Share News

China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:20 AM

చైనా విజయవంతంగా హైడ్రోజన్‌ బాంబును పరీక్షించింది, ఇది 1000 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వెలువరిస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించగలదు. ఈ పరీక్ష, అణ్వస్త్రాల తరహాలో పేలుడు తీవ్రతను కలిగించినప్పటికీ, తదనంతర రేడియేషన్‌ దుష్పరిమాణాలు లేవని చెబుతున్నారు. ఈ బాంబు అధిక ఉష్ణోగ్రతతో అల్యూమినియం అల్లాయ్‌లు మరియు రక్షణ పరికరాలను కరిగించి, తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించగలదు.

China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం

సాధారణ బాంబు తరహాలోనే.. అయినా

తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం

బాంబు పేలినప్పుడు కొన్ని సెకన్ల పాటు భారీ అగ్నిగోళం

1000 డిగ్రీలకుపైగా వేడితో వినాశనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: అణ్వస్త్రాల తరహాలో కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్‌ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. ఏకంగా 1000 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతను వెలువరిస్తూ, కొన్ని సెకన్ల పాటు అగ్ని గోళం (ఫైర్‌ బాల్‌) నిలిచి ఉండే ఈ బాంబులతో.. తీవ్రమైన విధ్వంసం జరగడమే కాదు అల్యూమినియం అల్లాయ్‌ వంటి లోహాలు కరిగి, రక్షణ పరికరాలు, సామగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. చైనా చేసిన ఈ ప్రయోగాత్మక పరీక్ష వివరాలతో సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తాజాగా కథనాన్ని ప్రచురించింది. చైనా షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ‘705 రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ఈ హైడ్రోజన్‌ బాంబు పరీక్షను నిర్వహించినట్టు తెలిపింది. రెండు కిలోల మెగ్నీషియం హైడ్రైడ్‌ వినియోగించిన పేలుడు పరికరాన్ని.. నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్టు వెల్లడించింది.

gfd.jpg

పేలుడు సమయంలో రెండు సెకన్ల పాటు 1000 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతతో కూడిన అగ్నిగోళం ఏర్పడిందని.. అది సంప్రదాయ టీఎన్‌టీ పేలుడు కంటే 15 రెట్లు ఎక్కువని వివరించింది.


మెగ్నీషియం హైడ్రైడ్‌ ఇంధనంగా..

హైడ్రోజన్‌కు ఆక్సిజన్‌ను జతకలిపినప్పుడు రసాయన చర్య జరిగి నీటిగా మారుతుంది. ఈ క్రమంలో తీవ్రమైన ఉష్ణం వెలువడుతుంది. హైడ్రోజన్‌కు ఉన్న ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని బాంబు తయారీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎక్కువ హైడ్రోజన్‌ ఒకచోట కావాలంటే.. దాన్ని తీవ్ర ఒత్తిడితో ట్యాంకులో నింపాల్సి ఉంటుంది. అలా బాంబు తయారు చేయడం కష్టం. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రైడ్‌ పొడిని పేలుడు పదార్థంగా వాడి.. బాంబు తయారు చేశారు. ఈ బాంబు పేలడం మొదలవగానే.. మెగ్నీషియం హైడ్రైడ్‌ పొడి వెదజల్లినట్టుగా అవుతుంది. పేలుడు సమయంలో ఏర్పడే వేడికి కొంత మెగ్నీషియం హైడ్రైడ్‌ విడిపోయి.. హైడ్రోజన్‌ వాయువు వెలువడుతుంది. అది అంటుకుని మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి మరింత మెగ్నీషియం హైడ్రైడ్‌ విడిపోయి.. హైడ్రోజన్‌ వెలువడటం, అది మండిపోయి మరింత వేడిని విడుదల చేయడం ఒక గొలుసుకట్టు చర్యగా జరుగుతుంది. ఈ క్రమంలో పేలుడు పదార్థమంతా మండిపోయేవరకు కొన్ని సెకన్ల పాటు వెయ్యి డిగ్రీల సెల్సియ్‌సకుపైగా ఉష్ణోగ్రతతో భారీ అగ్ని గోళం ఏర్పడుతుంది. అది విస్తరిస్తూ.. తీవ్ర విధ్వంసం సృష్టిస్తుంది. అతి తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా.. అల్యూమినియం అల్లాయ్‌ వంటి లోహాలు కరిగిపోతాయి. దానితో రూపొందించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రక్షణ పరికరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి మెగ్నీషియం హైడ్రైడ్‌ను వివిధ రంగాల్లో శక్తి ఉత్పాదన కోసం వినియోగించేందుకు అభివృద్ధి చేశారు. ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్‌ను విడుదల చేస్తుంది. దాన్ని ఇంధనంగా వినియోగిస్తారు.


అణ్వస్త్రాలకు బదులుగా..

సాధారణంగా బాంబులలో టీఎన్‌టీ (ట్రై నైట్రో టోలిన్‌)ను పేలుడు పదార్థంగా వినియోగిస్తారు. దానికి కొంత పరిమితి ఉంటుంది. భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో టీఎన్‌టీని వినియోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగానే అణు బాంబులను అభివృద్ధి చేశారు. వాటి పేలుడు తీవ్రతతోపాటు అనంతరం రేడియేషన్‌ కారణంగా ఏర్పడే దుష్పరిమాణాలు ఎన్నో. ఈ క్రమంలోనే అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే.. తదనంతర దుష్ప్రభావాలు ఉండని బాంబుల రూపకల్పనపై అగ్రరాజ్యాలు దృష్టిపెట్టాయి. రష్యా, అమెరికాలు ఇప్పటికే ఈ తరహా బాంబులను రూపొందించాయి. తాజాగా చైనా ఆ తరహా బాంబును పరీక్షించింది.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 07:01 AM