Coastal Andhra Rainfall: రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నైరుతి
ABN, Publish Date - May 26 , 2025 | 05:54 AM
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు వాతావరణ శాఖ తెలిపింది.
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు కోస్తాకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోనికి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్‌లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఏపీలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్యభారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆదివారంనాటికి మధ్యమహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిన తర్వాత దాని అవశేషాలు (ఉపరితల ఆవర్తనం) తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ అల్పపీడనంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఇది తర్వాత బలపడి ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది. దీనివల్ల రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, దానికి ఆనుకుని ఒడిశా పరిసరాల వరకు ఈ నెల 27వ తేదీనే విస్తరించనున్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోస్తాలో భారీ వర్షాలు!
అరేబియా సముద్రం నుంచి మధ్యమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురిశాయి. మరోవైపు రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఉక్కపోత కొనసాగింది.
Updated Date - May 26 , 2025 | 05:56 AM