Miss World: మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు రూ.2 కోట్లే!
ABN, Publish Date - Apr 22 , 2025 | 03:48 AM
మిస్ వరల్డ్ పోటీలకు రూ.25 కోట్ల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. దీంతో, ఈ పోటీలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్యయ్యేది కేవలం రూ.2 కోట్లే కానుంది.
రూ.25 కోట్ల స్పాన్సర్‌షిప్‌కు ఫార్మా, మీడియా, పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు
ములుగు, రామప్ప, సాగర్‌లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకూ ఆహ్వానాలు
గ్రాండ్ ఫినాలేకి 3,500 మందికి అవకాశం
రష్యా, ఇజ్రాయెల్ సుందరిలకు ప్రత్యేక భద్రత
బుద్ధ జయంతిన బుద్ధవనానికి బ్యూటీలు నెల రోజుల పండుగ.. 80% ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ‘మిస్ వరల్డ్’ పోటీలకు రూ.25 కోట్ల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. దీంతో, ఈ పోటీలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్యయ్యేది కేవలం రూ.2 కోట్లే కానుంది. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల వాటా రూ.27 కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని కూడా స్పాన్సరర్ల నుంచి సమకూర్చుకోనున్నట్టు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈమేరకు.. పలు ఫార్మా, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటక, బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. పోటీలకు నిధులు సమకూర్చేందుకు ఆయా సంస్థలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ పోటీలను తెలంగాణలో నిర్వహించినందుకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం 5.4కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. స్పానర్సర్లు సమకూర్చే నిధుల నుంచే దీన్ని కూడా చెల్లించనున్నారని సమాచారం. మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సరర్స్ ఇచ్చిన డబ్బును, ప్రభుత్వం పెట్టే సొమ్మును అనేక పనుల కోసం ఖర్చుచేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. పోటీల్లో పాల్గొనే 100 దేశాల సుందరీమణులకు బస, రక్షణ ఏర్పాట్లు, భోజన వసతి, పోటీల వేదికల ఏర్పాట్లు, రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు వారిని తీసుకెళ్లడం, రాష్ట్ర పర్యాటక ప్రాంతాలపై ప్రచారం, చేనేతకు ప్రచారం.. వీటన్నింటికీ కలిపి రూ.27 కోట్ల దాకా ఖర్చవుతుందని లెక్కతేల్చారు. మే 7న మొదలుపెడితే.. జూన్ 2న గవర్నర్‌ను, సీఎంను పోటీదారులు కలిసేవరకు.. మొత్తం 24 కార్యక్రమాలు జరగనున్నాయి. ఒక్కో కార్యక్రమానికీ ఒక్కో స్పాన్సరర్ చొప్పున 24మందిని ఎంపికచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఒకవేళ స్పాన్సరర్లు తగ్గితే ఒక్కొక్కరికి ఒకటి, రెండు కార్యక్రమాలు కూడా ఇవ్వొచ్చు. ఆయా కార్యక్రమాల్లో సదరు స్పాన్సరర్లకు సంబంధించిన ప్రకటనలు, పేర్లను వేసేలా ఒప్పందం ఉండనుంది.
మెరిసిపోనున్న పర్యాటక హోటళ్లు..
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు పర్యాటక హోటళ్లు, పర్యాటక ఆస్తులకు కొత్త సొబగులు అద్దనున్నారు. నాగార్జునసాగర్, ములుగు, రామప్ప తదితర చోట్ల ఉన్న పర్యాటక హోటళ్లను ఆధునికీకరించనున్నారు. ఆయా ప్రదేశాల్లో థీమ్ ఈవెంట్లను కూడా పర్యాటక శాఖ ఏర్పాటుచేసింది. రామప్ప పర్యాటక ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనానికి.. బుద్ధపూర్ణిమ రోజున పోటీదారులను తీసుకెళ్లనున్నారు. హోటళ్ల ఆధునికీకరణ పనుల పర్యవేక్షణకు పర్యాటక శాఖ కొందరు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లను కూడా తీసుకుంది.
పటిష్ఠ భద్రత ఏర్పాట్లు..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణుల రక్షణపై పర్యాటక శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. పోటీదారుల వ్యక్తిగత రక్షణ, వారు బస చేసే చోటు నుంచి పోటీల వేదికలకు వెళ్లే మార్గంలో రక్షణతో పాటు.. పోటీ జరిగే వేదికల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడానికి పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటోంది. తమ దేశ పోటీదారులకు ప్రత్యేక రక్షణ కల్పించాలంటూ రష్యా, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. వారికి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. దీనిపై త్వరలోనే డీజీపీ-పర్యాటక శాఖ అధికారులు భేటీ కానున్నారు.
స్థానికులకూ స్వాగతం..
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించే ఈవెంట్లతో పాటు.. రామప్ప, నాగార్జునసాగర్, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు స్థానికులను సైతం ఆహ్వానించనున్నారు. కొన్నిచోట్ల ఓపెన్ ఎయిర్ కార్యక్రమాలు ఏర్పాటుచేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటుచేసి డిన్నర్ కూడా అక్కడే ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో కార్యక్రమం దగ్గర 500ల మంది స్థానిక ముఖ్యులు పాల్గొనేలా సీటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బుద్ధవనం సందర్శన రోజున.. పేరిణి నృత్యం, బ్యాలే డ్యాన్స్ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే(ముగింపు రోజు) వేడుకకు 3,500ల మందికి పాస్‌లు ఇవ్వనున్నారు.
వారి ఖర్చులు వారివే!
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఇటీవల కాలంలో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. ఏర్పాట్లపై చర్చ, ఇతర అంశాలపై సమావేశాల కోసం ఆమె లండన్ నుంచి వచ్చి వెళ్తున్నారు. అయితే.. జూలియా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆమెకు టూరిజం ప్లాజాలో బస కేటాయించిన అధికారులు.. అందుకు అద్దె కట్టించుకున్నారు. 50శాతం రాయితీ మాత్రం ఇచ్చి, మిగతా మొత్తాన్ని కట్టించుకున్నారని తెలిసింది.
80 శాతం ఏర్పాట్లు పూర్తి
మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు 80 శాతం పూర్తయ్యాయి. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను, చేనేత, సంస్కృతి, ఆహారం తదితరాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా మార్చుకునే వ్యూహంలో ఉన్నాం. పోటీలో పాల్గొనే సుందరీమణులకు.. తెలంగాణకు సంబంధించిన కొంత ప్రమోషన్ చేయాలనే షరతు విధించాం. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ విషయంలో మాకు సహకరిస్తోంది. మే నెల అంతా తెలంగాణకు పండుగ లాంటిదే. ఈ పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు వారి వారి దేశాల్లో ప్రచార ఒప్పందాలు ఉంటాయి. వాటిలో భాగంగా ప్రసారమయ్యే వీడియోల్లో మన తెలంగాణ పర్యాటకం, చేనేత, ఇతర అంశాలను ప్రమోట్ చేసేలా చేస్తున్నాం.
- స్మితా సభర్వాల్, పర్యాటక శాఖ కార్యదర్శి
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి
BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం
Cybercrime: సైబర్ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 22 , 2025 | 03:48 AM