ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam Kumar Reddy: ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

ABN, Publish Date - Jun 29 , 2025 | 04:08 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రాజెక్టుల నిర్వహణను తుంగలో తొక్కింది.

  • పదేళ్ల పాలనలో నిర్వహణను గాలికొదిలేసింది

  • జూరాల రోప్‌లు తెగిపోయే ప్రమాదం ఉందని నాడు అధికారులు చెప్పినా పట్టించుకోలేదు

  • ప్రాజెక్టు గేట్లకు కొత్త రోప్‌లు వేయిస్తున్నాం

  • కొత్తగా మరో గ్యాంటీ క్రేన్‌ మంజూరు: ఉత్తమ్‌

  • జూరాల దిగువన రూ.100 కోట్లతో వంతెన నిర్మిస్తామని వెల్లడి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రాజెక్టుల నిర్వహణను తుంగలో తొక్కింది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మంచి ప్రాజెక్టు (జూరాల) కూలిపోవాలని భావిస్తోంది’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం పర్యటించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముందుగా ర్యాలంపాడు రిజర్వాయర్‌ లీకేజీలను పరిశీలించారు. ఆ తర్వాత జూరాల వద్ద రోప్‌లు, గ్యాంటీ క్రేన్‌ పరిస్థితిని పరిశీలించి గద్వాల కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు అధికారులు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే గేట్ల రోప్‌లు తెగిపోయే ప్రమాదం ఉందని, గ్యాంటీ క్రేన్‌, ఇతర మరమ్మతులపై నిధుల కోసం నివేదిక అందించారని, కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత సమస్యకు గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తాము కొత్త రోప్‌లు వేయిస్తున్నామని, రూ.3.5కోట్లతో కొత్తగా మరో గ్యాంటీ క్రేన్‌ను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి నాగార్జునసాగర్‌ వరకు అన్ని ప్రాజెక్టులు 20 నుంచి 25ు నీటి సామర్థ్యాన్ని కోల్పోయాయని, పూడిక పేరుకుపోవడం వల్ల ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టుల్లో పూడిక తీసి నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌ నీటి లీకేజీలను అరికట్టేందుకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించామని, నివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభించి ప్రస్తుతం 2 టీఎంసీల నీటి నిల్వను 4 టీఎంసీలకు పెంచుతామని తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా అంచనాలను రూ.2753 కోట్లకు పెంచామని, డిసెంబరు నాటికి పెండింగ్‌ పనులన్నింటినీ పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలోని మల్లమ్మకుంట రిజర్వాయర్‌, మక్తల్‌, అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాల్లో భూసేకరణను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. రామన్‌పాడు రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ కారణాలతో జూరాల ప్రాజెక్టు భద్రతపై ప్రజలు, రైతుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నిర్మించిన జూరాల 2009లో 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తట్టుకొని నిలబడిందని, ఇప్పుడు కూలిపోయే ప్రసక్తే లేదన్నారు. భీమా నది నుంచి ముందస్తుగా వరద రావడం వల్ల గేట్ల మరమ్మతులు ఆలస్యమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ఏ ప్రాజెక్టు కూడా కూలిపోదని, కానీ బీఆర్‌ఎస్‌ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూరాలలో పూడికతీతకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

1న గోదావరి-బనకచర్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల అనుసంధానంపై శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు జూలై 1వ తేదీన ప్రజాభవన్‌లో అవగాహన కార్యక్రమం జరగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టం గురించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2016లో తొలి అపెక్స్‌కౌన్సిల్‌ సమావేశంలో బీజం పడిందని, ఆ తర్వాత 2018లో ‘గోదావరి-పెన్నార్‌’ పథకం పేరుతో ప్రతిపాదించారని వివరించనున్నారు. ఆ తర్వాత 2018 ఏపీ శాసనసభలో గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని గుర్తు చేయనున్నారు. 2019లో ఈ పథకాన్ని పల్నాడు మిటిగేషన్‌ ప్లాన్‌ కింద నామకరణం చేసి, మూడు ప్యాకేజీలకు టెండర్లు కూడా పిలిచారని గుర్తు చేస్తూ... ఆ జీవోలను చూపించనున్నారు. గోదావరిలో ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటి వినియోగానికి తెలుగు రాష్ట్రాలు ప్రయత్నించాలని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన విషయాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌ ద్వారా వివరించనున్నారు.

జూరాల దిగువన రూ.100 కోట్లతో వంతెన

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు రక్షణలో భాగంగా ఆ ప్రాజెక్టుపై నుంచి భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యేకంగా వంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘జూరాల భద్రత ప్రశ్నార్థకం’ అనే శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(ఎ్‌సడీఎ్‌సవో) మూడేళ్ల కిందట జూరాల రక్షణ నేపథ్యంలో ప్రాజెక్టుపై నుంచి వాహనాల రాకపోకలు నియంత్రించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం విదితమే. ఎస్‌డీఎ్‌సవో నివేదికను అనుసరించి రూ.100 కోట్లతో జూరాల ప్రాజెక్టు దిగువన ప్రత్యేక వంతెనను నిర్మించనున్నారు. దీనికి పరిపాలనపరమైన అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ఈ వంతెనను రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో కట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 04:08 AM