Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:22 PM
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేమూరి కావేరి సంస్థకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న19 మంది ప్రయాణికులు మృతిచెందారు.
కర్నూలు, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా (Kurnool Dist) లోని కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర నిన్న(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేమూరి కావేరి సంస్థకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ బస్సు ప్రమాదం (Bus Accident)లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బైక్, బస్సు ప్రమాదం వేర్వేరు ఘటనలుగా కర్నూలు జిల్లా పోలీసులు గుర్తించారు.
ఈ బస్సుని ఢీకొనడానికి ముందే శివశంకర్ బైక్‌కి ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బైక్‌పై శివశంకర్, ఎర్రిస్వామి అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణించారని పోలీసులు గుర్తించారు. రెయిలింగ్‌ను ఢీకొట్టి శివశంకర్ బైక్‌తో సహా రోడ్డుపై పడ్డారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో స్పాట్‌లోనే శివశంకర్ మృతిచెందాడని తెలిపారు. ఈక్రమంలో శివశంకర్ బైక్‌ను పక్కకు లాగడానికి ఎర్రిస్వామి ప్రయత్నించాడని వివరించారు.
అదే సమయంలో బైక్‌ను కావేరి బస్సు ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. బైక్‌ను కావేరి బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఈ బస్సు దగ్ధమైందని వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎర్రిస్వామి స్వల్పగాయాలతో తప్పించుకున్నాడని అన్నారు. ఎర్రిస్వామి స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News