Vakiti Srihari: అదృష్టమో.. దురదృష్టమో.. ఆగమైన శాఖలిచ్చారు
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:12 AM
రాష్ట్ర పశు సంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్య, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కటే కాదు.. నాకిచ్చిన ఐదూ అంతే
మత్స్య శాఖలో.. అంతా కిందా మీద!
పశుసంవర్ధక శాఖలో బర్లు.. గొర్లు
వాటిని ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఇచ్చారో
అంత అద్భుతంగా తీర్చిదిద్దుతా మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు
కరీంనగర్ అర్బన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశు సంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్య, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకిచ్చిన శాఖలన్నీ ఎట్లున్నయంటే దురదృష్టమో, అదృష్టమో.. గడబిడ అయిన తర్వాత నాకిచ్చారు. మత్స్యశాఖ.. పదేళ్లలో అంతా కిందమీద చేసి నా చేతిలో పెట్టారు. పశుసంవర్థకశాఖ.. దాంట్లో గొర్లు, బర్లు.. అన్నీ కిరికిరులైనంక నా చేతిలో పెట్టిన్రు. ఇప్పుడు నేనా కిరికిరి చూడాల్నా.. లేకపోతే కొత్తగా పనిచేయాల్నా.. అర్థంకాని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సోమవారం కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన వాకిటి శ్రీహరి.. చేపపిల్లల పెంపక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో మత్స్యశాఖలో జరిగిన అవినీతి మూలంగా మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. మొదటిసారిగా ముదిరాజ్ బిడ్డను చేపలమంత్రిగా చేశారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన.. తన శాఖల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘స్పోర్ట్స్ ఒక్కటే కాదు.. నాకిచ్చిన ఐదు అట్లనే ఇచ్చిన్రు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద.
అందులో నియామకాలు ఎవరికి ఇవ్వలే. కానీ యువజన సర్వీసుల శాఖ నాకు ఇచ్చిన్రు. ఇప్పుడు ఉపాధి ఎలా కల్పించాలి? ఇక గొర్ల విషయమైతే ఈ రాష్ట్రంలో జరిగిందేందో మొత్తం దేశానికి తెలుసు. అదే గొర్రె బయటకు దాటె.. మళ్లీ అదే గొర్రె లోపటికి వచ్చె. ఆ శాఖ కూడా నాకే ఇచ్చిన్రు. ఇక చేపల సంగతి.. గత పదేళ్లలో చేపలు ఎలా విడుస్తారో చూద్దామంటే నేనున్నప్పుడు చేపలు విడిచేవారు కాదు. నేను ఇంటికి పోయినంక విడిచేవారు. ఎన్ని విడిచారంటే మూడు లక్షలు అని చెప్పేవారు. కానీ పెరిగేవి మాత్రం మూడు వేల చేపలే. అలా చానా మోసం జరిగింది. దీంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి రాష్ట్రంలోనే మొదటిసారిగా చేపలోనికి చేపల మంత్రి ఇచ్చారు. మరీ చేపల మంత్రినై చేపలు విడవకపోతే నాకు తలవంచుకునే పరిస్థితి వస్తుందని అంటే.. స్పెషల్ బడ్జెట్ కింద రూ.120 కోట్లు మంజూరు చేశారు. చేపల కేంద్రాల నిర్వహణకు, పంపిణీ కోసం బడ్జెట్ ఇచ్చారు’’ అని వివరించారు. అయితే.. ఎంత క్లిష్టమైన పరిస్థితిలో తనకు ఈ శాఖలు ఇచ్చారో.. అంతే అద్భుతంగా తీర్చిదిద్దుతానని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 08 , 2025 | 03:12 AM