Hyderabad: కొత్త రూట్లో సైబర్ వల.. వాటర్ బిల్, పెండింగ్ చలాన్ల పేరుతో ఏపీకే లింకులు
ABN, Publish Date - Sep 04 , 2025 | 08:35 AM
లాటరీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ ఏపీకే లింక్‌లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కరెంట్ బిల్లు పెండింగ్, వాటర్ బిల్లు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు.
- మొబైల్ హ్యాక్ చేసి డబ్బు కాజేస్తున్న వైనం
హైదరాబాద్ సిటీ: లాటరీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ ఏపీకే లింక్‌లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఇప్పుడు కరెంట్ బిల్లు పెండింగ్, వాటర్ బిల్లు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు. పెళ్లి ఎవరిది, శుభాకాంక్షలు ఎవరు పంపారు అన్న ఉత్సుకతతో ఆ లింక్‌లు తెరిచిన వారు బాధితులుగా మారుతున్నారు. ఏపీకే లింక్‌లు తెరిస్తే చాలు.. మొబైల్‌ను హ్యాక్ చేసి, వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారంతో బ్యాంకులో ఉన్న డబ్బు కాజేయడంతో పాటు బ్యాంకు ఖాతాలో డబ్బు లేకుంటే ఈ వివరాలతో రుణాలు తీసుకోవడంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు తీసుకుంటున్నారు. చివరకు పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బు సైతం కాజేస్తున్నారు.
వాటర్ బిల్లు పేరుతో..
‘గత నెల మీ వాటర్ బిల్లు అప్‌డేట్ కాని కారణంగా ఈ రోజు రాత్రి 9.30 గంటలకు నీటి సరఫరా బంద్ చేస్తున్నాం’ అని సైబర్ నేరగాళ్లు సందేశం పంపారు. మరిన్ని వివరాల కోసం హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎసఫబీ బిల్లింగ్ నంబర్ 8918654651ను సంప్రదించాలని, వివరాలను తెలుసుకోవడానికి లింక్‌ను తెరవాలని ‘‘హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్బీ సిటిజన్ సర్వీస్’’ ఏపీకే లింక్‌ను పంపారు. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న సదరు వ్యక్తి ఏపీకే లింక్‌ను తెరవకుండా డిలీట్ చేశారు.
పెండింగ్ చలాన్ల పేరుతో..
కవాడిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (48)కి పెండింగ్ ఆర్‌టీఏ చలాన్ల పేరుతో ఆగస్టు 24న ఏపీకే లింక్ వచ్చింది. వివరాలు తెలుసుకునేందుకు సదరు వ్యక్తి ఏపీకే లింకు తెరిచాడు. అతడి మొబైల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి వ్యక్తిగత వివరాలు సేకరించి ఆగస్టు 30వ తేదీన రూ.51,226 లోన్ ద్వారా, పీఎఫ్ ఖాతా నుంచి రూ.50 వేలు మొత్తం రూ.1.01 లక్షలు కాజేశారు. బాధితులు ఏపీకే లింక్‌లు తెరవడం వల్ల అందులో ఉన్న మాల్ వేర్ సాయంతో ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఫోన్‌లో ఉన్న సమాచారం, ఆధార్, పాన్, బ్యాంకు సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం సాయంతో సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News
Updated Date - Sep 04 , 2025 | 08:35 AM