ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: బనకచర్లను అడ్డుకోండి

ABN, Publish Date - Jun 20 , 2025 | 03:31 AM

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

  • తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన

  • జీడబ్ల్యూడీటీ, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కారు

  • అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతీ పొందలేదు.. ఇది తీవ్ర అభ్యంతరకరం

  • బనకచర్ల బదులు ఇచ్చంపల్లి-సాగర్‌ అనుసంధానంపై చర్చకు సిద్ధం

  • గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు మాకు ఎన్వోసీ కావాలి

  • పాలమూరు, సమ్మక్క, తుమ్మిడిహెట్టిలకు అన్ని అనుమతులూ ఇవ్వండి

  • ఏపీ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులిస్తూ మాపై అలసత్వం సరికాదు

  • కేంద్రం వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు

  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడం.. అవసరమైతే సుప్రీం కోర్టుకు

  • జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ స్పష్టీకరణ

  • అతి త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ.. పాటిల్‌ హామీ ఇచ్చారన్న ఉత్తమ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ - 1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం - 2014కు విరుద్ధంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతోపాటు ఇతర ఉన్నతాధికారులతో రేవంత్‌, ఉత్తమ్‌ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, కానీ, జీడబ్ల్యూడీటీ - 1980లో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదని వివరించారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా ప్రాజెక్టును కట్టాలనుకుంటే తొలుత ఆ నదీ యాజమాన్య బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని, కానీ, ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏ నిబంధనలూ పాటించకుండా.. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనుమతులు లేకుండానే పోలవరం కింద ఎత్తిపోతల పథకాలు

సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రికి రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ వివరించారు. పోలవరం డిజైన్లను మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గోదావరిలో వరద జలాలు ఉన్నాయని ఏపీ నిజంగా భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయమై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదన్నారు. అన్ని వేదికల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

1,500 టీఎంసీలకు అనుమతులు ఇవ్వండి

గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు.. మొత్తంగా 1,500 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫలితంగా, కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘‘ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియపై సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి’’ అని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి, సమ్మక్క - సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, గంగ, యమున నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి కూడా కేటాయించాలని కోరారు.

కేంద్ర మంత్రితో సమావేశం తర్వాత మంత్రి ఉత్తమ్‌ ఆ వివరాలను మీడియాకు వివరించారు. ‘‘సీఆర్‌ పాటిల్‌తో సుమారు గంటసేపు సమావేశం జరిగింది. అన్ని ప్రాజెక్టుల విషయంలోనూ సానుకూలంగా స్పందించారు. బనకచర్ల డీపీఆర్‌ తమకు అందలేదని, దీనిపై త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అతి త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చర్చిస్తామని హామీ ఇచ్చారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కుదరదు. కానీ.. ఏపీ చేపడుతోంది. ఇది రెండు రాష్ట్రాలకు మంచిది కాదు’’ అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్‌ దాస్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్‌, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 03:31 AM