ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అమరావతి విమానాశ్రయానికి భూసమీకరణ

ABN, Publish Date - Jun 03 , 2025 | 02:58 AM

అమరావతి రెండో దశలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీలు, క్రీడా నగరానికి కలిపి 10 వేల ఎకరాల భూమి అవసరం ఉందని మంత్రి పి. నారాయణ తెలిపారు. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా 40 వేల ఎకరాలు సేకరించేందుకు రైతుల ఒప్పందాలు జరుగుతున్నాయి.

  • స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీకి కూడా: మంత్రి నారాయణ

  • ఈ మూడింటికీ 10 వేల ఎకరాలు కావాలి

  • మొత్తం 40 వేల ఎకరాలు సేకరించాలి

  • ల్యాండ్‌ పూలింగ్‌కే రైతుల మొగ్గు

  • కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా టవర్ల నిర్మాణం

  • అమరావతిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు

  • చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ నిర్ణయం మేరకే రాజధాని నిర్మాణాల ధరలు ఖరారు: మంత్రి

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రెండో దశలో 40 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5 వేల ఎకరాలు, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ కోసం 2,500 ఎకరాలు, అంతర్జాతీయ క్రీడా నగరానికి ఇంకో 2,500 ఎకరాలు.. వెరసి 10 వేల ఎకరాలు కావాలని తెలిపారు. ఈ మూడింటికీ ఇప్పటికే భూ సమీకరణ చేసిన 34 వేల ఎకరాలు సరిపోవన్నారు. వీటికి కావలసిన భూమిని.. భూసేకరణ చేయాలా లేక భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ద్వారా తీసుకోవాలా అనే అంశంపై గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. వారు భూసమీకరణకే మొగ్గు చూపుతున్నారని.. ఇప్పటికే దాదాపు 24 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇచ్చేందుకు పలువురు ముందుకొచ్చారని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సీఆర్‌డీఏ 48వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి విలేకరులకు తెలియజేశారు.


ప్రభుత్వానికి కావలసిన 10 వేల ఎకరాలకు గాను రైతుల నుంచి దాదాపు 40 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాల్సి ఉంటుందని, వారికి రిటర్నబుల్‌ ప్లాట్లు ఇవ్వడానికి, ఇతరత్రా అవసరాలకు భూమి కావాలని గుర్తుచేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలోని నియమ నిబంధనల మేరకు 217 చదరపు కిలోమీటర్ల వరకే అనుమతి ఉందని, ఈ పరిధిని మరింత పెంచేందుకు అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. పెట్టుబడిదారులు అమరావతికి రావాలంటే 5 వేల ఎకరాలతో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అవసరమని తెలిపారు. రాజధానిలో స్థాపించే విద్య, వైద్య సంస్థలకు ఎడ్యుకేషన్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజులో సడలింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. రెండో దశ భూసమీకరణ కూడా పూర్తి చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలో రూ.3.673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్‌ టవర్ల నిర్మాణానికి ఎల్‌-1 టెండర్లను ఖరారు చేస్తూ సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘జీఏడీ టవర్లు 1,2,3,4 నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లలో ఎల్‌-1గా నిలిచిన సంస్థలకు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. జీఏడీ టవర్‌ పనులను రూ.882 కోట్లకు ఎన్‌సీసీ సంస్థ, హెచ్‌వోడీ టవర్లు-1,2 టెండర్లను రూ.1,487 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ సంస్థ, టవర్లు-3, 4 పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థ రూ.1,303 కోట్లతో దక్కించుకున్నాయి. మొత్తం రూ.3673.44 కోట్లతో ఆయా టవర్ల నిర్మాణ పనులను త్వరలోనే ఆయా సంస్థలు ప్రారంభిస్తాయి. ప్రజలు పలు చోట్లకు తిరగకుండా పాలన సౌలభ్యంగా ఉండేందుకు, పరిపాలనంతా ఒకే చోట జరిగే విధంగా ఈ ఐదు టవర్ల నిర్మాణం తలపెట్టాం. 2014-19 మధ్య కాలంలో రూపొందించిన డిజైన్ల ప్రకారమే పనులు కొనసాగుతాయి’ అని స్పష్టం చేశారు.


అమరావతి విమానాశ్రయానికి భూసమీకరణ

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి నారాయణ అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జగన్‌ ఇప్పుడు మాట మార్చారు. అమరావతి నిర్మాణంలో టెండర్ల ధరలు పెంచారని అనవసర ఆరోపణలు చేస్తున్నారు. 22 మంది చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ నిర్ణయించిన ప్రకారమే అమరావతి నిర్మాణాల ధరలను ఖరారు చేశాం.. ఇప్పటివరకు హడ్కో రూ.11 వేల కోట్ల రుణం మంజూరుచేసింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రూ.15 వేల కోట్లు ఇవ్వనున్నాయి. త్వరలో మరికొన్ని బ్యాంకుల ద్వారా రూ.5 వేల కోట్లు వస్తాయి.’ అని తెలిపారు.

Updated Date - Jun 03 , 2025 | 05:37 AM