Share News

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:05 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపైనా అవగాహన లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

  • ‘పరిషత్‌’లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

  • ఫిరాయింపులపై స్పీకర్‌ తీరు అన్యాయం

  • కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

  • రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి: రాంచందర్‌ రావు

  • బీజేపీలో చేరిన నటి ఆమని, మేకప్‌ ఆర్టిస్టు శోభలత

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపైనా అవగాహన లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాయని ఆరోపించారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి కిషన్‌ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల గెలిచిన సర్పంచులందరూ ఎంతో పట్టుదలతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో కుటుంబ పాలన, అవినీతి పాలన సాగిందని, రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే తరహా పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు సిగ్గువిడిచి తాము పార్టీ మారలేదని మాట మారుస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు రానున్న పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరలేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని శాసనభస స్పీకర్‌ చెప్పడం అన్యాయమని అన్నారు.


మోదీ నాయకత్వంలో రాష్ట్రాల అభివృద్ధి

తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానిమోదీ నాయకత్వంలో అనేక రాష్ట్రాలు అభివృద్థి దిశగా దూసుకుపోతున్నాయని చెప్పారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ప్రముఖ సినీ నటి ఆమని, మేకప్‌ ఆర్టిస్ట్‌ శోభలత కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన చాలా మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారని చెప్పారు. బీజేపీ నగరాలకు మాత్రమే పరిమితమన్న వారికి కనువిప్పు కలగాలని అన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 06:05 AM