ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సాయంత్రంలోగా సాయం

ABN, Publish Date - May 06 , 2025 | 04:43 AM

కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ప్రగతిని సాధించిందని, గతంలో రైతులు మరియు మిల్లర్లకు ఉన్న బకాయిలను చెల్లించడంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అకాల వర్షాలు వల్ల రైతులలో ఆందోళనలు ఉండగా, అదనపు టార్గెట్లు కేటాయించడం ద్వారా సహాయం అందించారు.

AP CM Chandrababu Naidu
  • వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు నేడు పరిహారం

  • పిడుగుపాటు బాధిత కుటుంబాలకూ

  • వెంటనే నష్టాన్ని అంచనా వేయండి

  • పలు జిల్లాలకు ఇంకా వర్షసూచన

  • ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు

  • అధికారులు మానవత్వంతో వ్యవహరించాలి

  • సాంకేతికతతో ముందస్తు సూచనలు చేయాలి

  • రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే

  • అకాల వర్షాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది బాధితుల కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలన్నారు. రాష్ట్రంలో గత రెండురోజులు కురిసిన అకాలవర్షాలపై సోమవారం అమరావతి సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, విపత్తుల నిర్వహణ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పంట, ప్రాణ నష్టం గురించి అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో పరిస్థితులను కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్షసూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్‌ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలన్నారు. సందేశం వెళ్లని పరిస్థితుల్లో దగ్గరగా ఉన్న అధికారులు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం వర్షాలతో రాష్ట్రంలో 2,224హెక్టార్లలో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.


పశ్చిమగోదావరి జిల్లాలో 15 మండలాల్లో 1,033 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 641, కాకినాడ జిల్లాలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. అలాగే అరటి, బొప్పాయి, మామిడి, తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, తిరుపతి, నంద్యాల, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 138 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో నలుగురు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు చెప్పారు.

ధాన్యం కొనలేదనే మాట రాకూడదు..

రబీ సీజన్‌లో 30లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ సీఎంకు వివరించారు. ఇప్పటికే 13లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా ధాన్యం కొనలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు. కాగా, రాబోయే రోజుల్లో కూడా ఆర్టీజీఎ్‌సలోని అవేర్‌ విభాగం, విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు వాతావరణంపై ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటామని చెప్పారు. కలెక్టర్లందరూ ఇందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో విపత్తు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మంచి యంత్రాంగం, సాంకేతికత ఉందని, వీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలకు పలు జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను పునరుద్ధరించడంలో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని సీఎం అభినందించారు.


తక్షణమే పంట నష్టం అంచనా: అచ్చెన్న

అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా తగిన సూచనలు ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.

తడిసిన ధాన్యాన్ని కొంటాం: మంత్రి మనోహర్‌

కాకినాడ: రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. గతంలో 16, 17గా ఉన్న తేమ శాతాన్ని 22 శాతం వరకు అనుమతించాలని మిల్లర్లను ఆదేశించామన్నారు. తరుగు ఐదు కిలోల కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పామన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై పౌరసరఫరాల శాఖ రాష్ట్ర అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధికారులు, మిల్లర్లు, రైతులతో ఆయన సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకూ సుమారు 49లక్షల 40వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. దాదాపు 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోపే జమ చేశామన్నారు. దీనిపై కొందరు వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తూ.. రైతుల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


గతంలో వారు ఖరీఫ్‌, రబీ సీజన్లలో కొనుగోలు చేసింది కేవలం 38 లక్షల టన్నులేనని, కూటమి ప్రభుత్వం దాదాపు 11 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుండగా.. అకాల వర్షాల వల్ల రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేల సూచనల మేరకు మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలో 1:2 వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా అదనపు టార్గెట్లు కేటాయించామన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు 2.56 లక్షల టన్నులకుగాను అదనంగా మరో రూ.50 లక్షల టన్నులు కేటాయించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రూ.1,674 కోట్ల బకాయిలను నెల రోజుల్లోనే రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. మిల్లర్లకు పెట్టిన రూ.400 కోట్ల బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు.

Updated Date - May 06 , 2025 | 07:59 AM