.. రాజ్యాంగపరంగా ఎలాంటి గడువూ విధించకపోయినా.. బిల్లుల ఆమోద ప్రక్రియలో వారికి కోర్టులు గడువులు విధించవచ్చా? ఏ ప్రక్రియను అనుసరించాలనే విషయాన్ని సూచించవచ్చా?

6. ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారాలపై న్యాయ సమీక్ష చేయొచ్చా?

7. రాష్ట్రపతికి కోర్టులు గడువు విధించవచ్చా? ఆర్టికల్‌ 201 ప్రకారం విచక్షణాధికారాల వినియోగానికి సంబంధించిన ప్రక్రియను సూచించవచ్చా?

8. గవర్నర్‌ రిజర్వ్‌ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకోవాలా?

9. అధికారికంగా చట్టం అమల్లోకి రాకముందు.. ఆర్టికల్‌ 200, 201 కింద గవర్నర్‌, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమేనా?

10. ఆర్టికల్‌ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్‌కు సంక్రమించిన రాజ్యాంగపరమైన అధికారాలను మార్చడం లేదా నిరాకరించడం న్యాయ వ్యవస్థకు సాధ్యమా?

11. ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ ఆమోదం లేకుండానే రాష్ట్రంలో చట్టం అమల్లోకి వస్తుందా?

12. రాజ్యాంగ వివరణకు సంబంధించిన అంశాలున్న కేసుల్లో తీర్పులు ఇచ్చే ముందు ఆర్టికల్‌ 145(3) కింద కనీసం ఐదుగురు సభ్యులున్న విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేయాల్సిన బాధ్యత సుప్రీం ధర్మాసనానికి ఉండదా?

13. ఆర్టికల్‌ 142 కింద విధానపరమైన అంశాల్లో చట్టపరమైన, రాజ్యాంగపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా?

14. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఆర్టికల్‌ 131 పరిధిలో కాకుండా, వాటిని పరిష్కరించే అధికారాన్ని రాజ్యాంగం సుప్రీంకోర్టుకు కల్పించిందా?


సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే..

తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను వెనక్కి పంపితే అందుకు గల కారణాలనూ తెలపాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్ర్కియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 05:52 AM