Tirumala: పాతికేళ్లుగా.. ‘శ్రీవారి సేవ’లో తరిస్తున్నారు!
ABN, Publish Date - Dec 21 , 2025 | 11:08 AM
‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ)లో 25 ఏళ్ల క్రితం మొదలైన ‘శ్రీవారి సేవ’... దేశ, విదేశాల నుంచి స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే, లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా... సరిగ్గా 25 ఏళ్ల క్రితం (2000) పురుడు పోసుకుంది.
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి దర్శనభాగ్యం కోసం ఏడాది పొడవునా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. ఏడుకొండలవాడిని దర్శించుకుని పరవశిస్తారు. అయితే నిత్యం కొండమీదకు వచ్చే వేలాది భక్తులకు వివిధ రకాల సేవలు అందించడం టీటీడీ సిబ్బందికి సాధ్యం కాదు. వారికి తోడుగా స్వామివారి ప్రాంగణంలో స్వచ్ఛందసేవ చేసేందుకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉత్సాహం చూపుతారు. ‘మానవసేవే మాధవసేవ’గా తరిస్తారు. ‘శ్రీవారి సేవ’గా పేర్కొనే ఈ ఆసక్తికర విభాగం పాతికేళ్ల ప్రస్థానమే... ఈవారం కవర్‌స్టోరీ...
‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ)లో 25 ఏళ్ల క్రితం మొదలైన ‘శ్రీవారి సేవ’... దేశ, విదేశాల నుంచి స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే, లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా... సరిగ్గా 25 ఏళ్ల క్రితం (2000) పురుడు పోసుకుంది. నేడు టీటీడీలో కీలకంగా వ్యవహరిస్తోంది. అప్పట్లో 195 మందితో మొదలైన ఈ ‘స్వచ్ఛంద సేవ’లో ఇప్పటిదాకా సుమారు 20 లక్షల మంది సేవలందించడం విశేషం.
రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో మొదలై...
రవాణా సౌకర్యాలు పెరిగిన తర్వాత అంటే... 1997-98 మధ్య కాలంలో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఏపీ, తమిళనాడుతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు రావడం మొదలైంది. ఈ క్రమంలో స్వామివారి క్షేత్రయాత్రలో భక్తులు ఎదుర్కొంటున్న సమాచార లోపాన్ని గుర్తించిన అప్పటి ఈవో ఎంకెఆర్ వినాయక్ ‘శ్రీనివాస సేవ’ పేరుతో ఓ స్వచ్ఛంద సేవను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో తొలిగా తిరుపతికి చెందిన స్థానికులనే భాగస్వాములను చేసి... తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ప్రారంభించారు. ఆ సేవకులతో ‘శ్రీనివాస సేవ’కు మంచి ఫలితాలు కనిపించాయి.
రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి వెలుపలకు వచ్చే భక్తులను చేతులు జోడించి ‘గోవిందా..’ అంటూ పలకరించి వారి లగేజీని బయటకు తీసుకురావడం, తిరుమల యాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేసుకునేలా సమాచారం ఇవ్వడం వంటివాటితో ‘శ్రీనివాస సేవ’ ఆరంభమైంది. కంచి కామకోటి పీఠాధిపతి చేతులమీదుగా తిరుపతిలో మొదలైన ‘శ్రీనివాస సేవ’కు విశేష స్పందన రావడంతో... తిరుమలలోనూ ప్రారంభించాలనుకున్నారు. 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతులు మీదుగా తిరుమలలోని ప్రధాన కల్యాణకట్ట వద్ద ప్రత్యేకమైన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆసందర్భంలోనే ఈసేవకు ‘శ్రీవారిసేవ’గా నామకరణం చేశారు. ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ‘శ్రీవారిసేవ’ బృందం పనిచేస్తుంది.
నిత్యం 3 వేల మంది....
2005 వరకు ‘శ్రీవారి సేవ’ చేసేందుకు వచ్చే మహిళలు, పురుషులకు వేరువేరుగా క్వార్టర్స్‌లో వసతి కల్పించేవారు. అయితే ఆ తర్వాత సేవకుల సంఖ్య బాగా పెరిగింది. వారు అందించే సేవలు గొప్పగా ఉన్నాయనే ప్రసంశలు రావడంతో... వారికి మంచి వసతి కల్పించాలనే లక్ష్యంతో రూ.100 కోట్ల నిధులతో రెండు భవనాలను మూడు అంతస్తుల్లో నిర్మించారు. మహిళలకు ఓ భవనాన్ని, పురుషులకు మరో భవనాన్ని కేటాయించి దాదాపు 3 వేల మంది బస చేసేలా ‘శ్రీవారిసేవా సదన్1, 2’ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సాధారణ ‘శ్రీవారి సేవ’ కింద నిత్యం 3 వేల నుంచి 3,500 మంది మహిళలు, పురుషులు సేవలో పాల్గొంటున్నారు. విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలో అయితే దాదాపు 4 వేల మంది సేవకులు సేవలిందిస్తున్నారు. తిరుమలలో సుమారు 78 ప్రాంతాల్లో సేవకుల సేవలను టీటీడీ వినియోగించుకుంటోంది. రద్దీ రోజుల్లో క్యూలైన్లు పెరిగే మరో 23 ప్రాంతాల్లో, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటిరోజుల్లో అయితే మరో 22 ప్రాంతాల్లో సేవకులు సేవచేస్తారు.
అర్హతలు, నిబంధనలివి...
స్వామివారికి సేవ చేయాలనుకునేవారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. వ్యక్తిగతంగా లేదా, గ్రూప్‌గా (10 నుంచి 15 మంది) నమోదు చేసుకోవచ్చు. రోజూ కనీసం 6 గంటలు సేవ చేయాలి. 7 రోజుల పాటు సేవకు అవకాశం ఉంటుంది. హిందువులకు మాత్రమే ప్రవేశం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఓసారి సేవ చేస్తే 90 రోజుల తర్వాత తిరిగి అవకాశం లభిస్తుంది. ప్రతీరోజూ ‘సేవా సదన్’లో నిర్వహించే సత్సంగం (శిక్షణ తరగతులు)కు తప్పకుండా హాజరు కావాలి. అత్యుత్సాహంతో రీల్స్, షార్ట్ వంటి వీడియోలు చేయకూడదు. సేవలో ఉన్నప్పుడు డ్రెస్‌కోడ్, ఐడీని తప్పక ధరించాలి. భక్తులతో సహనంగా, వినయంగా వ్యహరించాలి. ప్రతి ఒక్కరినీ ‘గోవిందా’ అనే సంభోదించాలి. ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. సేవ సమయంలో దర్శనాలు చేసుకోవడం నిషేధం. తెల్లని మచ్చలు, చర్మవాయధులు, శారీరక వైక్యలం ఉన్నవారిని సేవకు అనుమతించరు.
ఎలా నమోదు చేసుకోవాలి?
2016 వరకు శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకోవడానికి ఓ నెల ముందు ప్రజా సంబంధాల అధికారి, టీటీడీ, పేరుతో లేఖ రాయాల్సి ఉండేది. టీటీడీ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత బృందాలుగా సేవకు హాజరయ్యేవారు. అయితే టీటీడీ 2016 నుంచి ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. 60 రోజులకు ముందుగా ‘శ్రీవారి సేవ’ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతీనెలా 20 నుంచి 25వ తేదీలోపు ఈ కోటాను విడుదల చేస్తారు.
- శ్రీవారి సేవ చేయాలనుకునే భక్తులు ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’ లేదా మొబెల్ యాప్ ద్వారా తమ సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- అందులో గ్రూప్ సూపర్‌వైజర్, వలంటీర్ (వ్యక్తిగత), వలంటీర్ (గ్రూప్) అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- గ్రూప్ వలంటీర్ సేవకు అయితే 10 నుంచి 15 మంది వరకు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు.
- వ్యక్తిగతంగా కూడా నమోదు చేసుకుని సేవలో పాల్గొనచ్చు.
- రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకుని రిపోర్టింగ్ తేదీ రోజున తిరుమలకు రావాలి.
- తిరుమలలోని ‘శ్రీవారి సేవాసదన్’కు చేరుకునే సేవకులు తమ రిజిస్ర్టేషన్ జిరాక్స్ కాపీతో పాటు ఆధార్‌కార్డు అందజేయాలి.
- ఆధార్‌కార్డును పరిశీలించిన అనంతరం సిబ్బంది సేవకుని ఫొటో తీసి... వివరాలతో కూడిన గుర్తింపు కార్డు, ఏడురోజుల సేవ కేటాయింపు ప్రదేశం, ట్యాగ్, లాకర్, బెడ్‌ను కేటాయిస్తారు.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే విధులు...
శ్రీవారిసేవలో ఆలయ విధులను ‘ఎలక్ర్టానిక్ డిప్’ ద్వారానే కేటాయిస్తారు. ప్రతీరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో భక్తుల వివరాలన్నీ కంప్యూటర్‌లో నమోదు చేసి డిప్ తీస్తారు. అందులో ఎంపికైన భక్తులకు మాత్రమే ఆలయ విధులు కేటాయిస్తారు. ఇందులో ఎలాంటి సిఫార్సులను పరిగణలోకి తీసుకోరు.
ఉచిత దర్శనం, ప్రసాదం...
ఏడు రోజుల పాటు శ్రీవారిసేవ చేసేవారికి ఏడోరోజు సాయంత్రం లేదా, ఎనిమిదోరోజు ఉదయం సుపథం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. అలాగే ఓ లడ్డూను ఉచితంగా అందజేస్తోంది. సేవా సమయంలో ఉచిత బస, భోజన సదుపాయాలనూ టీటీడీనే సమకూర్చుతోంది. పరకామణి సేవకులకు మూడోరోజు, లేదా నాలుగోరోజు స్వామి దర్శనాన్ని కల్పిస్తున్నారు.
కాషాయమే ఎందుకంటే...
‘శ్రీవారి సేవ’ మొదలైన తొలిరోజుల్లో పురుషులకు తెల్లటి దుస్తులు, స్ర్తీలకు పచ్చ రంగు చీర ఉండేది. కొంతకాలం తర్వాత నీలిరంగు చీరను డ్రెస్‌కోడ్‌గా అమలుచేశారు. అయితే అలాంటి రంగు దుస్తులతోనే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు కూడా విధులు నిర్వహిస్తున్న క్రమంలో... సేవకులను గుర్తించడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక చిహ్నంగా ఉంటుందనే కొందరు పండితుల సూచన మేరకు మహిళలకు మెరూన్ బార్డర్‌తో కూడిన కాషాయ రంగుచీర, మెరూన్ బార్డర్ రవికెను ధరించేలా చర్యలు తీసుకున్నారు. పురుషులు తెల్లటి దుస్తులనే ధరించాలి. అయితే సేవకులందరూ తప్పనిసరిగా ‘టీటీడీ’ అనే అక్షరాలున్న స్కార్ఫ్ మెడలో ధరించాలి.
25 ఏళ్లలో 19.31 లక్షల మంది సేవకులు...
శ్రీవారి సేవకు వచ్చే సేవకుల సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతోంది. 2025 నవంబర్ 30వ తేదీ నాటికి సాధారణ ‘శ్రీవారి సేవ’లో 16.76 లక్షల మంది, నవనీత సేవలో 8,291, పరకామణి సేవలో 2.46 లక్షల మంది చొప్పున... మొత్తం 19.31 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుని సేవలు అందించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, న్యూదిల్లీ, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ వంటి రాష్ర్టాల నుంచే కాకుండా... ఎన్‌ఆర్‌ఐ భక్తులు స్వామిసేవలో తరిస్తున్నారు. ‘శ్రీవారిసేవ’లో పాల్గొనేందుకు యువతరం కూడా మక్కువ చూపుతోంది. 2016 నుంచి 2025 అక్టోబర్ నాటి రికార్డుల ప్రకారం 7.01 లక్షల మంది శ్రీవారిసేవలో పాల్గొన్నారు. అందులో 3.81 లక్షల మంది 36 నుంచి 50 ఏళ్ల మధ్యలో, 2.49 లక్షల మంది 51 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్నవారు ఉంటే... 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన యువతరం కూడా దాదాపు 70 వేల మంది పాల్గొనడం విశేషం.
హోదా ఏదైనా... సేవకులమే!
ఇప్పటివరకు ‘శ్రీవారిసేవ’లో తరించిన వారిలో కూలీ పనులు చేసుకునే వారి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సినీతారలు, క్రీడాకారులూ ఉన్నారు. వారం రోజుల పాటు కుటుంబానికి, ఉద్యోగానికి, సొంతూరికి దూరంగా ఉండి... స్వామి సన్నిధిలోనే అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. 2016 నుంచి 2025 అక్టోబర్ వరకు ఉన్న ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ రికార్డులను పరిశీలిస్తే... 7,01,922 మంది తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకుని స్వామివారి సేవలో తరించారు.
ఇందులో న్యాయవాదులు 2,762, వ్యవసాయదారులు 62 వేలు, బ్యాంకు ఉద్యోగులు 9,710, వివిధ రకాల వ్యాపారులు 60,368, వైద్యులు 1,591, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 12,001, ప్రభుత్వ ఉద్యోగులు 57,582, గృహిణులు 3,13,769, న్యాయస్థాన ఉద్యోగులు 1,451, టీచర్లు- అధ్యాపకులు 32,638, పోలీసులు 1,573, ప్రైవేట్ ఉద్యోగులు 35,062, రిటైర్డ్ ఉద్యోగులు 12,897, విద్యార్థులు 13,701, ఇతరత్రా వృత్తుల్లో ఉన్న మరో 84,817 మంది శ్రీవారిసేవలో పాల్గొన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ఎలాంటి హోదాలో ఉన్నా శ్రీవారిసేవలో సామాన్యులుగానే పాల్గొన్నారు. ఓఎన్‌జీసీలో సీజీఎంగా పనిచేసి 2019లో రిటైరైన కృష్ణయ్య సీనియర్ శ్రీవారి సేవకుడు. ఎంతో నిబద్ధతతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణ భక్తుడిలా సేవలందిస్తూ ప్రసంశలు పొందుతున్నారు.
ప్రముఖులు కూడా...
శ్రీవారిసేవలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్న సందర్భాలున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, హీరో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదాలు వడ్డించారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించి సేవ చేశారు. భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా శ్రీవారిసేవకుడే. ఇలా అనేకమంది ప్రముఖులు ఎలాంటి ప్రచారం లేకుండా శ్రీవారిసేవలో పాల్గొన్న సందర్భాలున్నాయి.
మహిళలే అధికం...
ఆది నుంచి సేవ చేయడంలో స్ర్తీ పాత్ర ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సేవా గుణంలో మహిళలు ఓ అడుగు ముందే ఉంటారు. టీటీడీ శ్రీవారి సేవలో గత 25 ఏళ్లలో పాల్గొన్న పురుషుల కన్నా మహిళల సంఖ్యే అధికం. జనరల్ శ్రీవారిసేవలో ఇప్పటిదాకా సుమారు 11.96 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు కూడా శ్రీవారిసేవలో పాల్గొంటూ ‘మానవసేవే మాధవసేవ’గా సేవలందిస్తున్నారు. ఇటీవల లండన్‌లో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్న రీతూ వక్కలంక ఈ సేవలో పాల్గొని తరించారు.
అనేక ప్రాంతాల్లో సేవలు...
ఈ విభాగంలో సేవకులకు అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో రకరకాల విధులు అప్పగిస్తారు. వాటిలో శ్రీవారి ఆలయం, లడ్డూకౌంటర్, నిఘా, ఆరోగ్య, అన్నప్రసాదం, ఉద్యానవనాలు, వైద్య, రవాణా, కల్యాణకట్ట, పుస్తక విక్రయశాలలు వంటివి ఉన్నాయి. వీటితో పాటు క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో రద్దీనికి క్రమబద్ధీకరించడం, భక్తులకు అన్నపానీయాలు అందించడం, వంటశాలల్లో కూరగాయాలు తరగడం, భక్తుల లగేజీని స్కాన్ చేయడం, ఉద్యానవనంలో పూలమాలలు తయారు చేయడం, తిలకధారణ, వయోవృద్ధులు, దివ్యాంగులకు సహాయకులుగా ఉండటం, దర్శన క్యూలైన్లు, వైద్యశాలల్లో వయోవృద్ధులకు, రోగులకు సహాయకులుగా ఉండటం, జీడిపప్పు వలవడం, కొబ్బరికాయల విక్రయాలు, సుపథం ప్రవేశం,
నారాయణగిరి షెడ్లు, చెప్పులు భద్రపరిచే కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, శ్రీవాణి కౌంటర్, స్కానింగ్ హాళ్లు, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్, గదులు కేటాయించే రిసెప్షన్ కౌంటర్లు వంటి దాదాపు 100కిపైగా ప్రాంతాల్లో టీటీడీకి చేదోడువాదోడుగా ఉంటూ విశేష సేవలు అందిస్తున్నారు. తిరుమలలోనే కాకుండా 2014 మార్చి నుంచి తిరుపతిలోనూ ఈ సేవను ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఈ సేవ ప్రారంభమైందో... అదే ప్రాంతమైన రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న విష్ణునివాసం వసతి సముదాయంలో శ్రీవారిసేవ కార్యాలయాన్ని ప్రారంభించారు.
తిరుపతి శ్రీవారిసేవకు నమోదు చేసుకున్న సేవకులు మొత్తం ఏడు రోజుల సేవలో నాలుగు రోజులు తిరుపతిలో మరో మూడు రోజులు తిరుమలలో సేవ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తిరుపతిలో ప్రతీరోజూ 300 మంది సేవలందిస్తున్నారు. ప్రధానంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, కోదండరామస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలో స్థానిక ఆలయాలు, శ్రీనివాసం, మాధవం, అప్పలాయగుంట, అలిపిరి పాదాల మండపం వంటి టీటీడీ అనుబంధ ఆలయాలు, వసతి సముదాయాల్లో సేవలందిస్తున్నారు.
విశేష పర్వదినాల్లో కీలకపాత్ర
సాధారణ రోజులతో పాటు విశేష పర్వదినాలు అంటే బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఉగాది వంటి సమయాల్లో టీటీడీ, విజిలెన్స్ విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు శ్రీవారిసేవకులది కీలకపాత్ర ఉంటుంది. మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి చేరే భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాదాలు ఇవ్వడం... పారిశుధ్యంలో కూడా భాగస్వాములవుతారు. అలాగే మాడవీధుల్లో స్వామివారి వాహనాలు తిరిగే సమయంలో ఎలాంటి తోపులాటలు లేకుండా తాళ్లను చేతబట్టుకుని భక్తులను అదుపు చేస్తారు.
మరిన్ని సంస్కరణలు...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు టీటీడీ ‘శ్రీవారి సేవ’ ప్రమాణాలను మరింత పెంపొందించేలని సంకల్పించారు. ఇందులో భాగంగా గ్రూప్ సూపర్వైజర్ల (మాస్టర్ ట్రైనర్స్) విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇప్పటికే ఈ సేవ కోసం 2,051 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. తొలిదశలో 1500 మందికి ఐఐఎం అహ్మదాబాద్, ఏపీ ప్లానింగ్ విభాగం నిపుణులు తయారుచేసిన మాడ్యూల్ ఆధారంగా... వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని (ట్రైన్ ద ట్రైనీ) ఇప్పటికే మొదలు పెట్టారు. ఫిబ్రవరి 7వ తేదీకి తొలిదశ శిక్షణ పూర్తి కానుంది. సేవా ఆధ్యాత్మిక మూలాలు, శ్రీవారిసేవ పరిణామ క్రమం, వివిధ సందర్బాల్లో సేవ ప్రాముఖ్యత, ప్రత్యేక రోజుల్లో సేవ నిర్వహణ, పటిష్టసేవ అందించేందుకు నైపుణ్యాలు, స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, శ్రీవారివైభవం, తిరుమల సమాచారం,
సనాతన ధర్మం, విలువలు, మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. దీనితో శ్రీవారిసేవలో మరింత నాణ్యత పెరుగుతుందని టీటీడీ అభిప్రాయపడుతోంది. ‘‘భగవంతుడికి, భక్తులకు అనుసంధాన కర్తలుగా శ్రీవారిసేవకులు వ్యవహరిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఎంతోమంది సేవకులు స్వామికి నిబద్ధతతో, నిస్వార్థసేవలు అందిస్తున్నారు. ఇదో పవిత్రమైన సేవ’’ అంటున్నారు ఈ సేవలను పర్యవేక్షించే టీటీడీ పీఆర్వో నీలిమ. మొత్తానికి గత పాతికేళ్ల నుంచి తిరుమలకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తోడ్పడుతున్న ‘శ్రీవారి సేవ’కులు... ‘మానవ సేవే మాధవసేవ’ అనే సూక్తికి గొప్ప ఉదాహరణగా నిలుస్తూ... ఆ ‘గోవిందుడి’ ఆశీస్సులు అందుకుంటున్నారు. అలాంటివారి సేవలను గౌరవిద్దాం!
- జగదీష్ జంగం, తిరుమల
వ్యక్తిగత ప్రవర్తన మార్పునకు...
‘‘హైదరాబాద్‌లో నేనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. గతంలో ఓసారి శ్రీవారిసేవ చేసి మరోసారి సేవకు వచ్చాను. గతంలో శ్రీవారిసేవ చేయడం ద్వారా మంచి అనుభూతి కలిగింది. సేవలో పాల్గొంటే వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు, క్రమశిక్షణతో పాటు... ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో నేర్చుకున్నా. ఆధ్యాత్మిక విశేషాలు కూడా చాలా తెలుస్తున్నాయి. యువత ఇలాంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే లక్ష్యసాధన సులువవుతుంది.
- ఉదయ్ భానురావు, శ్రీవారి సేవకుడు
అదృష్టం ఉంటేనే రాగలం...
నేను ఇప్పటికి తొమ్మిదిసార్లు శ్రీవారిసేవకు వచ్చాను. 2012 నుంచి సేవలో పాల్గొనేలా స్వామి నన్ను ఆశీర్వదించారు. అదృష్టం ఉంటేనే సేవకు రాగలం. భక్తులకు నిస్వార్థంగా సేవ చేయడం తృప్తినిస్తోంది. నా కుటుంబ సభ్యులు కూడా ఎన్నడూ అడ్డుచెప్పలేదు. మనకు మంచి ఆరోగ్యం, శరీరాన్ని ఇచ్చినందుకు స్వామికి సేవ చేసుకోవాలి. ఏడుకొండల్లో ఎక్కడ సేవ చేసినా స్వామికి సేవ చేసినట్టే.
- పద్మ, శ్రీవారి సేవకురాలు
దేశవ్యాప్తంగా విస్తరిస్తాం...
భక్తులకు విశేష సేవలందించడంతో పాటు... స్వామివారి వైభవాన్ని, హిందూ ధర్మ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ‘శ్రీవారి సేవకులు’ కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం తిరుమల, తిరుపతిలో ఉన్న శ్రీవారిసేవను దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నాం. తొలిదశలో చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యాకుమారి, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో శ్రీవారిసేవను ప్రారంభించి... ఆ తర్వాత దేశవ్యాప్తంగా టీటీడీ ఆధీనంలో ఉన్న 61 ఆలయాలకు విస్తరించాలనే ఆలోచన ఉంది.
- అనిల్‌కుమార్ సింఘాల్, ఈవో, టీటీడీ
వారే బ్రాండ్ అంబాసిడర్లు
ప్రపంచం నలుమూల నుంచి వస్తున్న భక్తులకు సేవచేయడంలో శ్రీవారిసేవకుల పాత్ర అత్యంత ప్రధానమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే వారే హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు. శ్రీవారిసేవను మరింత నాణ్యతగా తీర్చిదిద్దేందుకు ‘మాస్టర్ ట్రైనర్స్’కు శిక్షణ ఇచ్చేందుకు... ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులను ఆహ్వానించి ప్రత్యేక శిక్షణ మాడ్యూల్‌ను తయారు చేయించాం.
- సీహెచ్ వెంకయ్య చౌదరి, అదనపు ఈవో, టీటీడీ
భక్తుల్లోనే భగవంతుడు...
స్వామి భక్తుల్లోనే భగవంతుడిని చూస్తూ సేవకులు సేవలందిస్తున్నారు. సేవకులు భక్తులతో వ్యవహరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై నిరంతరం శిక్షణ ఇస్తూనే ఉన్నాం. దర్శనం కోసం వచ్చే భక్తులకు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా టీటీడీ, విజిలెన్స్, పోలీసు విభాగాల్లో మమేకమై సేవకులు సేవచేస్తున్నారు.
- టీ రవి, సీపీఆర్వో, ప్రజాసంబంధాల విభాగం
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు
చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం
Read Latest Telangana News and National News
Updated Date - Dec 21 , 2025 | 11:08 AM