Jaggareddy: అమెరికాకు తలొగ్గిన చరిత్ర మోదీది
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:11 AM
పాకిస్థాన్‌తో యుద్ధం విషయంలో అమెరికాకు తలొగ్గిన చరిత్ర మోదీదైతే.. ఆ అమెరికానే ఎదిరించి, పాకిస్థాన్ తలను వంచిన ఘనత ఇందిరా గాంధీది అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
ఆ దేశాన్ని ఎదిరించి.. పాక్‌ను వంచింది ఇందిర.. కశ్మీర్‌లో కేంద్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది
26 మందిని చంపేదాకా సర్కారుకు సోయి లేదా..?
పాక్‌తో యుద్ధం ఆగిందని ట్రంప్ ఎలా ప్రకటిస్తారు
చెప్పా పెట్టకుండా పాక్ ప్రధాని ఇంటికెళ్లింది ఎవరు?
కిషన్‌రెడ్డి, సంజయ్ జవాబివ్వాలి
రాహుల్‌పై దుష్ప్రచారం చేసినందుకు సారీ చెప్పాలి
లేకుంటే ప్రతిఘటన తప్పదు: జగ్గారెడ్డి
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో యుద్ధం విషయంలో అమెరికాకు తలొగ్గిన చరిత్ర మోదీదైతే.. ఆ అమెరికానే ఎదిరించి, పాకిస్థాన్ తలను వంచిన ఘనత ఇందిరా గాంధీది అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడి.. 26 మంది పర్యాటకులను చంపే వరకూ బీజేపీ ప్రభుత్వానికి సోయి లేదని మండిపడ్డారు. అప్పటి దాకా కేంద్ర నిఘా వ్యవస్థ ఏం చేసిందని ప్రశ్నించారు. దీనిపై దేశ ప్రజలకు మోదీ ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. తప్పులన్నీ వారు చేసి.. నిందలు రాహుల్ గాంధీపై వేస్తారా..? అని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు బీజేపీ నేతలు జవాబులు చెప్పకుండా.. ఆయనపై విమర్శలు చేస్తూ దృష్టి మరల్చే రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌ను ఓడిస్తారని ప్రజలు అనుకుంటే.. ఒక్కసారిగా యుద్ధం ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ప్రకటన వచ్చింది.
ఆ ప్రకటన చేయాల్సింది ప్రధాని మోదీ కదా..? బీజేపీ నేతలకు సిగ్గనిపించట్లేదా..? ట్రంప్ చెబితే రాజీ పడిన వారు.. రాహుగాంధీ కుటుంబంపై నిందలు వేస్తారా..?’’అంటూ ధ్వజమెత్తారు. యుద్ధం చేయండి.. అండగా ఉంటామని మోదీకి భరోసా ఇచ్చిన నేత రాహుల్‌గాంధీ అని తెలిపారు. వాజ్‌పేయీ పుట్టిన రోజున చెప్పా పెట్టకుండా పాకిస్థాన్ వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికెళ్లి.. ఆయన తల్లి కాళ్లు మొక్కలేదా..? అంటూ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన తర్వాతనే వారు రాహుల్‌గాంధీ గురించి మాట్లాడాలన్నారు. ‘‘పాకిస్థాన్ నుంచి కశ్మీర్‌లోకి చొరబడి 26 మందిని చంపినవారు ఎక్కడున్నారో ఇంత వరకు తెలుసుకోలేదు. కిషన్‌రెడ్డికి సిగ్గనిపించడంలేదా..? తెలంగాణలోని బీజేపీ నేతలకు తలకాయలు ఉన్నాయి తప్ప.. అందులో మెదళ్లు లేవు. వారు ఎందుకు ర్యాలీలు చేస్తున్నారో ఆ ట్రంప్‌కే తెలియాలి’’ అంటూ ఎద్దేవా చేశారు. రాహల్‌గాంధీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తమ నుంచి ప్రతిఘటన తప్పదని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను జగ్గారెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 04:11 AM