Banking Updates from November 1: నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:56 AM
బ్యాంకుల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వచ్చే నెల 1వ తేదీ నుంచి చెక్ పడనుంది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాదారుడికి జరగరానిది ఏమైనా జరిగితే.. వారసులు ఆ ఖాతా సెటిల్ చేసుకోవడం పెద్ద సమస్యగా...
బ్యాంకుల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వచ్చే నెల 1వ తేదీ నుంచి చెక్ పడనుంది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాదారుడికి జరగరానిది ఏమైనా జరిగితే.. వారసులు ఆ ఖాతా సెటిల్ చేసుకోవడం పెద్ద సమస్యగా ఉండేది. లాకర్ల వస్తువుల సెటిల్‌మెంట్‌లోనూ ఇదే సమస్య. అయితే నవంబరు 1 నుంచి ఈ కష్టాలకు తెరపడనుంది. వీటి పరిష్కారానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025’ను పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి బ్యాంకింగ్ చట్టాల్లో కింది మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటంటే?
నలుగురి వరకు నామినీలు: బ్యాంకు డిపాజిటర్లు ఇక నలుగురి వరకు నామినీలను నామినేట్ చేయవచ్చు. ఈ నలుగురిని ఒకేసారి లేదా ఒకరి తర్వాత ఒకరిని నామినేట్ చేయవచ్చు. ఈ మార్పు వల్ల డిపాజిట్ ఖాతాదారుడికి జరగరాని అనర్థమేదైనా జరిగితే, డిపాజిట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ తేలికవుతుంది.
లాకర్లలోని వస్తువులకు నామినేషన్: లాకర్లు, సేఫ్ కస్టడీలోని వస్తువుల విషయం లో నామినేషన్‌కు అవకాశం ఉంటుంది. అంతేకాదు వరుస క్రమం ప్రకారం మాత్రమే నామినీలకు లాకర్లను నిర్వహించే అధికారం ఉంటుంది.
వాటాల విభజన: కొత్త చట్టంతో ఖాతాదారు తన తదనంతరం తన డిపాజిట్ లేదా లాకర్‌లోని వస్తువుల్లో ఏ నామినీకి ఎంత మొత్తం లేదా ఎంత శాతం చెల్లించాలనే విషయాన్ని ముందుగానే బ్యాంకుకు తెలియజేయవచ్చు. ఈ సదుపాయం ఒకేసారి నలుగురు నామినీలను నామినేట్ చేసే కేసుల్లో మాత్రమే వర్తిస్తుంది.
ఎవరెవరికి: బ్యాంకుల్లో డిపాజిట్లు, లాకర్లు, సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు ఉన్న వ్యక్తిగత/జాయింట్ లేదా సోల్ ప్రొప్రైటరీ ఖాతాదారులు అందరూ.. ఇక తమకు నచ్చిన నలుగురిని తమ నామినీలుగా నామినేట్ చేయవచ్చు. ఒకేసారి లేదా వరుస క్రమంలో తమ ప్రాధాన్యత ప్రకారం నామినీలను నామినేట్ చేయవచ్చు. అయితే ఎవరో ఒక ఖాతాదారుడికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తులు మాత్రం ఎవరినీ నామినేట్ చేసేందుకు అవకాశం లేదు.
తేలిగ్గా క్లెయిమ్స్ పరిష్కారం: కొత్త నిబంధనలతో క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరగనుంది. దీంతో క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యం, వివాదాలకు కూడా అవకాశం ఉండదు.
ఒకే దరఖాస్తు: కొత్త చట్టం ప్రకారం నామినీల నామినేషన్ల కోసం ఇక బ్యాంకులన్నీ ఒకే ప్రామాణిక అప్లికేషన్‌ను అనుసరిస్తాయి. దీనివల్ల క్లెయిమ్స్ సెటిల్‌మెంట్, డాక్యుమెంటేషన్ కూడా సులభమవుతుంది.
జాయింట్ ఖాతాల్లో పారదర్శకత: జాయింట్ ఖాతాదారులు పరస్పర అంగీకారంతో నామినీల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయవచ్చు. దీని వల్ల ఖాతాదారుడు చనిపోయినప్పుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత తేలికవుతుంది.
మరింత రక్షణ: నామినీల ప్రక్రియ సులభతరం కావడంతో డిపాజిట్లకు, లాకర్లకు చట్టపరంగా మరింత రక్షణ ఏర్పడుతుంది. దీనివల్ల ఖాతాదారుడు మరణించినప్పుడు.. అతని నామినీలకు ఖాతాలోని సొమ్ము పంపిణీ త్వరగా, సులభంగా పూర్తవుతుంది.
క్రమబద్ధీకరణ: మారిన నిబంధనలతో వరుస క్రమంలో ఉన్న నామినీలు మాత్రమే, లాకర్లలోని వస్తువులు, సేఫ్ డిపాజిట్లను ఖాతాదారుడు సూచించిన నిష్పత్తిలో అందుకోగలుగుతారు.
రికార్డుల నిర్వహణ: ఈ మార్పులతో బ్యాంకులు తప్పనిసరిగా ఎలకా్ట్రనిక్ పద్దతిలో నామినీల రికార్డులు అప్‌డేట్ చేయాలి. దీనివల్ల మానవ తప్పిదాలకు తావు ఉండదు. బ్యాంకుల మీదా జవాబుదారీతనం పెరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News