Tirumala: తిరుమలలో.. పెళ్లికి ముహూర్తంతో పనిలేదు
ABN, Publish Date - Sep 21 , 2025 | 12:10 PM
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
తిరుమల: హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది. తరాలుగా తిరుమలలో కొనసాగుతున్న ఆచారం ఇది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జంటలు తిరుమల ఆలయం ముందు నిలబడి మెడలో తాళి కట్టే దృశ్యాలు ఇక్కడ సాధారణం. స్వామి సన్నిధిలో జరిగే పెళ్లికి ముహూర్తంతో పని లేదన్న నమ్మకం భక్తుల్లో మెండుగా ఉంది. పైసా ఖర్చు లేకుండా పేద జంటలు ఒక్కటయ్యే అవకాశం తిరుమల కొండమీద ఉంది.
టీటీడీ కళ్యాణ వేదికలో ఉచితం
పాపవినాశనం దారిలో టోల్‌గేట్ ప్రాంతం తంలో టీటీడీ ఏర్పాటు చేసిన ‘సామూహిక కళ్యాణవేదిక’ ఉంది. ఇక్కడ 130 మంది పురోహితులు ఉంటారు. ఒకే సమయంలో పలు వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెళ్లి చేసుకునేవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. హిందువులై ఉండాలి. ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’లోకి లాగిన్ అయ్యి తేదీ, ముహుర్తం, పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తె ఫొటోలు, వివరాలు, చిరునామా, ఆధార్ సహా నింపాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటే ఒక రసీదు వస్తుంది. ముహూర్తానికి 3 నుంచి 90 రోజుల నడుమ ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
వధూవరుల తల్లిదండ్రులు తప్పని సరిగా పెళ్లికి హాజరుకావాల్సి ఉంటుంది. వారిలో ఎవరైనా చనిపోయినా, లేదా విడిపోయినా, ఆనారోగ్యంతో ఉన్నా సంబంధిత పత్రాలు తీసుకురావాలి. కళ్యాణవేదికలో కేటాయించిన పౌరోహితుడు వారికి వివాహం జరిపిస్తారు. టీటీడీ నుంచి పసుపు, కుంకుమ, కంకణం అందజేస్తారు. దంపతులతో పాటు వారి తల్లిదండ్రులు సహా ఆరుగురికి ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు. టీటీడీ కల్యాణవేదికలో పెళ్లి జరిగినట్టు రసీదు ఇస్తారు. వేదిక పక్కనే ఉన్న ప్రభుత్వ రిజిస్ర్టేషన్ ఆఫీస్‌లో ఆ రసీదు చూపి ‘మ్యారేజ్ సర్టిఫికేట్’ పొందవచ్చు.ఇక్కడ కళ్యాణం పూర్తిగా ఉచితం. ఏడాదికి 2500కు పైగా పెళ్లిళ్లు ఈ వేదికలో జరుగుతున్నాయి.
రూ.200తో కాటేజీలో కళ్యాణం
సామూహికంగా కాక విడిగా ప్రత్యేకంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోసం కూడా తిరుమలలో అవకాశం ఉంది. కొన్ని కాటేజీలనే టీటీడీ కల్యాణమండపాలుగా అద్దెకు ఇస్తుంది. ఇలా శంఖుమిట్ట కాటేజీల్లో 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీల్లో 3, అళ్వార్ ట్యాంక్ కాటేజీల్లో ఒకటి చొప్పున మొత్తం పది కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునేవారు టీటీడీ వెబ్‌సైట్ నుంచే బుక్ చేసుకోవాలి. వీటి అద్దె కేవలం రూ. 200లు మాత్రమే. పాతిక నుంచి 50 మంది బంధుమిత్రులతో అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు.
సంపన్నుల కోసం మఠాలు
కాస్త ఖర్చు పెట్టుకుని తగిన అలంకరణతో, మంచి భోజనాలతో వందలాది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోసం తిరుమలలోని వివిధ మఠాల్లోని కళ్యాణ మండపాలు ఉన్నాయి. తిరుమలలో 15 మఠాల్లో కళ్యాణ మండపాలున్నాయి.దాదాపు 500 మంది దాకా కూర్చునే వసతి ఉన్న మండపాలు మఠాల్లో ఉన్నాయి. ఈ మండపాల్లో పెళ్లికి దాదాపు రూ.15 లక్షల దాకా ఖర్చవుతుంది. ఏడాదికి 500 దాకా పెళ్ళిళ్లు మఠాల్లో జరుగుతుంటాయి. ఈ వివాహాలకు టీటీడీకి ఎటువంటి సంబంధం ఉండదు.
పేదల వాడల్లో కళ్యాణమస్తు
తిరుమలకు వచ్చి పెళ్లి చేసుకునే అవకాశం లేని జంటల కోసం 2007లో టీటీడీ కళ్యాణమస్తు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఉత్సవ మూర్తులను తీసుకువెళ్లి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సామూహిక వివాహాలు నిర్వహించారు. పెళ్లికి అవసరమైన బంగారు తాళిబొట్టు, వెండి మట్టెలు, కంకణాలు, వధూవరులకు నూతన వస్ర్తాలు, పూజా సామాగ్రి వంటి వాటిని శ్రీవారు, పద్మావతి అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి జంటలకు పంపిణీ చేశారు. ఉచితంగా విందు భోజనాలను టీటీడీయే ఏర్పాటు చేసింది. 2011 దాకా ఇలా 45,209 జంటలకు వివాహం చేయించారు. ఈ పథకం ఆ తర్వాత ఆగిపోయింది.
తొలిరోజుల్లో రూ.2కే పెళ్లి
1952 నుంచి మాత్రమే తిరుమలలో అధికారికంగా పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. 53 మంది పౌరోహితులతో అప్పట్లో ‘తీర్థవాసి పౌరోహిత సంఘం’ను ఏర్పాటు చేశారు. తొలిరోజుల్లో రూ.2కే వివాహం జరిపించేవారు. ఈ సంఘం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 75 శాతం పౌరోహితులకు, 25 శాతం దేవస్థానానికి చెందేలా నిర్ణయించారు. అప్పట్లో ఆలయం ముందున్న వెయ్యి కాళ్లమండపంలోనే వివాహాలు జరిగేవి. 2003లో వెయికాళ్ల మండపం తొలగించిన తర్వాత పౌరోహిత సంఘాన్ని సుదర్శన సత్రానికి మార్చారు. ఆ సమయంలో టికెట్ ధరను రూ.150కు పెంచారు. వివాహాలు చేసుకునేవారి సంఖ్య బాగా పెరగడంతో ‘సామూహిక కళ్యాణ వేదిక’ను విశాలంగా టీటీడీ నిర్మించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 21 , 2025 | 12:10 PM