Karnataka:కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ.. కీలక విషయాలు వెలుగులోకి..
ABN, Publish Date - Apr 21 , 2025 | 02:34 PM
Karnataka EX DGP Om Prakash Murder Update: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో నిజాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కుమార్తె బలవంతపెట్టి అలా చేయడం వల్లే ఆయన భార్య చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు.
Former Karnataka DGP Om Prakash Murder: అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురైన మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1981 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి నిన్న బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆస్తి తగాదాల కారణంగా భార్య పల్లవి చేతిలో హతమైన సంగతి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్తి విషయమై భార్య పల్లవి భర్తతో తీవ్రంగా గొడవపడింది. ఈ క్రమంలో అతడి ముఖంపై కారం పొడి చల్లి, కట్టేసి, ఆపై కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాగ్వాదం జరిగిన సమయంలో ఒక గాజు సీసాతో కూడా దాడి చేసినట్లు సమాచారం.
హత్య తర్వాత మాజీ డీజీపీ భార్య పల్లవి మరొక పోలీసు భార్యకు ఫోన్ చేసింది. తానే ఈ హత్య చేసినట్లు చెప్పింది. ఆ మహిళ తన భర్తకు విషయం చెప్పగా అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని భార్య పల్లవిని, కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. తల్లీకూతుళ్లను దాదాపు 12 గంటలుగా విచారించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి.
మాజీ పోలీస్ చీఫ్ ఓం ప్రకాష్ శరీరంపై కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. దాడిలో రెండు కత్తులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాష్ పల్లవి బంధువుకు బదిలీ చేసిన ఆస్తి విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాటలతో మొదలైన వాగ్వాదం చేతల్లోకి, ఆపై హత్యకు దారితీసిందని సమాచారం. ఓం ప్రకాష్ కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన కుమార్తె పాత్రపై ఆరా తీస్తున్నారు. హత్యలో తన తల్లి, సోదరి డిప్రెషన్‌తో బాధపడుతున్నారని.. తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని మాజీ డీజీపీ కుమారుడు కార్తికేయ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెదిరింపులకు భయపడి తండ్రి ఓం ప్రకాష్ తన సోదరి ఇంటికి వెళ్లాడని.. హత్యకు రెండు రోజుల ముందు చెల్లి కృతి ఆయనను కలిసి తిరిగి రావాలని పట్టుబట్టడంతో ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చారని కార్తికేయ చెప్పారు.
"నా తల్లి శ్రీమతి పల్లవి గత వారం రోజులుగా నా తండ్రి శ్రీ ఓంప్రకాష్ (రిటైర్డ్ డీజీపీ, ఐజీపీ)ని చంపేస్తానని బెదిరిస్తోంది. ఈ బెదిరింపుల కారణంగా నా తండ్రి తన సోదరి శ్రీమతి సరిత కుమారి ఇంట్లో ఉండటానికి వెళ్ళాడు. రెండు రోజుల క్రితం నా చెల్లెలు కృతి అత్తయ్య సరిత కుమారి ఇంటికి వెళ్లి నా తండ్రి శ్రీ ఓంప్రకాష్‌ను ఇంటికి తిరిగి రమ్మని ఒత్తిడి చేసింది. ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఇంటికి తీసుకువచ్చింది" అని కార్తికేయ చెప్పాడు. నేరం జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనిని, తన పొరుగువారు ఫోన్ చేసి తన తండ్రి కింద పడుకున్నాడని చెప్పారని పోలీసులకు తెలిపాడు.
"సాయంత్రం దాదాపు 5.45 గంటల నేను ఇంటికి వెళ్లాను. అప్పటికే అక్కడ పోలీసు అధికారులు, చాలామంది జనాలు ఉన్నారు. నా తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మృతదేహం పక్కనే ఒక విరిగిన గాజు సీసా, కత్తి కనిపించాయి. ఆ తర్వాత మేం సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. నా తల్లి శ్రీమతి పల్లవి, సోదరి కృతి నిరాశతో బాధపడుతున్నారు. వాళ్ల నాన్నతో తరచుగా గొడవ పడుతుండేవారు.ఆయన హత్యకి వారే కారణమని నేను బలంగా నమ్ముతున్నానని" కార్తికేయ వెల్లడించాడు.
ఓం ప్రకాష్ 1981 బ్యాచ్ కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. ఆయన మార్చి 2015 లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు. దీనికి ముందు ఆయన ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హోమ్ గార్డ్స్ కు కూడా నాయకత్వం వహించారు. బీహార్ కు చెందిన ఆయన భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ, "రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆన్ ప్రకాష్ హత్యకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతని భార్య ఈ నేరం చేసింది. కానీ అది దర్యాప్తులో ఉంది. మనం వేచి చూడాలి. నేను 2015లో హోం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాతో కలిసి పనిచేశారు. ఆయన మంచి అధికారి, మానవతావాది. ఇలా జరిగి ఉండకూడదు. దర్యాప్తులో అన్నీ బయటపడతాయి" అని అన్నారు.
Read Also: Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య
SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు
Updated Date - Apr 21 , 2025 | 02:50 PM