Karnataka Government: చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:29 AM
చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్, బిగుతైన దుస్తులను ధరించి విధులకు హాజరు కావొద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కర్ణాటక సర్కార్ ఆదేశించింది.
బిగుతు దుస్తులతో ఆఫీసులకు రావొద్దు
ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు
బెంగళూరు, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్, బిగుతైన దుస్తులను ధరించి విధులకు హాజరు కావొద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కర్ణాటక సర్కార్ ఆదేశించింది. కార్యాలయాలకు వచ్చే సమయంలో తగిన దుస్తులు మాత్రమే ధరించాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (డీపీఎఆర్) విభాగం నుంచి వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, అదననపు ముఖ్య కార్యదర్శులు, జడ్పీ సీఈవోలకు ఉత్తర్వులు పంపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల అభ్యంతరకర దుస్తులు ధరించి విధులకు వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. విధి నిర్వహణలో హుందాగా కనిపించేలా దుస్తులు ధరించాలని గతంలోనే సూచనలు చేసినా పట్టించుకోని కారణంగానే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్ షడాక్షరి స్వాగతించారు. కాగా, ఇటీవల యువ ఉద్యోగులు చిరిగిన జీన్స్, బిగుతైన దుస్తులతో విధులకు వస్తున్నారని, ఇది అసభ్యకరంగా కనిపిస్తోందని ఓ అధికారి అన్నారు.