Heavy Rains in AP: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 03:14 PM
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 3 గంటలుగా.. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని తెలిపారు.
అమరావతి, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 3 గంటలుగా.. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని తెలిపారు ప్రఖర్ జైన్.
ప్రస్తుతానికి పోర్ట్‌బ్లెయిర్‌కి 440 కిలోమీటర్లు.. విశాఖపట్నానికి 970 కిలోమీటర్లు.. చెన్నైకి 970 కిలోమీటర్లు, కాకినాడకి 990 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కి 1040 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయిందని వివరించారు. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ, రేపటి (ఆదివారం) కి తీవ్ర వాయుగుండంగా.. ఎల్లుండి(సోమవారం) ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ప్రఖర్ జైన్.
ఉత్తర - వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
ఆస్ట్రేలియా పర్యటనపై లోకేష్ ఆసక్తికర ట్వీట్
Read Latest AP News And Telugu News