YSRCP MP Mithun Reddy: నాకు జైల్లో వసతులు కల్పించాలి.. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్
ABN, Publish Date - Jul 21 , 2025 | 06:50 PM
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులు కల్పించాలని పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో జులై21న విచారణ జరిగింది. నోటీసు తీసుకోవటం లేదని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. మిథున్‌రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని మిథున్‌రెడ్డి లాయర్లు చెబుతున్నారు. మంచం ఇచ్చామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి (YSRCP MP Mithun Reddy) విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court Remand) నిన్న (ఆదివారం, జులై 20) రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా మిథున్‌రెడ్డి ఉన్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అతన్ని తరలించారు. అయితే జైల్లో వసతులు కల్పించాలంటూ ఇవాళ(సోమవారం, జులై21) ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేయగా.. విచారణ జరిగింది.
మిథున్‌రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని ఆయన తరఫు లాయర్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే మంచం ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి.. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌తో ఫోన్లో మాట్లాడారు. సూపరింటెడెంట్ ను కోర్టుకు రావాలని ఆదేశించారు. డీఎస్పీను పంపిస్తామని న్యాయస్థానానికి సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు.
జైలు సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే..
కాగా.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్‌పై ప్రకటన విడుదల చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్. జులై 20వ తేదీ సాయంత్రం 8:50 గంటలకు మిథున్‌రెడ్డిని జైలు లోపలికి అనుమతించామని తెలిపారు. మిథున్ రెడ్డిపై Cr.No. 21/2024 of CID P.S, A.P, Mangalagiri. IPC సెక్షన్ 420, 409, 384, 201, 120 B r/w 34 & 37 IPC, సెక్షన్ 7, 7 A, & 8, 12, 13 (1) (b), 13 (2), అవినీతి నిరోధక చట్టం 1988 కింద కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.
మిథున్ రెడ్డికి జైలు మెడికల్ ఆఫీసర్‌తో ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. బీపీ, హార్ట్‌రేట్, ఆక్సిజన్ స్థాయిలతో సహా ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వివరించారు. వైద్య పరీక్షల తర్వాత మిథున్‌రెడ్డిని బ్యారేక్‌కు తరలించామని చెప్పుకొచ్చారు. మిథున్‌రెడ్డి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..
విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి
For More Andhra Pradesh News
Updated Date - Jul 21 , 2025 | 08:38 PM