Hyderabad: నాచారం పరిసరాల్లో గుప్పుమంటున్న గంజాయి
ABN, Publish Date - Dec 24 , 2025 | 10:44 AM
సికింద్రాబాద్ నాచారం ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆ ఏరియాల్లో నిర్మాణుష ప్రదేశాలను అడ్డాలుగా చేసుకున్న కొందరు విక్రయాలు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
- చెరువు కట్టలు, నిర్మాణుష ప్రదేశాలే అడ్డాలు
- ఆకాతాయిల చేష్టలతో స్థానికుల బెంబేలు
హైదరాబాద్: నాచారం పోలీస్‌స్టేషన్(Nacharam Police Station) పరిధిలోని మల్లాపూర్, నాచారం పరిసర ప్రాంతాలలో కొంతకాలంగా గంజాయి గుప్పుమంటోంది. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్‌ను కోల్పోతున్నారు. దీనిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు చేపట్టినా ఆగడం లేదు. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ పోలీసుల కళ్లు గప్పి గంజాయిని విక్రయించేందుకు విక్రయదారులు సిద్ధమవుతున్నారు. గుట్టుగా జరిగే గంజాయి విక్రయాలను ఎలా కట్టడి చేయాలనేది పోలీసులకు సవాలుగా మారనుంది.
- ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చి...
బతుకుదెరువు నిమిత్తం బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో యువత హైద్రాబాద్‌కు వలసవచ్చి మల్లాపూర్, గోకుల్‌నగర్, చాణక్యపురి కాలనీ, నాచారం, కార్తీకేయ నగర్, బాబానగర్ పరిసర ప్రాంతాలలో ఉంటున్నారు. పలు కంపనీలలో లేబర్‌లుగా, అడ్డా కార్మికులుగా పని చేస్తూ కొందరు అక్రమ గంజా విక్రయాలకు పాల్పడుతున్నారు. తమ స్వస్థలం నుంచి అక్రమ మార్గంలో వెంట తెచ్చిన గంజాయిని ఇక్కడి యువతకు గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
గతంలో గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. గంజాయి సేవించేందుకు ఆకతాయిలు నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోని నిర్మానుష ప్రదేశాలను, చెరువు కట్టలను ఎంఫిక చేసుకుంటున్నారు. గంజాయి సేవించిన తర్వాత సైకోలుగా మారి వికృత చేష్టలతో స్థానికులను బెంబేలెత్తిస్తున్నారు. గంజాయి మత్తులో ఇష్టారీతిన రోడ్లపై వాహనాలను నడిపిస్తూ, ఇదేంటని ప్రశ్నించిన తోటి వాహనదారులపైనే రాళ్లతో దాడులు చేస్తున్నారు.
విక్రయిస్తే కఠిన చర్యలు
గంజాయిని అక్రమంగా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. రిపీటెడ్ నేరస్థులపై పీడీ యాక్టుతో పాటు, గాంజా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. విక్రయదారులతో పాటు, సేవించే వారిని కూడా అరెస్టు చేసి చట్టపరంగా శిక్షిస్తాం. పాత నేరస్థులపై నిఘా పెట్టడంతో పాటు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నాం. నూతన సంవత్సరం వేళ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇష్టారీతిన వదిలేయకుండా వారి పై నిఘా వేసి ఉంచాలి. పరిసర ప్రాంతాల్లో గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
- ధనుంజయ్య, నాచారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 24 , 2025 | 10:44 AM