JNTU: పార్ట్‌టైమ్ కోర్సుల నిర్వహణలో.. జేఎన్‌టీయూ నత్తనడక
ABN, Publish Date - Oct 07 , 2025 | 08:15 AM
ఉన్నత చదువులు కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం వివిధ యూజీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తేవడంలో జేఎన్‌టీయూ నిర్లక్ష్యం వహిస్తోంది.
- పీజీ, యూజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎదురుచూపులు
హైదరాబాద్ సిటీ: ఉన్నత చదువులు కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం వివిధ యూజీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తేవడంలో జేఎన్‌టీయూ(JNTU) నిర్లక్ష్యం వహిస్తోంది. ఓవైపు ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ కోర్సులను ఆన్‌లైన్/ఆఫ్ లైన్‌లో అందించేందుకు జాతీయ విద్యాసంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐటీలతో పాటు పేరున్న ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు పోటీ పడుతుండగా జేఎన్‌టీయూ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మునుపెన్నడో ప్రవేశపెట్టిన పార్ట్‌టైమ్ పీజీ, ఈవెనింగ్ బీటెక్ కోర్సులకు నోటిఫికేషన్లు ఇవ్వడంలోనూ విఫలమవుతోంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిరుచులకు అనుగుణంగా ఆయా కోర్సుల నిర్మాణం, కోర్సు వ్యవధిని మార్పు చేయడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారన్న భావన విద్యార్థి, ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది.
ఓయూలో రెండేళ్లు.. జేఎన్‌టీయూలో మూడేళ్లు
ఉదాహరణకు ఎంబీఏ/ఎంసీఏ వంటి మేనేజ్‌మెంట్, టెక్నికల్ కోర్సుల కాలవ్యవధి గతంలో ఉన్న మూడేళ్లకు బదులుగా రెండేళ్లకు మార్చుతూ ఉస్మానియా యూనివర్సిటీ గతేడాదే నిర్ణయం తీసుకుంది. డిప్లమో కోర్సులు పూర్తిచేసిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ పూర్తి చేయడానికి గతంలో నాలుగేళ్లు సమయం పడుతుండగా ఉస్మానియా మూడేళ్లలో పూర్తి చేసుకునేందుకు వెసులు బాటు కల్పించింది. అయితే, విద్యార్థులకు ప్రయోజనకరమైన ఇటువంటి అంశాలపై సమీక్షించేందుకు దేశంలోనే అతిపెద్ద సాంకేతిక విశ్వవిద్యాలయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఆచార్యుల కొరతను సాకుగా చెబుతూ పార్ట్‌టైమ్ పీజీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు బీటెక్ కోర్సులను వైండప్ చేయాలనే యోచనలో మరికొందరు ఉన్నతాధికారులు ఉన్నట్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. జేఎన్‌టీయూ నుంచి ఉన్నత విద్యావకాశాలు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు చెంతకు చేరేలా చర్యలు తీసుకోవాలని, పార్ట్‌టైమ్ పీజీ (ఎంబీఏ,ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ) కోర్సుల వ్యవధి ఇంతకు ముందున్న మూడేళ్లకు బదులు రెండేళ్లకు, యూజీ (బీటెక్)కి నాలుగేళ్లకు బదులు మూడేళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. పార్ట్‌టైమ్ పీజీ, యూజీ కోర్సులకు నోటిఫికేషన్లు జారీచేసేలా వీసీ, రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and National News
Updated Date - Oct 07 , 2025 | 08:15 AM