CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:59 AM
ఉద్యోగ విరమణ తర్వాత ఆయా శాఖల్లో కొనసాగుతున్న, కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగే వారిని ప్రభుత్వం తొలగిస్తోంది. అయితే ఓ కీలక శాఖలో పూర్తి అదనపు బాధ్యతల్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న అధికారిని రిటైరయ్యాక కూడా కొనసాగించాలంటూ ఓ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సీఎం రేవంత్‌కు ఓ కీలక శాఖ మంత్రి లేఖ
ఈ నెల 30న రిటైరవుతున్న సదరు ఎస్‌ఈ
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ విరమణ తర్వాత ఆయా శాఖల్లో కొనసాగుతున్న, కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగే వారిని ప్రభుత్వం తొలగిస్తోంది. అయితే ఓ కీలక శాఖలో పూర్తి అదనపు బాధ్యతల్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న అధికారిని రిటైరయ్యాక కూడా కొనసాగించాలంటూ ఓ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన శాఖకు అనుబంధంగా ఉండే ఓ విభాగానికి ఎస్‌ఈగా ఉన్న సదరు అధికారి ఈనెల 30న పదవీ విరమణ చేస్తున్నారని, అయితే ఆ విభాగంలో ఇంకా నిర్వహించాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందులో ప్రభుత్వం ‘‘సూపర్ గేమ్ చేంజర్’’గా భావిస్తున్న ప్రాజెక్టు కూడా ఉందని లేఖలో తెలిపారు.
ఆయా పనులను సక్రమంగా, వేగంగా జరిపేందుకు సదరు అధికారి అవసరమని, పదవీ విరమణ తర్వాత కూడా శాఖలో ఆయన కొనసాగేలా అవకాశమివ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టులు ఆశించిన సమయానికి పూర్తయ్యేందుకుగాను ఢిల్లీ అఽధికారులతో పరిచయమున్న ఈ అధికారి అవసరమని తెలిపారు. ఏడాదిపాటు ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 8న మంత్రి లేఖ రాయగా తాజాగా అది వెలుగులోకి వచ్చింది. సీఎం ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నందున దీనిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రిటైరైన వాళ్లను ప్రభుత్వం వద్దని పంపిస్తుంటే మంత్రి ఇలా సీఎంకు లేఖ రాయడం పట్ల శాఖలో చర్చ జరుగుతోంది.