China U.S. Trade Talks: చైనా-అమెరికా రాజీ.. 100% టారిఫ్ ముప్పు లేనట్టే..
ABN, Publish Date - Oct 27 , 2025 | 09:50 AM
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన రెండు రోజుల చర్చల తర్వాత, చైనా, అమెరికా మధ్య ట్రేడ్ పరిస్థితులు సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అమెరికా.. చైనా వస్తువులపై విధించాలనుకున్న అదనపు 100% టారిఫ్ ముప్పు..
ఇంటర్నెట్ డెస్క్: చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన రెండు రోజుల చర్చల తర్వాత, ఇరు దేశాల మధ్య ట్రేడ్ పరిస్థితులు సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చర్చల్లో చైనా, అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందంపై ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చాయి. చైనా మంత్రి లిఫెంగ్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ నేతృత్వంలోని బృందం మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఇరు దేశాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో జరగనున్న సమావేశానికి ముందు జరిగిన ఈ చర్చలు ఇరువురి నేతల మధ్య సానుకూల వాతావరణాన్ని కల్పించాయి.
ఈ చర్చల్లోని ప్రధాన అంశం ఏంటంటే, అమెరికా.. చైనా వస్తువులపై విధించాలనుకున్న అదనపు 100% టారిఫ్ ముప్పు తొలగిపోయింది. చైనా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతి నియంత్రణలకు ప్రతిస్పందనగా అమెరికా వంద శాతం ట్రేడ్ టారిఫ్స్ ను చైనా మీద మోపింది. ప్రస్తుత చర్చల ఫలితంగా ఈ అదనపు టారిఫ్స్ నవంబర్ 1 నుండి అమలు కావడం లేదు. చర్చల అనంతరం చైనా మంత్రి లిఫెంగ్ మాట్లాడుతూ.. బెసెంట్ చెప్పినట్లుగా, 'ఈ 100% టారిఫ్ ముప్పు పూర్తిగా తొలగింది. మా మధ్య జరిగిన చర్చలు బహిరంగమైనవి, లోతైనవి, వ్యూహాత్మకమైనవి అని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, సహకారం ఉభయ దేశాలకు లాభదాయకం అని నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు.
దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మలేషియాలో మాట్లాడుతూ.. చైనాతో ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ASEAN సమ్మిట్ నేపథ్యంలో జరిగిన ఈ చర్చలు, ప్రపంచ వాణిజ్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉందంటున్నారు.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ హబ్
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 27 , 2025 | 10:37 AM