Vinayaka Chavithi 2025: ఈ వినాయక చవితికి గణపతిని పూజించడానికి ఉత్తమ సమయం ఇదే!
ABN, Publish Date - Aug 26 , 2025 | 02:05 PM
సర్వవిఘ్నాలను హరించి విజయాలను చేకూర్చే విఘ్నవినాయకుడి అనుగ్రహం పొందాలంటే ఈ వినాయక చవితి రోజున ఈ సమయంలో పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
హిందువులకు వేలాది దేవతలు ఉన్నా తొలి పూజలందుకునేది మాత్రం గణనాథుడే. ప్రతి సంవత్సరం వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తేదీన వస్తుంది. ఈ రోజున ప్రారంభమైన గణేష్ నవరాత్రులు అనంత చతుర్దశి రోజున ముగుస్తాయి. ఇక ఈ సమయంలో ప్రతి ఇంట్లో గణపతి విగ్రహాన్ని కొలువుతీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఆగస్టు 27 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి నాడు ఎప్పుడు మొదలవుతుంది? విగ్రహాన్ని ప్రతిష్టించడానికి శుభ సమయం ఏది? తదితర పూర్తి సమాచారం మీకోసం..
వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి?
తెలుగు పంచాంగం ప్రకారం, 2025లో భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్టు 26వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. సంప్రదాయ ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో అదే రోజు పండుగ జరుపుకోవడం ఆచారంగా వస్తోందని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 27న వినాయక చవితి పండుగ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు.
గణపతి ప్రతిష్ఠకు శుభ ముహూర్తాలు
ఆగస్టు 27న ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు ఇంట్లో గణపతి ప్రతిష్ఠకు అత్యంత శుభకరమైన సమయం అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గణనాథుని విగ్రహాన్ని స్థాపించి శ్రద్ధగా పూజిస్తే ఐశ్వర్యం, విజయం లభిస్తాయని అంటున్నారు. అదే వినాయక మండపాలలో అయితే సాయంత్రం 7:15 నుంచి 8:42 వరకు గణపతి ప్రతిష్ఠకు అనుకూలమైన ముహూర్తంగా పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు.
ఇంట్లో ఏ విధమైన గణపతిని ప్రతిష్టించాలి?
వినాయకుని విగ్రహం ఇంట్లో పెట్టే ముందు కొన్ని విశేష జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. తొండం కుడివైపు ఉన్న విగ్రహాన్నే ఇంట్లో ప్రతిష్ఠించాలి. ఎలుక వాహనంపై కూర్చున్న గణపతి విగ్రహం మాత్రమే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిలబడిన స్థితిలో ఉన్న గణపతి విగ్రహాలు లేదా నాట్యం చేస్తున్న గణపతులు ఇంట్లో పెట్టకూడదు. పగుళ్లు ఉన్న విగ్రహాలు వాడకూడదు. ఇవి శుభ ఫలితాలకు భంగం కలిగించవచ్చని పంచాంగకర్తలు హెచ్చరిస్తున్నా్రు. అలాగే, గణపతికి సమీపంలో ఏనుగు విగ్రహం కూడా ఉంటే మరింత శుభం కలుగుతుందంటున్నారు.
వినాయకుని పూజ ఎందుకు చేయాలి?
భాద్రపద శుద్ధ చవితినాడు పరమశివుడు గణపతిని గణాధిపతిగా నియమించినట్టు పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ రోజు వినాయకుని పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. హిందూ ధర్మంలో ప్రతి శుభకార్యానికి ముందు గణపయ్యను పూజించాలనే సంప్రదాయం ఉంది. లంబోదరుని అనుగ్రహంతో పనులు నిరవధికంగా, ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయన్న నమ్మకం వుంది.
(గమనిక: పై కథనంలో పేర్కొన్న సమాచారం పలు శాస్త్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వడమైనది. ఇది సంప్రదాయ విశ్వాసాలను ఆధారంగా చేసుకున్నదే గాని ఆధునిక శాస్త్రీయ ఆధారంగా కాదు. వీటిని పాటించాల్సిన అవసరం మీ వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.)
ఇవీ చదవండి..
గణపయ్యకు ఇష్టమైన 5 మోదకాల రెసిపీస్.. ఈసారి తప్పక ట్రై చేయండి..
ఈ సమయాల్లో గణపతిని ప్రతిష్టిస్తే శుభ ఫలితాలు
For More Devotional News
Updated Date - Aug 26 , 2025 | 03:35 PM