BJP state president Ramchander Rao: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:13 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర...
చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో బలంగా వాదించాలి: రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘హైకోర్టులో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు, అదే అంశంపై రిట్ పిటిషన్ దాఖలు చేస్తే, దానిని సుప్రీంకోర్టు తిరస్కరించడం, హైకోర్టులోనే వాదనలు వినిపించాలని సూచించడం సహజం. దీనిని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు.. ఏదో ఘనకార్యం సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు’ అని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉంటుందని రాంచందర్‌రావు పునరుద్ఘాటించారు. కాగా, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ కార్యకర్తలు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ నేతలపై రఘునందన్ ఫిర్యాదు
కాంగ్రెస్ నేతలు ఏ అధికారంతో ఓటరు కార్డులను పంపిణీ చేస్తున్నారని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఇది ఓటరు కార్డుల చోరీ కాదా..? అని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు ఓటరు కార్డుల పంపిణీ దుకాణం పెట్టుకున్నారని, దీనిపై స్పందించాలని కోరుతూ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. బహిరంగంగా ఓటరు కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్ మాట్లాడటం లేదని, కొత్త ఓటరు కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి అర్హుడెలా అవుతారని నిలదీశారు.