ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మృత్యు జ్వాల 17 మంది మృతి

ABN, Publish Date - May 19 , 2025 | 03:46 AM

రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం ఉదయాన్నే ఘోర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌ వద్ద ఓ భవనం మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

చార్మినార్‌ గుల్జార్‌హౌజ్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాదం

మృతుల్లో 8 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు, నలుగురు వృద్ధులు

ఐదుగురు చిన్నారులను పట్టుకొని కూర్చున్న మహిళ

అందరూ ఊపిరాడక మృతి

ఇద్దరు అన్నదమ్ములు.. వారి పిల్లలు, మనవలు.. అంతా కలిపి 24 మంది! వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అంతా ఒకే చోటికి చేరారు!! రెండు రోజులపాటు ఆనందంగా గడిపారు. కానీ.. ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు వారిలో 17 మందిని కబళించింది. అంతా నిద్రలో ఉండగా.. అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందకి వెళ్లే దారి లేక, పైకి వెళ్లే దారి కనపడక.. ఏం చేయాలో తోచక.. ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నారు! పొగ, వేడి తీవ్రతకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది వచ్చి ఆస్పత్రులకు తరలించినా ఉపయోగం లేకపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం అందరి హృదయాలనూ కలచివేసింది.

  • స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెలరేగిన మంటలు

  • భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న

  • పది మంది.. పొగ, వేడి కారణంగా అపస్మారకస్థితిలోకి

  • ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే వారిలో చాలా మంది మృతి

  • పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి.. ప్రమాదం

  • జరిగిన భవనం లోపలికెళ్లిన అగ్నిమాపక సిబ్బంది

  • ఫైరింజన్‌లో నీళ్లు లేవు.. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ లేదు

  • ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం

  • షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం: ఫైర్‌ డీజీ నాగిరెడ్డి

  • షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన ఆనవాళ్లేవీ లేవు: సీఈ చక్రపాణి

హైదరాబాద్‌ సిటీ, మంగళ్‌హాట్‌, అఫ్జల్‌గంజ్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం ఉదయాన్నే ఘోర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌ వద్ద ఓ భవనం మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు నలుగురు ఉన్నారు. పిల్లలను, వయోధికులను వదిలి వెళ్లలేక.. వారిని కాపాడే ప్రయత్నంలో మిగతా ఐదుగురూ చనిపోయారు. గుల్జార్‌హౌజ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రహ్లాద్‌రాయ్‌ మోదీ (73) కొంతకాలంగా అక్కడ నగల దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన భార్య మున్నీ (73). వారికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రహ్లాద్‌రాయ్‌ తమ్ముడు రాజేందర్‌ (67), ఆయన భార్య సుమిత్ర మోదీ (65). వారంతా ఒకే భవనంలో (జీ+2) నివాసం ఉంటున్నారు. వేసవి సెలవుల సందర్భంగా.. ప్రహ్లాద్‌రాయ్‌ కుమారుడైన పంకజ్‌ (36), అతడి భార్య వర్ష (32), వారి ముగ్గురు పిల్లలు అనన్య (11), ఇధిక (8), ఇరాజ్‌ (2)తో ఆ ఇంటికి వచ్చారు. అలాగే, ప్రహ్లాద్‌ కుమార్తె శీతల్‌ (35) తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో, ప్రహ్లాద్‌ మరో కుమార్తె రజని తన కుమారుడితో, ఇంకో కుమార్తె సంతోషి.. పుట్టింటికి వచ్చారు. రాజేందర్‌ మోదీ పిల్లల్లో కూడా కొందరు ఆ ఇంటికి వచ్చారు. అంతా కలిసి రెండ్రోజులు సరదాగా గడిపారు. ఆదివారం ఉదయం 6.16 గంటల సమయంలో ఆ ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చుట్టుముట్టి, పొగ కమ్ముకోవడంతో.. లోపలున్నవారంతా తమను కాపాడాలంటూ హాహాకారాలు చేశారు. ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళ.. బయటకు వచ్చి తమవారిని కాపాడాలంటూ కేకలు వేయడం గమనించిన స్థానిక యువకులు.. లోపలున్నవారిని బయటకు తేవడానికి ప్రయత్నించారు. కానీ.. పొగ ఎక్కువగా ఉండడంతో వారికి శ్వాస తీసుకోవడమే కష్టమైంది. దీంతో పక్క భవనానికి ఉన్న షట్టర్‌ పగలగొట్టి లోపలికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. తాము లోపలికి వెళ్లేసరికే అక్కడ ఏడుగురు మృతిచెందారని జహేద్‌, అజ్మత్‌ అనే ఇద్దరు యువకులు తెలిపారు. మరోవైపు.. సమాచారం తెల్సుకున్న అగ్నిమాపక అధికారులు ఫైరింజన్లతో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.


ఒకటే మార్గం..

భవనంలోకి వెళ్లేందుకు ఒకటే మెట్ల మార్గం ఉండడం.. అక్కడే అగ్ని ప్రమాదం జరిగి మంటలు, పొగ వ్యాపించడంతో సహాయక చర్యలు ముందుకు సాగలేదు. పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో.. అగ్నిమాపకశాఖ అధికారులు పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ఆ భవనంలోకి వెళ్లారు. మంటలు, పొగలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకువచ్చారు. ఒక గదిలో ఒక మహిళ.. ఐదుగురు చిన్నారులను పట్టుకుని ఉందని, కానీ వారంతా అప్పటికే స్పృహతప్పి ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. బయటకు తీసుకొచ్చాక వారందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కానీ.. వారిలో చాలామంది ఆస్పత్రులకు తరలించే లోపే తుది శ్వాస విడిచారు. కొందరు ఆస్పత్రికి వెళ్లాక చనిపోయారు. కాగా.. మంటలు ఆర్పడానికి 11 అగ్నిమాపక శకటాలను వినియోగించారు. మొత్తం 87 మంది అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని భావించడం వల్ల పొగ కమ్మేసి పదిమంది చనిపోయారని.. వారంతా ఇంట్లోంచి భవనం పైభాగానికి వెళ్లి ఉంటే బతికేవారని కావని రెస్క్యూ అధికారులు ఆవేదన వెలిబుచ్చారు. ఇక.. ఉస్మానియాలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యవేక్షించారు. మృతుల కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.


ఘటనాస్థలికి మంత్రి పొన్నం..

ప్రమాదం గురించి తెలియగానే. సీఎం రేవంత్‌ ఆదేశాల మేరక్జు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించారు. కాగా.. ఉస్మానియా ఆస్పత్రి వద్దకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులపై మృతుల బంధువులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు రాలేదని.. వచ్చిన ఫైరింజన్‌లో సరిపడా నీళ్లు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయిందని.. అంబులెన్సులో ఆక్సిజన్‌ లేదని, అందుకే ఇంతమంది చిన్నారుల ప్రాణాలు కోల్పోయారంటూ వారిని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మార్చురీ వద్దకు చేరుకుని వారిని ఓదార్చడంతో పాటు అధికారులతో మాట్లాడారు. ఇక.. ఘటనాస్థలిని పరిశీలించిన ఫైర్‌ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి ఈ ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూటేనని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా.. హైదరాబాద్‌లో ఒక అగ్ని ప్రమాదంలో ఇంతమంది దుర్మరణంపాలవడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు.

పొద్దున్నే వస్తానని చెప్పి..

వేసవి సెలవులు కావడంతో భర్త, చిన్న కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లారామె. రెండు రోజులు సరదాగా గడిపారు. ఇక ఇంటికి తిరిగి వెళ్దామని భర్త అనగా.. ‘‘ఈ ఒక్క రాత్రి ఉండి ఆదివారం పొద్దున్నే ఉదయం వస్తా’’ అన్నారు. దీంతో వారిద్దరూ శనివారం రాత్రే వెళ్లిపోయారు. ఆమె మాత్రం ఇచ్చినమాట నిలబెట్టుకోలేదు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రజనీ విషాద గాధ ఇది. ‘‘పొద్దున్నే అమ్మ ఇంటికి వస్తుందని ఎదురుచూశాం. కానీ.. చనిపోయింది’’ అంటూ ఆమె పెద్ద కుమారుడు కుషాల్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె రాత్రి తమతో వచ్చి ఉంటే ప్రాణాలతో ఉండేదని రజనీ భర్త రోదించారు. ఇక.. ఈ ప్రమాదంలో.. తమ ఇద్దరు పిల్లలు ప్రాన్షి, ప్రథమ్‌ అగర్వాల్‌ను కోల్పోయిన రోహిత్‌ అగర్వాల్‌ దంపతులు కంటికీ మంటికీ ఏకధారగా విలపిస్తున్నారు.


పిల్లల కోసం లోపలికెళ్లి..

ఈ ప్రమాదంలో మృతి చెందిన పంకజ్‌ నిజానికి మంటలు చెలరేగగానే బయటకు వచ్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. రెండేళ్లు, ఐదేళ్ల వయసున్న తన పిల్లలు లోపల ఉండిపోవడంతో వారిని కాపాడుకునేందుకు మళ్లీ లోపలికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.

ఆ నలుగురూ క్షేమంగా..

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో.. ప్రహ్లాద్‌రాయ్‌ మోదీ కుటుంబసభ్యుల్లో నలుగురు రెండో అంతస్తులో ఉన్నారు. మంటలు చెలరేగగానే వారు భవనం పై భాగానికి వెళ్లి పక్కనున్న భవనంలోకి దూకేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వారిని కాపాడారు. మొదటి అంతస్తులో ఉన్న వారు కూడా ఇలాగే భవనం పైకి వెళ్లి ఉంటే ప్రాణాలతో బయటపడేవారని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.


షార్ట్‌ సర్క్యూట్‌ ఆనవాళ్లే లేవు

  • మెట్రో జోన్‌ సీఈ చక్రపాణి వెల్లడి

హైదరాబాద్‌ సిటీ/ చార్మినార్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్‌ సర్యూట్‌ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రభుత ్వ పెద్దలు తేల్చిచెప్పగా.. షార్ట్‌సర్యూట్‌ జరగలేదని, ఫీడర్‌ ట్రిప్‌ కాలేదని, పోలీసులు ఫోన్‌ చేసిన తర్వాత విద్యుత్‌ సరఫరా నిలిపివేశామని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. గుల్జార్‌ హౌస్‌లో ప్రమాద ం జరిగిన కమర్షియల్‌ భవనాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ మెట్రో జోన్‌ సీఈ చక్రపాణి, హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ ఎస్‌ఈ సోమిరెడ్డి పరిశీలించారు. ఆ ఇంటిలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగిన ఆనవాళ్లు లేవని.. విద్యుత్‌ మీటర్‌ దగ్గర ఫ్యూజ్‌ పోవడం, ఫీడర్‌ ట్రిప్పు కావడం వంటి సమస్యలు తలెత్తలేదని వారు స్పష్టం చేశారు. ‘‘విద్యుత్‌ మీటర్‌ బాగానే ఉంది.. ఆదివారం ఉదయం 7.28 గంటల సమయంలో పోలీసులు అగ్నిప్రమాదం జరిగిందని చెప్పగానే ఆ ప్రాంతంలో విద్యుత్‌సరఫరా నిలిపివేసినట్లు స్థానిక ఏడీఈ మాకు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే మీటర్లు కాలిపోయే, ఫీడర్‌ ట్రిప్పయ్యే అవకాశాలుంటాయి.. బయట అలాంటి పరిస్థితులు కన్పించలేదు’’ అని చక్రపాణి తెలిపారు.


గంటన్నర తర్వాతే ఫైరింజన్లు: ప్రహ్లాదరాయ్‌ కుటుంబసభ్యులు

అధికారుల అలసత్వమే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం పెరగడానికి కారణమైందని ప్రహ్లాద్‌రాయ్‌ కుటుంబ సభ్యుడొకరు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఉస్మానియా మార్చురీ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిందంటూ సమాచారం ఇచ్చిన గంటన్నర తర్వాత ఫైరింజన్‌ వచ్చిందని, కానీ అందులో నీళ్లు లేకపోవడంతో వెళ్లిపోయిందని ఆయన మండిపడ్డారు. అలాగే.. కొంత మంది యువకులు చిన్నారులను కాపాడి కిందకు తీసుకొచ్చి, అంబులెన్సుల్లో ఎక్కించగా.. లోపల ఆక్సిజన్‌ లేదని చెప్పారని తెలిపారు. ఆక్సిజన్‌ ఉండుంటే చిన్నారులు బతికేవారని.. కన్నీరు పెట్టుకున్నారు.

ప్రమాదంపై కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాద ఘటనపై మృతుల బంధువు ఉత్కుష్‌ మోడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చార్మినార్‌ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగకముందు అక్కడి పరిస్థితులు, ఘటన జరగడానికి గల కారణాలు, ప్రమాద తీవ్రతకు దారి తీసిన అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైర్‌, విద్యుత్తు, పోలీస్‌ విభాగాల అధికారులతో విచారణ జరిపి, ఆధారాలను సేకరించి, నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం.. బయటకు వెళ్లే దారిలేకపోవడం, దట్టమైన పొగ పీల్చడం వల్లనే మృతుల సంఖ్య పెరిగినట్లు తేలిందన్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా.. మిగిలిన 14 మంది ఆస్పత్రులకు తరలించే క్రమంలో మృతి చెందినట్లు గుర్తించామని పోలీసులు వివరించారు.

టెర్ర్‌సకు తాళం.. ప్రాణాలు ఆగం..?

గుల్జార్‌ హౌజ్‌లోని మొదటి, రెండో అంతస్తుల్లో మంట లు, దట్టమైన పొగలు వ్యాపించిన క్రమంలో బాధితులు భవనం పైకి వెళ్లడానికి ప్రయత్నించినట్లు తెలిసిందని అగ్నిమాపక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే టెర్రస్‌ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేయడంతో పైకి వెళ్లే మార్గం లేక, తప్పించుకునే అవకాశం లేక బాధితులు మృత్యువాత పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది. అయితే.. ‘‘టెర్రస్‌ పైన నిజంగానే కార్మికులు ఉన్నారా..? ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే పైన ఉన్న కార్మికులు ఏమయ్యారు..? ఎందుకు బాధితులను కాపాడే ప్రయత్నం చేయలేదు..? అగ్ని ప్రమాదంలో ఏదైనా కుట్ర ఉందా..?’’ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అగ్నిమాపక శాఖ వెల్లడించింది.


సీఎం తీవ్ర దిగ్ర్భాంతి

  • మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • బాధిత కుటుంబాలకు ఫోన్‌లో రేవంత్‌ పరామర్శ

  • ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం

  • సంఘటనా స్థలానికి భట్టి, పొన్నం, దామోదర

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలీసులు, ఫైర్‌ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా సమీక్షించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదేశించారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని సీఎం అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు చెందిన వారితో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. కాగా, అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఆదివారం మధ్యాహ్నం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహతో కలిసి వెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం

  • క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం: మోదీ

  • ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్‌ దిగ్ర్భాంతి

  • ఘటన అత్యంత బాధాకరం: రాహుల్‌, ఖర్గే

న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌ హౌజ్‌ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. ప్రమాదంలో ఎక్కువ మంది మృతి చెందడం తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా అనేక మంది మరణించడం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించడం తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గుల్జార్‌హౌజ్‌ ప్రమాదంలో పలువురు మృతి చెందడం, అనేక మంది గాయపడటం అత్యంత బాధాకరమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎం రేవంత్‌ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫోన్‌ చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు. ఎంపీ ప్రియాంక గాంధీ సైతం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


సహాయ చర్యల్లో ఆలస్యం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌హౌజ్‌ ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయ చర్యల్లో అగ్ని మాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్న ప్రమాదమే అయినా, ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించడం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బాధితులకు కేంద్రం పరిహారం ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం సంతాపంతోనే సరిపెట్టుకుందని విమర్శించారు. గుల్జార్‌ హౌజ్‌ ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. అగ్ని ప్రమాదం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, అసద్‌ విచారం

గుల్జార్‌ హౌజ్‌ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పట్ల మాజీ సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ముంద స్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం దిగ్ర్భాంతి కలిగించిందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఘటనా స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.


ఘటన హృదయ విదారకం: మంత్రి జూపల్లి

గుల్జార్‌ హౌజ్‌ ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గుల్జార్‌ హౌజ్‌ ప్రమాదం పట్ల టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం దురదృష్టకరమని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ అన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఇంటి నిర్మాణ శైలి..మరణ శాసనమైందా?

హైదరాబాద్‌ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌హౌజ్‌ అగ్నిప్రమాదం కేసులో ఇంటి నిర్మాణ శైలి 17 మంది పాలిట మరణశాసనమైందని పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. 175 గజాల విస్తీర్ణంలో బయటకు జీ+1గా భవన నిర్మాణం కనిపిస్తున్నా.. లోపలి నుంచి మాత్రం జీ+2గా ఉంది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఈ భవనంలో ప్రధాన రహదారి వైపు మూడు షెట్టర్లను నిర్మించారు. వాటిల్లో కృష్ణ పెరల్స్‌, మోదీ పెరల్స్‌ దుకాణాలను ఇంటి యజమాని నిర్వహిస్తుండగా.. ఇక్రం జ్యువెల్లర్స్‌ ఉన్న మడిగెను అద్దెకు ఇచ్చారు. ఇంటి యజమాని కుటుంబం పై అంతస్తుల్లో నివసిస్తుండగా.. మెట్లకు మార్గం కృష్ణ పెరల్స్‌ లోపలి నుంచే ఉంది. అది తప్ప.. పైన ఉండేవారు బయటకు వచ్చేందుకు మరో దారి లేదు. ఈ కారణంగా.. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరగ్గానే.. లోపలివైపు మొత్తం పొగలు వ్యాపించాయి. బటయకు వచ్చే మార్గం లేక.. లోపలే చిక్కుకుపోయిన 17 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఎక్కువ మంది దట్టమైన పొగను పీల్చడం వల్లే చనిపోయారని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చెబుతున్నారు.

Updated Date - May 19 , 2025 | 03:46 AM