Pawan Kalyan: మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక
ABN, Publish Date - May 27 , 2025 | 07:38 PM
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు (Mahanadu) ఒక చారిత్రక రాజకీయ వేడుక అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే అని.. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని ప్రతి ఏటా జరిగే మహానాడు వేడుక అని ఉద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. రాయలసీమ గడ్డపై... కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని వెల్లడించారు. ఈ శుభవేళ తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌లకి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులకు శుభాభినందనలు తెలిపారు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారు. కార్యకర్తే అధినేత, యువగళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయమని ప్రశంసించారు. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోందని అన్నారు. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 27 , 2025 | 08:15 PM