Share News

SIT Intensifies Phone Tapping Probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:09 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు....

SIT Intensifies Phone Tapping Probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

  • కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌కు నోటీసులని ప్రచారం

  • నిర్ధారించని పోలీసులు.. సమయం పట్టే అవకాశం?

  • ఆధారాలను క్రోడీకరించడంపై సిట్‌ అధికారుల దృష్టి

  • ఆ తర్వాతే.. నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు

  • కేసీఆర్‌ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు!

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు, మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు. సిట్‌ కస్టడీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు కస్టడీ మరో 48గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీసులతో ప్రభాకర్‌రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్‌ఐబీ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్‌ అధికారులు సేకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌కు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్‌ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్‌ బృందం నిర్ధారించడం లేదు. కిందిస్ధాయి విచారణ ఇంకా ఒకదశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చినా వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణల్లో పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలను క్రోడీకరించిన తర్వాత అనుమానితులను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చునని తెలుస్తోంది. సీనియర్‌ జర్నలిస్టులు, నేతలు, పారిశ్రామిక వేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్‌ నంబర్లను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్‌ రావు పాత్ర ఏమిటి? ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏమిటి? వారి మధ్య కమ్యూనికేషన్‌ ఏ విధంగా జరిగింది? ఫోన్‌ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా? వాట్సాప్‌ సందేశాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా? అనే విషయాల నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్‌ అధికారుల ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని సిట్‌ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు ఎస్‌ఐబీ ఉన్న ట్రాక్‌ రికార్డు ఆధారంగా రివ్యూ కమిటీ ఏ మాత్రం అనుమానించకుండా అనుమతులు మంజూరు చేసిందని, రివ్యూ కమిటీకి ప్రపోజల్‌ వెళ్లడానికి ముందు రెండుదశల్లో జరగాల్సిన పరిశీలనలోనే గోల్‌మాల్‌ జరిగిందని సిట్‌ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లుగా పనిచేసిన నవీన్‌చంద్‌, అనిల్‌ కుమార్‌, ప్రభాకర్‌ రావుల మధ్య జరిగిన సంభాషణల చక్రాన్ని బయటకు తీయగలిగితే విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌ రావు వాంగ్మూలాల్లో నాటి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు పేర్లు వచ్చాయని అయినా వీటి ఆధారంగా నోటీసులకు వెళ్లే విషయంలో తొందరపడటం లేదని పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇటీవల కేసీఆర్‌ ఓఎ్‌సడీ రాజశేఖర్‌ రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించినపుడు కొంత కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో నేరం జరిగిందన్న విషయానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభ్యమయ్యాయని, నేరం చేయించెందెవరు? అనే విషయాన్ని రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలను సేకరించాల్సిన అవసరం ఉందని, నేరగాళ్లు తెలివిగా ఆధారాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చారని, నేరానికి ప్రొత్సహించిన వారు ఎవరో చూచాయిగా తెలిసినప్పటికి వారిపై నేర నిరూపణకు సంబంఽధించి పక్కా ఆధారాలు ఉంటే గానీ ముందుకు వెళ్లలేమని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Dec 24 , 2025 | 06:09 AM